
సినిమా ఆఫర్ ఆశ చూపి ఒక టీవీ నటిని లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నటుడు-దర్శకుడు బీఐ హేమంత్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
లైంగిక వేధింపులు, మోసం, నేరపూరిత బెదిరింపుల ఆరోపణలపై రాజాజీనగర్ పోలీసులు బెంగళూరులో హేమంత్ కుమార్‌ను అరెస్టు చేశారు. సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి తనను మోసం చేశాడని టీవీ నటి, రియాలిటీ షో విజేత కూడా అయిన హీరోయిన్ ఫిర్యాదు చేసింది.
2022లో తనతో మాట్లాడి సంప్రదించి, ఒక సినిమాలో ప్రధాన పాత్రను ఆఫర్ చేశాడని ఆమో ఆరోపించింది. 3 అనే చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని చెప్పడమే కాదు, పారితోషికంగా రూ.2 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చి ఒక ఒప్పందంపై సంతకం చేశాడు. అలాగే అందులో రూ.60వేల ముందుగానే చెల్లించాడు కూడా. అయితే ఆ
తరువాత, షూటింగ్‌ను ఆలస్యం చేయడం, షూటింగ్ సమయంలో ను తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, దీనికి అంగీకరించకపోవడంతో తనను బెదిరించాడని ఆమె పేర్కొంది. ఫిల్మ్ ఛాంబర్ ద్వారా మధ్యవర్తిత్వం మేరకు తాను షూటింగ్ పూర్తి చేసినప్పటికీ, హేమంత్ తనను వేధించడం , బెదిరించడం మాత్రం ఆపలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
2023లో ముంబైలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో హేమంత్ తనకు మద్యం తాగించి, మత్తులో ఉన్నట్లు చిత్రీకరించాడని, ఆ తర్వాత ఆ వీడియోను ఉపయోగించి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.దీన్ని వ్యతిరేకించినపుడు హేమంత్ గూండాలతో బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. తద్వారా తనకు తన తల్లికి ప్రాణహాని భయం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొంది.
అంతేకాదు అనుమతి లేకుండా సినిమాలోని తనకు సంబంధించిన, తొలగించిన కొన్ని అసభ్యకర సన్నివేశాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని ఆరోపించింది. ఈ క్లిప్‌లను పోస్ట్ చేయడం ద్వారాతన మర్యాదకు భంగం కలిగించాడని ఆరోపించింది. దీంతోపాటు హేమంత్ ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందంటూ బెంగళూరు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఈ ఆరోపణలనేపథ్యంలో హేమంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టుముందు హాజరు పర్చారు. తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఇదీ చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!