పేరెంటింగ్‌: భయం కాదు... భరోసా పెరగాలి

Authoritative parents are supportive and often in tune with their childrens needs - Sakshi

ఆదివారం పిల్లలను తీసుకుని పార్కుకు వెళ్లారు సంగీత దంపతులు. లోపలికి అడుగుపెట్టగానే పార్కులో ఎత్తైన గోడ అడ్వెంచర్‌వాల్‌ మీదనే పడింది పిల్లల దృష్టి. పోటీ పడి పరుగందుకున్నారిద్దరూ. ఎవరు ముందు గోడ దగ్గరకు వెళ్తారో అనేది ఒక పోటీ. ఎవరు ముందు గోడ ఎక్కుతారోననేది మరో పోటీ.

వాళ్ల పరుగును అందుకోలేక, పరుగెత్తి వెళ్లకుండా ఉండలేక ఆయాసపడుతున్నారు తల్లిదండ్రులు. గోడ ఎక్కే ప్రయత్నంలో పిల్లలు కింద పడతారేమోననే భయం. వారి ఆందోళనను ఆపుకోలేక వెనుక నుంచి ‘పడిపోతారు, జాగ్రత్త’ అని పిల్లలకు వినిపించేటట్లు పెద్దగా అరుస్తున్నారు. ఈ ఆందోళననే వద్దంటున్నారు చైల్డ్‌ సైకాలజిస్టులు. పిల్లలకు చెప్పాల్సింది ‘పడిపోతారు, జాగ్రత్త’ అని కాదు. ‘జాగ్రత్తగా ఎక్కండి, కింద మేమున్నాం’ అని భరోసానివ్వాలంటున్నారు.

పిల్లలకు నీళ్లు కనిపిస్తే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. చెట్టు కనిపిస్తే చిటారు కొమ్మకు వేళ్లాడే వరకు మనసు ఊరుకోదు. అనుక్షణం పిల్లలను ఓ కంట కాచుకుంటూ ఉండడం మంచిదే, కానీ అడుగడుగునా వాళ్ల ఉత్సాహానికి అడ్డుకట్ట వేయడం మాత్రం మంచిదికాదు. పిల్లలకు భయం తెలియదు, పెద్దవాళ్లు తమ భయాన్ని పిల్లల మెదళ్లలోకి రవాణా చేస్తారు. ఇది పిల్లల మెదళ్లలో ఇంకిపోతుంది. ఫలితంగా తమ మీద తమకు నమ్మకం నశిస్తుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది.  
 
ఇదే గుర్తు
పిల్లల మాటల్ని జాగ్రత్తగా వినాలంటారు సైకాలజిస్ట్‌ సుదర్శిని. ‘అమ్మా ఆ చెట్టు పై కొమ్మ మీదకు వెళ్తే ఎలా ఉంటుంది, ఆ గోడ వెనుక ఏముంటుంది’ అని వాళ్ల నోటి వెంట వచ్చిందీ అంటే... అంతకంటే ముందు ఆ ఆలోచన వాళ్ల మెదడులో పుట్టిందనే కదా అర్థం. చెట్టు పై కొమ్మ మీదకు వెళ్తే జరిగే ప్రమాదాన్ని వివరించాలి. చెట్టు మీద ఎంతవరకు వెళ్లడం క్షేమకరమో చెప్పి, వాళ్లను చెట్టు ఎక్కమని, ‘నీ భద్రత కోసం కింద మేముంటాం’ అని చెప్పాలి.

చెట్టు ఎక్కడం నేర్పించడమే కరెక్ట్‌. అంతే తప్ప, పిల్లలకు తమ కళ్లతో ప్రపంచాన్ని చూపిస్తూ, తమ కాళ్లతో నడిపిస్తూ పెంచడం సరైన పెంపకం కాదంటారామె. పిల్లలు తమ ప్రయత్నంతో కిందపడిపోతే చేయి అందించి లేపడమే బెస్ట్‌ పేరెంటింగ్‌. పడకుండా పెంచాలనుకోకూడదు. పిల్లలు తమ తొలి ప్రయత్నంలో సక్సెస్‌ కాకపోతే మరో ప్రయత్నం చేయడానికి ప్రోత్సహించాలి. అంతేకానీ ‘నీ వల్ల కాదులే, ఇక మానుకో’ అని నిరుత్సాహపరచకూడదు.  

ఏ తీరున పెంచుతున్నాం?
‘‘ఒక తరంలో... యాభై ఏళ్ల కిందట దాదాపుగా అన్ని ఇళ్లలోనూ అథారిటేరియన్‌ పేరెంటింగ్‌ ఉండేది. ఒకరకంగా అది నియంతృత్వమే. ‘మేము తల్లిదండ్రులం. మేము నిర్ణయిస్తాం. పిల్లలు అనుసరించి తీరాల్సిందే. అదే క్రమశిక్షణ’ అనుకునేవాళ్లు. పాతికేళ్ల కిందట పరిస్థితి పూర్తిగా పెర్మిసివ్‌గా మారిపోయింది. అంటే... పిల్లలు దేనికీ నొచ్చుకోకూడదన్నట్లు వాళ్లు అడిగీ అడగక ముందే అన్నీ అమర్చడం. అవసరం ఉన్నాలేకపోయినా అడిగినవన్నీ కొనిచ్చి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు.

