Sitterwizing: పిల్లలతో కూచోండి దగ్గరగా చూడండి

Sitterwizing: Sittervising is the new age parenting style For Parents - Sakshi

కొత్త ట్రెండ్‌ / సిటర్‌వైజింగ్‌

పిల్లల విషయంలో ప్రతిదాంట్లో జోక్యం చేసుకునే తల్లిదండ్రుల పెంపకాన్ని ‘హెలికాప్టర్‌ పేరెంటింగ్‌’ అంటారు. అన్ని వాళ్లే నేర్చుకుంటారులే అని పిల్లల్ని పూర్తిగా వదిలేయడాన్ని ‘ఫ్రీ రేంజ్‌ పేరెంటింగ్‌’ అంటారు. అయితే... ఈ రెండూ సరి కాదని నిపుణులు అంటారు. అందుకే ఇప్పుడు ‘సిటర్‌వైజింగ్‌’ ట్రెండ్‌ నడుస్తోంది. పిల్లలతో కూచుని వారు చేసే పనిని పక్కన నుండి చూడటమే సిటర్‌వైజింగ్‌. తమ పక్కనే తల్లిదండ్రులు ఉంటూ తాము చేసే పనులను ఆనందిస్తున్నారు అనే భావన పిల్లలకు మేలు చేస్తోంది. అలాగే పిల్లలను దగ్గరి నుంచి గమనించడం తల్లిదండ్రులకు వారిని చేరువ చేస్తోంది. ఈ ‘సిటర్‌వైజింగ్‌’ మనం కూడా ఫాలో కావచ్చు.

తల్లిదండ్రులను గిల్టీలోకి నెట్టే మాటలు ఉంటాయి. ‘మీరు పిల్లలతో సరిగ్గా గడపడం లేదు’, ‘వాళ్లను గాలికి వదిలేశారు’, ‘వాళ్లు ఏం తింటున్నారో ఏం చదువుతున్నారో కూడా చూడటం లేదు’, ‘వాళ్లతో ఆడుకోవడం లేదు’... ఇలాంటివి. లేదా ‘మీరు పిల్లల్ని మరీ అతిగా పట్టించుకుంటున్నారు’, ‘వారికి ఊపిరాడనివ్వడం లేదు’, ‘హిట్లర్‌లాగా పెంచుతున్నారు’... ఇలా.  ఈ రెండు రకాల కామెంట్లూ తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తాయి. ఏదైనా తప్పు చేస్తున్నామా అని అయోమయంలో పడేస్తాయి. పిల్లల్ని అస్సలు పట్టించుకోకపోవడం లేదా అతిగా పట్టించుకోవడం... రెండూ కూడా ప్రతికూల ఫలితాలే ఇస్తాయంటారు నిపుణులు. అందుకే ఇప్పుడు ‘సిటర్‌వైజింగ్‌’ ట్రెండ్‌లోకి వచ్చింది. మామూలుగా పర్యవేక్షిస్తే సూపర్‌వైజింగ్‌. పిల్లలతో పాటు కూచుని వారిని పర్యవేక్షిస్తే అది ‘సిటర్‌వైజింగ్‌’.

► ఏమిటి ఈ సిటర్‌వైజింగ్‌
అమెరికాలో టీచర్‌గా పని చేసి, పేరెంటింగ్‌ టిప్స్‌ ఇచ్చే సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు పొందిన సూసీ అలిసన్‌ తన పిల్లలతో తాను సమయం గడపడాన్ని ‘సిటర్‌వైజింగ్‌’ అంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటే తను పక్కనే కూచుని వారిని ఆడుకోవడం చూడటాన్ని వీడియోగా పోస్ట్‌ చేస్తూ ‘ఇదే ఇప్పుడు అవసరమైన సిటర్‌వైజింగ్‌’ అంది. దాంతో ఇది ట్రెండ్‌గా మారింది. తల్లిదండ్రులు చాలామంది ఇన్‌స్టాలో, ఫేస్‌బుక్‌లో రీల్స్‌ చేసి మరీ తమ పిల్లలతో తాము చేస్తున్న సిటర్‌వైజింగ్‌ వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు.

