
బ్యాంక్‌లపై బాధ్యత పరిమితమే
నష్టపోతే వచ్చే పరిహారం కొంతే
లాకర్ ఇన్సూరెన్స్ మంచి ఆలోచన
పూర్తి నష్టానికి పరిహారం పొందొచ్చు
నిబంధనలు, రిస్క్ లపై అవగాహన అవసరం
చాలా మందికి బ్యాంక్ లాకర్ నమ్మకమైన, భద్రమైన వేదిక. రక్షణ దృష్ట్యా విలువైన డాక్యుమెంట్లు, బంగారం, వెండి, వజ్రాభరణాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరుస్తుంటారు. కొందరు నగదును కూడా లాకర్లలో పెడుతుంటారు. బ్యాంకు లాకర్లపై కొండంత భరోసాతో ఉండేవారికి యూపీలోని మొరాదాబాద్‌లో 2023లో జరిగిన ఒక ఘటనను గుర్తు చేయాల్సిందే.
ఒక మహిళ తన కుమార్తె వివాహ అవసరాల కోసం ఉద్దేశించిన రూ.18 లక్షల నగదును, ఆభరణాలతోపాటు లాకర్‌లో ఉంచగా.. చెదలు ఆ నోట్లను చిత్తు చిత్తు చేసేశాయి. ఈ కేసులో ఆమెకు ఒక్క రూపాయి పరిహారం ముట్టలేదు. అందుకే లాకర్‌ను వినియోగించుకునే ప్రతి ఒక్కరూ ముందుగా నియమ, నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. లాకర్‌లో ఉంచిన వాటికి నష్టం జరిగతే బ్యాంక్ బాధ్యత ఏ మేరకు అన్నది స్పష్టత తీసుకోవాలి. అవసరమైతే బీమా రక్షణతో భరోసా కల్పించుకోవాలి.
బ్యాంకు లాకర్లో పెట్టేశాం కదా ఇక నిశ్చింతగా ఉండొచ్చనుకుంటే పొరపాటే. అధిక తేమ లేదా చెదలు లాకర్‌లో ఉంచిన డాక్యుమెంట్లు, కరెన్సీ నోట్లను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. దీనికితోడు వరదల కారణంగా లాకర్లలోకి నీరు చేరొచ్చు. భూకంపం కారణంగా నిర్మాణమే దెబ్బతినొచ్చు. చోరీ, దోపిడీలన్నవి అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి అన్ని రకాల నష్టాలకూ బ్యాంక్‌లు పరిహారం చెల్లించవన్న విషయం కచ్చితంగా తెలుసుకోవాలి.
‘‘విలువైన వాటిని స్టోర్ చేసుకునేందుకు బ్యాంక్ లాకర్లు భద్రమైన ఎంపికే. కానీ, ఇందులో రిస్క్ లు కూడా ఉన్నాయి. వీటిని అర్థం చేసుకుని సరైన చర్యలు తీసుకోవడం ద్వారా అందులో ఉంచిన మీ వస్తువులను రక్షించుకోవచ్చు’’ అని సాల్వే బస్సెల్స్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ మేనేజ్‌మెంట్ క్వాంటిటేటివ్ అనలిస్ట్ స్నేహాశిష్ దాస్ తెలిపారు.
వేటికి పరిహారం..
లాకర్ విషయంలో ఆర్‌బీఐ 2021లో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. లాకర్లలో ఉంచిన వాటికి నష్టం జరిగితే బ్యాంక్ బాధ్యత ఏ మేరకో ఇందులో స్పష్టత ఇచ్చారు. బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా దొంగతనం, అగి్నప్రమాదం, భవనం కూలిపోవడం లేదా ఉద్యోగి మోసం కారణంగా లాకర్లలో ఉన్న వాటికి నష్టం వాటిల్లితే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా బ్యాంక్ లాకర్ వార్షిక అద్దె/చార్జీకి గరిష్టంగా 100 రెట్ల వరకే బ్యాంక్‌లు చెల్లిస్తాయి.