ముఖ్యంగా గడచిన తరంలో ఆర్థిక ఇబ్బందులును ఎదుర్కొన్న వాళ్లు ఈ తరంలో తమ పిల్లలకు అవసరానికి మించి అన్నీ సమకూర్చేయడం, తమకు దక్కని సంతోషాలన్నీ పిల్లలకు మిక్కిలిగా అందాలని తాపత్రయపడడం ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి ఇది మంచి ఫలితాలనివ్వదు. అలాగే నెగ్లెక్ట్‌ఫుల్‌ పేరెంటింగ్‌ అనేది ఫలానా రోజుల్లో అని కాదు, అప్పుడూ ఇప్పుడూ కూడా కనిపిస్తోంది. పిల్లల్ని గాలికి వదిలినట్లే ఉంటుంది తల్లిదండ్రుల తీరు. ఇది ఏ మాత్రం స్వాగతించలేని పేరెంటింగ్‌ అన్నమాట. ఇక అందరూ అంగీకరించి తీరాల్సిన పేరెంటింగ్‌ స్టైల్స్‌లో ఒకటి ‘అథారిటేటివ్‌ పేరెంటింగ్‌’ మాత్రమే. ఇందులో తల్లిదండ్రులు నిర్ణయాధికారులుగా ఉండరు.

పేరెంట్స్‌– పిల్లలు సమానమే. ఇరువురూ ఒకరి అభిప్రాయాలను మరొకరు వినాలి. పరస్పరం చర్చించుకుని, మంచిచెడులు విశ్లేషించుకుని తుది నిర్ణయం మీద ఒక అంగీకారానికి రావాలని చెప్తుంది ఈ థియరీ. పిల్లలకు కొన్ని పరిమితమైన లిమిట్స్‌లో ఫ్రీడమ్‌ ఉంటుంది. అలాగే పెద్దవాళ్లకూ బాధ్యతల పరిధులతో కూడిన పేరెంటింగ్‌ ఇది. ఇక పిల్లల్లో ఉన్న బెస్ట్‌ క్వాలిటీస్‌ని గుర్తించి అందులో శిక్షణ ఇప్పించి, కరెక్ట్‌గా చానలైజ్‌ చేసి పిల్లలను తీర్చిదిద్దడం అత్యున్నతమైన పేరెంటింగ్‌. దీనినే ‘పాజిటివ్‌ పేరెంటింగ్‌’ అంటారు. అథారిటేటివ్, పాజిటివ్‌ పేరెంటింగ్‌లు రెండూ అనుసరించాల్సిన పద్ధతులే అని, పిల్లల పెంపకంలో అవలంబించాల్సిన పద్దతిని వివరించారు సైకాలజిస్ట్‌.

ఇది ఓ కళ
పిల్లల్ని పెంచడం అనేది అద్భుతమైన కళ. మళ్లీ మళ్లీ ప్రాక్టీస్‌ చేసి నైపుణ్యం సాధించవచ్చు అనే అవకాశం ఇందులో ఉండదు. ఉన్నది ఒక్కటే జీవితం అన్నట్లు... తల్లిదండ్రుల చేతిలో ఉన్నది ఒక్కటే అవకాశం. విజయవంతమైనా, విఫలమైనా అది ఆ ఒక ప్రయత్నంలోనే. అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మన భయాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేయకూడదు. ప్రోత్సాహం ద్వారా వారి మీద వాళ్లకు నమ్మకం కలిగించాలి. సెల్ఫ్‌ ట్రస్ట్‌ కోల్పోయే విధంగా భద్రంగా పెంచినట్లయితే... వాళ్లు భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరో ఒకరి ఆధారాన్ని వెతుక్కుంటూ ఉంటారు. గోడ ఎక్కడంలో జారిపడితే, పడకుండా ఎక్కగలిగే వరకు మాత్రమే వెంట ఉండి ధైర్యం చెప్పాలి. అలాగే ‘చెట్టు ఎక్కాల్సింది నువ్వే, నువ్వు నేర్చుకునే వరకు నీకు సహాయంగా ఉంటాను’ అనే భరోసాను మాత్రమే తల్లిదండ్రులు ఇవ్వాల్సింది. ‘పడిపోతావు కాబట్టి చెట్టు ఎక్కవద్దు’ అని భయపెట్టడం మానాల్సిందే. ఇందులో మరోమాటకు తావులేదు.
డాక్టర్‌ సుదర్శని సబ్బెళ్ళ క్లినికల్‌ సైకాలజిస్ట్, జి జి హెచ్, కాకినాడ

– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top