► పిల్లలతో కూచోవాలి
పిల్లలతో కూచోవాలి... అలాగే మనం కూడా రిలాక్స్‌ కావాలి... అంటే ఇద్దరూ ప్రయోజనం పొందేలా స్నేహం పెంచుకునేలా చూసుకోవడమే సిటర్‌వైజింగ్‌. ఉదాహరణకు పిల్లలు ఆడుకుంటూ ఉంటే పార్క్‌లు వారికి సమీపంలో కూచుని అవసరమైన ఫోన్‌ కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. అమ్మ దగ్గరే ఉంది అని పిల్లలు బెరుకు లేకుండా ఉంటారు. అలాగే అమ్మ తమని చూస్తూ ఉంది అని ఉత్సాహంగా ఆడతారు. అలాగే పిల్లల ఆట మీద ఒక కన్నేసి పెట్టి వారు ఎంజాయ్‌ చేయడం చూసి తల్లి కూడా ఎంజాయ్‌ చేయొచ్చు. ఇంటికి తిరిగెళుతూ ఆ కబుర్లు మాట్లాడుకోవచ్చు. పిల్లలు చదువుకుంటూ ఉంటే పక్కనే కూచుని తల్లి ల్యాప్‌టాప్‌ మీద ఆఫీస్‌ పని చేసుకుంటూ ఉంటే తండ్రి తల్లికి సాయంగా కూరగాయలు తరుగుతూ ఉండొచ్చు. తమ సమీపంలో తల్లిదండ్రులు ఉన్నారని, తాము చదువుకోవడం చూసి వారు మెచ్చుకుంటారని భావించిన పిల్లలు చదువుకుంటారు. తమ పనులు తాము చేసుకుంటూనే తల్లిదండ్రులు వారి చదువు ఎలా సాగుతున్నదో పరిశీలించవచ్చు. పిల్లలు వీడియో గేమ్స్‌ ఆడేటప్పుడు కూడా పక్కన సోఫాలో వొత్తిగిలి తల్లో, తండ్రో పేపర్‌ తెరిస్తే వీడియో గేమ్స్‌ ఎలాంటివి ఆడాలో ఎంతసేపు ఆడాలో పిల్లలకు చెప్పకుండానే అర్థమైపోతుంది. పిల్లలను సినిమా హాలు దగ్గర వదిలిపెట్టి తిరిగి పికప్‌ చేసుకోవడం కన్నా వారితో కలిసి సినిమా చూడటమే తల్లిదండ్రులతో వారి దగ్గరితనానికి దారి తీస్తుందని అంటారు నిపుణులు.

► అవసరమైన ప్రమేయం
పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో కచ్చితంగా అరగంటో గంటో కూచోవడం వారి ఏదో ఒక చర్య సమయంలో తోడు ఉన్నామని భావన కల్పించడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. పిల్లలు ఆత్మవిశ్వాసంతో నేర్చుకోవడానికే కాదు ఏదైనా ప్రమాదం వస్తే దాపునే తల్లిదండ్రులు ఉన్నారు తమనే చూస్తున్నారనే ధైర్యం వారికి ఉంటుంది. అదే సమయంలో వారితో కలిసి వ్యాయామం చేయడం, చెస్‌ ఆడటం, వారు అడిగితే హోమ్‌వర్క్‌కు సలహా ఇవ్వడం ఇవన్నీ కూడా మంచి పేరెంటింగ్‌ కిందకు వస్తాయి. మరీ దగ్గరగా మరీ దూరంగా కాకుండా అక్కర ఉన్నంత మేరకే ప్రమేయం చూపుతూ ‘వారికి స్వేచ్ఛ ఉంది, అలాగే మా జవాబుదారీతనం ఉంది’ అనే భావన కలిగించడమే ఈ సిటర్‌వైజింగ్‌.
తల్లిదండ్రుల చేతికి ఫోన్లు వచ్చాక లేదా బతుకుబాదరబందీ వల్ల పరుగులో మునిగిపోయాక తీరిగ్గా పిల్లల పక్కన ఎంతసేపు కూచుంటున్నామో పిల్లల్ని ఎంతసేపు కూచోబెట్టుకుంటున్నామో ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి. ‘కూచుని’ ఆలోచించాలి. ఇది ఇరుపక్షాలకు మంచిది.
 
తమ సమీపంలో తల్లిదండ్రులు ఉన్నారని, తాము చదువుకోవడం చూసి వారు మెచ్చుకుంటారని భావించిన పిల్లలు చదువుకుంటారు. తమ పనులు తాము చేసుకుంటూనే తల్లిదండ్రులు వారి చదువు ఎలా సాగుతున్నదో పరిశీలించవచ్చు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top