
ఉదయం లేచింది మొదలు ఉరుకుల పరుగులు జీవితాలు. పిల్లలను రెడీ చేసి స్కూళ్లకు పంపించి, తాము రెడీ అయి ఆఫీసులకు వెళుతుంటారు తల్లిదండ్రులు. ఎలాగూ స్కూల్‌కి పంపిస్తున్నాం కదా...అన్నీ అక్కడ టీచర్లే చూసుకుంటారులే అని పేరెంట్స్, పిల్లల ప్రవర్తనను సరిచేయాల్సింది వారి తల్లిదండ్రులే అని టీచర్లు అనుకోవడం సాధారణంగా జరిగిపోతుంటుంది. మార్కులు, ర్యాంకులు, గ్రేడులు చూసుకొని సంతృప్తి పడిపోతారు. ‘కానీ, పిల్లలు సరైన దారిలో ఉన్నారా, చెడు స్నేహాల్లో తమను దాటిపోతున్నారా అనేది చూసుకోవాల్సింది తల్లిదండ్రులే.
బిడ్డ చెడు సహవాసంలో ఉందని చెప్పడానికి ఈ 5 హెచ్చరిక సంకేతాలు విస్మరించవద్దు’ అంటున్నారు చైల్డ్ సైకియాట్రిస్ట్‌లు, నిపుణులు. ఈ విషయాల సాయంతో మీరు మీ పిల్లల ప్రవర్తనలో మార్పులను గుర్తించవచ్చు. సకాలంలో వాటిని సరిదిద్దడానికి సరైన చర్యలు తీసుకోవచ్చు.
ఉపాధ్యాయుల గురించి ఎప్పుడూ చెడ్డగా మాట్లాడటం...: ఒక పిల్లవాడు తన ఉపాధ్యాయుల గురించి పదే పదే చెడుగా మాట్లాడటం లేదా తక్కువ చేసి మాట్లాడటం ప్రారంభించినట్లయితే, అది మీ బిడ్డ తప్పుడు సహవాసంలో ఉన్నాడనడానికి సంకేతంగా గుర్తించాలి.
స్నేహితుడి తప్పులకు వత్తాసు పలకడం: ఒక పిల్లవాడు తన స్నేహితుడి చెడు ప్రవర్తనకు మద్దతు ఇవ్వడం ప్రారంభిస్తే, అది ఆ పిల్లవాడు ఆ చెడ్డ స్నేహితుడి ప్రభావానికి లోనయ్యా డనడానికి స్పష్టమైన సంకేతంగా గ్రహించాలి. దీనిని తల్లిదండ్రులు హెచ్చరికగా తీసుకోవడం మంచిది.
తరచూ ప్రతికూల చర్చలు : మీ బిడ్డ అకస్మాత్తుగా తన గురించి తాను ప్రతికూలంగా మాట్లాడటం ప్రారంభిస్తే లేదా తక్కువ ఆత్మవిశ్వాసం ఉన్నట్లు అనిపిస్తే, అది అతని తోటివారి ప్రతికూల ప్రభావాల వల్ల కావచ్చని గుర్తించాలి.
రహస్యంగా మాట్లాడటం లేదా చాటింగ్...: ఒక పిల్లవాడు అకస్మాత్తుగా తన ఫోన్‌ను దాచి స్నేహితులతో మాట్లాడటం లేదా చాటింగ్ చేస్తున్నప్పుడు తన మొబైల్ స్క్రీన్‌ను దాచుకోవడం ప్రారంభిస్తే, తల్లిదండ్రులు అలెర్ట్‌గా ఉండాలి.
చదువు నుండి పారిపోవడం...: మీ బిడ్డ ఉన్నట్టుండి స్కూల్‌కి వెళ్లనని మొరాయించడం లేదా హోంవర్క్ చేయకుండా మొండికి వేయడం, స్కూల్ ఎగ్గొట్టడానికి రకరకాల సాకులు చెప్పడం లేదా చదువుపై ఆసక్తి చూపక΄ోవడం.. వంటివి గమనిస్తే అది సోమరితనం వల్ల మాత్రమే కాదు, చెడు సహవాసం వల్ల కూడా కావచ్చు అని గ్రహించాలి.
పిల్లల ప్రవర్తనలో పై విధమైన మార్పులు గమనిస్తే సకాలంలో తగు చర్యలు తీసుకోవాలి. ఇందుకు స్కూల్ టీచర్ల సాయం తీసుకోవడం, నిపుణుల కౌన్సెలింగ్‌తో.. చెడు సావాసాలను గుర్తించి, పొరపాట్లను నివారించి, సమస్యను చక్కదిద్దవచ్చు.
ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!