Manasi Chaudhari: ‘పింక్‌ లీగల్‌’.. మహిళలకు న్యాయ సమాచారం.. ఏ డౌట్‌ వచ్చినా..

Hyderabad: Manasi Chaudhari Pink Legal Helps Woman Over Problems - Sakshi

హక్కులకు మానసిక బలం ‘పింక్‌ లీగల్‌’

దేశం ఎంత అప్‌డేట్‌ అవుతున్నప్పటికీ.. ఆడవాళ్లపై భౌతిక దాడులు, అత్యాచారాలు, అవమానాలు మాత్రం ఆగడం లేదు.  వంటింట్లో మొదలు ఆఫీస్, స్కూల్, కాలేజీ,  రోడ్డు మీద... ఇలా ప్రతిరోజూ మహిళ అవమానాలను ఎదుర్కొంటూనే ఉంది. 

మహిళల కోసం ఉన్న చట్టాలు ఏంటి... ఆ చట్టాలు  ఎలా పనిచేస్తున్నాయి, ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో ఉంటే ఆ ఇబ్బందికి పరిష్కార మార్గం ఏ సెక్షన్‌ ద్వారా దొరుకుతుంది,  పోలీసు స్టేషన్‌లో, కోర్టులో, ఆఫీస్‌లో, బయట అవమానాలు ఎదుర్కొన్న మహిళ ఏయే సెక్షన్‌ల గురించి తెలుసుకోవడం అవసరం... వంటి వివరాలతో ‘పింక్‌ లీగల్‌’ అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు హైదరాబాద్‌కు చెందిన మానసి చౌదరి. 

ఢిల్లీలోని జిందల్‌ గ్లోబల్‌ లా స్కూల్లో మానసి న్యాయశాస్త్రంలో పట్టా పొంది, రాష్ట్రహైకోర్టులో రెండేళ్లపాటు ప్రాక్టీస్‌ చేశారు. సుప్రీంకోర్టు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వద్ద అసిస్టెంట్‌గా చేశారు. ఆ సమయంలోనే సెక్షన్‌ 377పై తీర్పు, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలు ప్రవేశించ వచ్చనే తీర్పు రావడం జరిగింది.

సుదీర్ఘ అనుభవం కలిగిన మానసి తనకు వ్యక్తిగతంగా ఎదురైన ఓ పరిణామాన్ని జీర్ణించుకోలేక ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)లో మహిళల హక్కులు తెలిపే సెక్షన్‌లు ఎన్ని ఉన్నాయి, ఏయే సెక్షన్ల కింద ఏయే హక్కులు మహిళలకు ఉన్నాయనే సమాచారాన్ని సంక్షిప్తంగా అందించేందుకు చేసిన కృషి నేడు ఎందరో స్త్రీలకు ఆసరాగా నిలుస్తోంది.

ఫలించిన మూడేళ్ల పోరాటం
ఐదేళ్ల క్రితం ఓ రోజు రాత్రి ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో నలుగురు యువకులు తప్పు తమదే అయినా మానసిపై భౌతిక దాడి చేసేందుకు సిద్ధపడ్డారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన మానసి తన వద్ద ఉన్న సాక్ష్యాలను పోలీసులకు ఇచ్చి ఆ యువకులకు శిక్షపడేలా చేశారు. న్యాయవాదిని కాబట్టి నాకు రూల్స్‌ తెలుసు.

‘హక్కులు తెలియని మహిళల పరిస్థితి ఏంటి?’ అని ఆలోచించిన మానసి ఆ రోజు నుంచి మూడేళ్లపాటు మహిళలకు న్యాయసమాచారాన్ని అందించేందుకు కసరత్తు చేసింది. ఓ పక్క ఉద్యోగం చేస్తూ.. ఇంకోపక్క సీనియర్‌ న్యాయవాది వద్ద ప్రాక్టీస్‌ చేస్తూనే రాత్రివేళల్లో వెబ్‌సైట్‌ పనుల్లో నిమగ్నమయ్యేవారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఉన్న లా బుక్స్‌ తిరగేశారు.

