Kalyan Sivasailam: స్నేహితుడి అనారోగ్యం.. చికిత్స రిపోర్టు ఆలస్యం.. ఆ ఘటనతో.. | Bengaluru: 5C Network Kalyan Sivasailam Inspirational Journey In Telugu | Sakshi
Sakshi News home page

Bengaluru: స్నేహితుడి అనారోగ్యం.. చికిత్స రిపోర్టు ఆలస్యం.. ఆ ఘటనే.. కల్యాణ్‌ ఆవిష్కరణకు బీజం

Aug 26 2022 8:33 AM | Updated on Aug 26 2022 8:45 AM

Bengaluru: 5C Network Kalyan Sivasailam Inspirational Journey In Telugu - Sakshi

కల్యాణ్‌ శివశైలం(PC: Kalyan Sivasailam)

సమస్య ఎదురైనప్పుడు నిట్టూర్చేవారు బోలెడు మంది. ఆ సమస్యను నిట్టనిలువునా నిలదీసి, విశ్లేషించి పరిష్కారం సాధించేవారు కొద్దిమంది.  వీరినే విజేతలు అంటారు. కల్యాణ్‌ శివశైలం ఈ కోవకు చెందిన యువకుడు. క్లౌడ్‌–బేస్డ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘5సి నెట్‌వర్క్‌’తో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న కల్యాణ్‌ గురించి... 

అవసరాల నుంచి ఆవిష్కరణలు పుడతాయి... అనే మాటను కల్యాణ్‌ శివశైలం విషయంలో మరోసారి గట్టిగా నమ్మవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం కల్యాణ్‌ స్నేహితుడు అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరాడు. ఎంఆర్‌ఐ రిపోర్ట్‌ కోసం రెండు రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది.

చికిత్సలో రిపోర్ట్‌ కీలకం కదా!
‘ఎందుకు ఈ ఆలస్యం?’ అనే ఆలోచనకు కల్యాణ్‌లో ఆరోజే బీజం పడింది. అది ఒక రూపం తీసుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. స్నేహితుడు అహ్మద్‌తో కలిసి బెంగళూరు కేంద్రంగా ‘5సి నెట్‌వర్క్‌’ పేరుతో హెల్త్‌టెక్‌ స్టార్టప్‌ స్టార్ట్‌ చేశాడు. ఊహించినట్లుగానే సూపర్‌హిట్‌ అయింది.

ఈ క్లౌడ్‌బేస్డ్‌ ప్లాట్‌ఫామ్‌ 42 నిమిషాల్లోనే రేడియాలజీ టెస్ట్‌ రిజల్ట్‌ను తెలియజేస్తుంది. ఈ రిజల్ట్‌ను మరో రేడియాలజిస్ట్‌ క్రాస్‌ చెక్‌ చేస్తాడు. కచ్చితమైన ఫలితాల కోసం ఏఐ మోడల్‌ను ఉపయోగిస్తారు.

‘5సి నెట్‌వర్క్‌’ దేశవ్యాప్తంగా ఎన్నో హాస్పిటల్స్, డయాగ్నొస్టిక్‌ సెంటర్‌లు, ఎంతో మంది రేడియాలజిస్ట్‌లతో అనుసంధానమై పని చేస్తుంది. దేశంలో ఎంతమంది రేడియాలజిస్ట్‌లు ఉన్నారు అనే విషయం కంటే, సమర్థవంతమైన రేడియాలజిస్ట్‌లతో కలిసి పనిచేయడానికి తొలి ప్రాధాన్యత ఇచ్చింది 5సి నెట్‌వర్క్‌. ‘యాక్సెస్‌ టు క్వాలిటి రేడియాలజిస్ట్‌’ను తన విధానంగా ఎంచుకుంది.

‘5సి నెట్‌వర్క్‌’ వల్ల గతంతో పోల్చితే రేడియాలజిస్ట్‌లు రెండింతలు ఎక్కువ సంపాదించే అవకాశం ఏర్పడింది. చిన్న క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్‌ సెంటర్‌లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

కంపెనీ మొదలు పెట్టిన కొత్తలో నెలకు 26 రేడియాలజీ రిపోర్ట్‌లు వెలువరించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వేలలో ఉంది. తమ తొలి క్లయింట్‌ మైసూర్‌లోని సీఎస్‌ఐ హాస్పిటల్‌.

పే–పర్‌–యూజ్‌ బిజినెస్‌ మోడల్‌తో నిర్వహించబడుతున్న ‘5సి నెట్‌వర్క్‌’ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలనేది భవిష్యత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఎన్నో దేశాల్లో కంపెనీకి అనువైన వాతావరణం ఏర్పడింది.

మంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చదువుకున్న కల్యాణ్‌కు ‘సమస్య’ గురించి విచారించడం కంటే విశ్లేషించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు. విశ్లేషణలోనే అతనికి పరిష్కారాలు దొరికేవి.

అది ఇంటికి సంబంధించిన చిన్న సమస్యలు కావచ్చు. చదువుకు సంబంధించినవి కావచ్చు. ఇప్పుడు అదే ఫార్ముల తన జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేలా చేసింది. పాతికేళ్ల వయసులో స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాడు కల్యాణ్‌.

‘కుర్రాడు ఏదో చెబుతున్నాడు. రిస్క్‌ ఎందుకులే’ అని అవతలి వాళ్లు అనుకునే వయసు అది. మరి ఆ వయసులోనే పెద్ద పెద్ద ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు జరపడం, చేయి తిరిగిన రేడియాలజిస్ట్‌లతో చేయి కలపడం, తన ప్రాజెక్ట్‌ను ఓకే చేయించుకోవడం అంత తేలికైన విషయం కాదు. నిర్ల్యక్ష్యం, అసహనం...మొదలైనవి తనకు ఎదురయ్యే ఉంటాయి. అయితే వాటి గురించి కల్యాణ్‌ ఎక్కడా ప్రస్తావించలేదు.

విజయాల్లో హాయిగా తేలిపోతున్నప్పుడు, ఆ బరువు ఎందుకు అనుకున్నాడేమో! బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌లో ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా చదువుకున్న కల్యాణ్‌కు శాస్త్రీయ విషయాలపైనే కాదు న్యాయసూత్రాలపైన కూడా మంచి అవగాహన ఉంది. ఇది తన వ్యాపారానికి ప్లస్‌ అవుతుంది కూడా.

ప్రతి సంస్థకు తనదైన యుఎస్పీ ఉంటుంది. మరి ‘5సి నెట్‌వర్క్‌’ యుఎస్పీ ఏమిటి? కల్యాణ్‌ శివశైలం మాటల్లోనే చెప్పాలంటే... ‘కాంబినేషన్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సుపీరియర్‌ సర్వీస్‌ లెవెల్స్‌’.. ‘5సి’ పరుగు చూస్తుంటే అది అక్షరాలా నిజమే అనిపిస్తుంది!  

చదవండి: Manasi Chaudhari: ‘పింక్‌ లీగల్‌’.. మహిళలకు న్యాయ సమాచారం.. ఏ డౌట్‌ వచ్చినా..              

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement