Samrat Nath: శెబ్బాష్‌ సామ్రాట్‌.. ఈ సైకిల్‌ను ఎవరూ దొంగిలించలేరు!

Assam: Samrat Nath Smart Theft Proof E Bicycle His Successful Journey - Sakshi

సెల్ఫ్‌–మేడ్‌ సామ్రాట్‌

ఆవిష్కరణలకు ‘ఉత్సాహం’ ‘ఆసక్తి’ మాత్రమే అన్ని సందర్భాలలో కారణం కాకపోవచ్చు. ‘బాధ’ ‘ఆవేదన’  కూడా కొన్ని సందర్భాలలో బలమైన కారణం కావచ్చు. ఎలా అంటే... అస్సాంలోని కరీంగంజ్‌ జిల్లాకు చెందిన సామ్రాట్‌నాథ్‌ సాధారణ సైకిల్‌ను ‘థెఫ్ట్‌–ప్రూఫ్‌’ ఎలక్ట్రికల్‌ సైకిల్‌గా రూపకల్పన చేసి శబ్భాష్‌ అనిపించుకుంటున్నాడు.

సింగిల్‌ చార్జ్‌తో ఈ సైకిల్‌ 60 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. గట్టి భద్రత ఇచ్చే ఫీచర్లతో రూపొందించిన ఈ సైకిల్‌ను ఎవరైనా దొంగిలించడానికి ప్రయత్నిస్తే వెంటనే మెసేజ్‌ స్మార్ట్‌ఫోన్‌కు చేరుతుంది. బైక్‌కు అమర్చిన అలారం అదేపనిగా మోగుతుంది. 

‘ప్రపంచంలో ఏ మూల నుంచైనా ఈ సైకిల్‌ను కంట్రోల్‌  చేయవచ్చు’ అంటున్న సామ్రాట్‌ అదనపు భద్రతలో భాగంగా ఈ సైకిల్‌కు ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌  ఫీచర్‌ను కూడా ఇన్‌స్టాల్‌ చేశాడు.

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే...
సామ్రాట్‌ వాళ్లది కరీంగంజ్‌కు 55 కి.మీ దూరంలో ఉన్న అనిపూర్‌ అనే గ్రామం. తాను ఎనిమిదవ తరగతి చదివే రోజుల్లో, ఒకరోజు రాత్రి పూట తమ సైకిల్‌ దొంగతనానికి గురైంది. ఎంత ప్రయత్నించినా దాని ఆచూకి తెలియలేదు. నిజానికి తమకు అది సైకిల్‌ కాదు. కుటుంబంలో ఒకరు! తండ్రి ఉపాధికి చేదోడువాదోడుగా ఉండేది.

సైకిల్‌ పోయింది అనే బాధ తనను ఎన్నోరోజుల పాటు బాధించింది. అప్పుడు అనుకున్నాడు...దొంగిలించడానికి వీలులేని ఎలక్ట్రికల్‌ బైసికిల్‌ను తయారుచేయాలని. ఇంటర్నెట్‌ ద్వారా కోడింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఎలక్ట్రికల్‌  బైస్కిల్‌ ఎలా పనిచేస్తుంది? జీపిఎస్, ఇతర కనెక్షన్‌ల గురించి నేర్చుకున్నాడు. ఆ తరువాత...యాప్‌ తయారీపనిలోకి దిగాడు.

తాను దాచుకున్న డబ్బులతో మొదట ఒక మామూలు సైకిల్‌ కొనుగోలు చేశాడు. ఫిట్టింగ్‌కు అవసరమైన భాగాలు కొనడానికి సెల్‌ఫోన్‌ రిపేర్‌ పనులు చేసేవాడు. జీపిఎస్‌ ట్రాకింగ్‌...మొదలైన వాటి దారా సైకిల్‌కు ఎలక్ట్రికల్‌ డెవలప్‌మెంట్‌ చేశాడు. పాత ల్యాప్‌టాప్‌ల నుంచి రీసైకిల్‌ చేసిన లిథియం ఐయాన్‌ బ్యాటరీల ద్వారా పవర్‌ సమకూర్చాడు.

సొంతంగా జీపిఎస్‌ సర్క్యూట్‌ తయారుచేశాడు. తన బైసికిల్‌కు ‘సామ్‌ ఎలక్ట్రాన్‌’ అని నామకరణం చేశాడు. 19 సంవత్సరాల సామ్రాట్‌ సిల్చార్‌ ఐటీఐ స్టూడెంట్‌. ‘ఇలాంటి మోడల్‌ ప్రస్తుతం మన ఇండియన్‌ మార్కెట్‌లో లేదు’ అంటున్న సామ్రాట్‌ స్టార్టప్‌ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు.

సామ్‌ ఎలక్ట్రానిక్‌ బైసికిల్‌ ద్వారా నా మీద నాకు నమ్మకం వచ్చింది. భవిష్యత్‌లో నా కొత్త ఆవిష్కరణలకు ఇది కచ్చితంగా స్ఫూర్తి ఇస్తుందంటున్నాడు సామ్రాట్‌. 

చదవండి: పేరెంటింగ్‌: భయం కాదు... భరోసా పెరగాలి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top