రాజ్యాంగంలో మహిళలకు ఉన్న హక్కుల గురించి తెలుసుకున్నారు. 2018లో తొలుత ‘లైంగిక వేధింపులు, మహిళల ఆస్తిహక్కులు’ అనే అంశాలపై పైలట్‌ ప్రాజెక్ట్‌గా వెబ్‌సైట్‌ ద్వారా సమాచారాన్ని అందించారు. దీనికి మంచి ఆదరణ, స్పందన వచ్చినప్పటికీ, మహిళకు దక్కాల్సిన న్యాయం, హక్కుల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే సంకల్పంతో మరో అడుగు ముందుకేశారు.

ఇందుకోసం సుప్రీం, హైకోర్టులకు చెందిన సీనియర్‌ క్రిమినల్‌ లాయర్లను సంప్రదించారు, సుమారు పదిమంది లా విద్యార్థుల సాయం తీసుకున్నారు. మూడేళ్లపాటు రాత్రింబవళ్లు కష్టపడి చివరికి మహిళలకు ధైర్యం చేకూర్చేలా, వారి హక్కులు తెలుసుకునేలా ‘లైంగిక వేధింపులు, గృహహింస, వివాహం, విడాకులు, ఆస్తిహక్కులు, బాలల హక్కులు, సైబర్‌ బెదిరింపులు..’ వంటి వాటిపై అవగాహన కలిగించేలా ఓ వెబ్‌సైట్‌ ను రూపొందించారు.  


తన టీమ్‌తో మానసి చౌదరి 

లక్షమంది ముందడుగు
2020 మార్చి 8న వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు దానికి సోషల్‌ మీడియా వేదికగా ప్రచారాన్ని నిర్వహించారు. ‘పింక్‌ లీగల్‌’ కాన్సెప్ట్‌ నచ్చి ఆమెతో కలసి మహిళలకు అండగా నిలిచేందుకు, న్యాయసలహాలు అందించేందుకు లా స్టూడెంట్స్‌ కొందరు జత కలిశారు. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో చదువుతున్న సుమారు 30 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహిళల హక్కులు, న్యాయ సలహాలను గుర్తుచేస్తున్నారు. దీనిలోనే‘ఫ్రీ హెల్ప్‌లైన్‌’ ను ప్రారంభించారు.

బాధితులు ఎవరైనా అప్లికేషన్‌ను పూర్తి చేసి దానిలో ఫోన్‌ నంబర్‌ రాసి, సబ్‌మిట్‌ చేస్తే వాలంటీర్‌ సదరు మహిళకు ఫోన్‌ చేసి న్యాయ సలహా అందిస్తారు. అంతేకాదు, ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు వెన్నంటి ఉంటారు. సాంకేతికంగా ఎటువంటి పరిజ్ఞానం లేని వారిని దృష్టిలో పెట్టుకున్న మానసి గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందమయ్యారు.

ఆయాప్రాంతాల్లో మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ‘పింక్‌లీగల్‌’ గురించి చెప్పి, వారికి ఏయే సెక్షన్‌లు ఎలా ఉపయోగపడతాయనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఏదైనా అంశంపై వికీపీడియా ఎలా అయితే పూర్తి సమాచారాన్ని అందిస్తుందో.. మహిళలకు చట్టాలు, హక్కులపై ‘పింక్‌ లీగల్‌’ అలా ఒక ఎన్‌సైక్లోపిడియాలా పని చేస్తుందంటున్నారు మానసి.

పింక్‌ లీగల్‌ కాన్సెప్ట్‌ నచ్చి మానసితో కలసి మహిళలకు అండగా నిలిచేందుకు, న్యాయసలహాలు అందించేందుకు లా విద్యార్థులు జత కలిశారు. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో చదువుతున్న సుమారు 30 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహిళల హక్కులు, న్యాయ సలహాలను గుర్తుచేస్తున్నారు. 
– చైతన్య వంపుగాని
చదవండి: Miss Universe: చారిత్రక మార్పు! ఇకపై వాళ్లు కూడా పాల్గొనవచ్చు! అయితే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top