ఉదాహరణకు బ్యాంక్ లాకర్ చార్జీ ఏటా రూ.5,000 ఉందనుకుంటే.. లాకర్లలో ఉంచిన వాటికి నష్టం జరిగితే బ్యాంక్ గరిష్టంగా రూ.5 లక్షలను చెల్లిస్తుంది. బ్యాంక్‌లు సరైన చర్యలు తీసుకున్నప్పటికీ వరదలు, భూకంపాల కారణంగా లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే అలాంటి సందర్భాల్లో బాధ్యత వహించబోవని దాస్ తెలిపారు. అంతేకాదు డాక్యుమెంట్లను సరైన భద్రతతో కూడిన ప్యాకేజీతో ఉంచకపోయినా నష్టానికి బ్యాంక్‌లు బాధ్యత తీసుకోవని చెప్పారు.
తేమకు దెబ్బతినని, నీటితో తడిసినా దెబ్బతినని పాలిథీన్ బ్యాగుతోపాటు చెదలు పట్టలేని ప్యాక్‌తో రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కస్టమర్ల నిర్ల క్ష్యం వల్ల వాటిల్లే నష్టానికి బ్యాంకులు పరిహారం చెల్లించవు. లాకర్‌ను సరైన విధంగా లాక్ చే యకుండా వెళ్లిపోయిన సందర్భాల్లో నష్టానికి కస్టమర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్లాన్ అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ సీఎఫ్‌పీ విశాల్ ధావన్ తెలిపారు.
వీటికి అనుమతి..
బంగారం, వెండి, వజ్రాభరణాలు, బంగారం/వెండి వస్తువులు, బంగారం కాయిన్లు, బిస్కెట్లు లాకర్లలో ఉంచొచ్చు. చట్టబద్ధమైన డాక్యుమెంట్లు, బీమా పత్రాలు, వీలునామాలు, ప్రాపర్టీ రిజి్రస్టేషన్ పత్రాలు, బర్త్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్లు ఉంచొచ్చు. షేరు సర్టిఫికెట్లు, మ్యూచువల్ ఫండ్స్ తదితర పెట్టుబడుల పత్రాలను కూడా భద్రంగా పెట్టుకోవచ్చు. ప్రముఖ బ్యాంక్‌లు లాకర్లలోనూ భిన్న రకాల సైజులను (నాలుగు రకాలు) ఆఫర్ చేస్తున్నాయి. వీటి చార్జీలు, సదుపాయాలు వేర్వేరుగా ఉన్నాయి. తమ అవసరాలకు అనుకూలమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి.
లాకర్ ఇన్సూరెన్స్..
లాకర్‌లో ఉంచిన వాటికి నష్టం జరిగితే కొన్ని సందర్భాల్లో బ్యాంకుల నుంచి పరిహారం రాదు. కనుక లాకర్ సదుపాయం వినియోగించే ప్రతి ఒక్కరూ లాకర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్‌లు చెల్లించే పరిహారం సైతం వార్షిక అద్దెకు గరిష్టంగా 100 రెట్లకు మించదు. లాకర్‌లో అంతకుమించి విలువైన వాటిని ఉంచే వారు తప్పకుండా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. లాకర్‌లో ఉంచిన వస్తువుల విలువను తెలియజేసే సర్టిఫికెట్‌లు/ధ్రువీకరణలను జాగ్రత్తగా దగ్గర ఉంచుకోవాలి. లాకర్‌లో ఉంచిన వాటి విలువకు తగ్గకుండా బీమా కవరేజీ తీసుకోవాలి.
అగ్నిప్రమాదం, చోరీ, ఉగ్రవాదం, ప్రకృతి విపత్తుల కారణంగా లాకర్‌లోని వాటికి నష్టం వాటిల్లితే పరిహారం లభిస్తుంది. లాకర్‌లో విలువైన డాక్యుమెంట్లకు కవరేజీ కోసం రైడర్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. లాకర్‌లో ఉంచిన వాటిని నిర్ధారించేందుకు వీలుగా ఫోన్‌లో ఫొటో తీసి పెట్టుకోవడం మంచిది. చాలా కంపెనీలు రూ. 3–40 లక్షల మధ్య సమ్ అష్యూర్డ్‌తో లాకర్ ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. హోమ్ ఇన్సూరెన్స్‌లోనూ లాకర్‌లో ఉంచిన వాటికి కవరేజీని భాగం చేసుకోవచ్చు. కాకపోతే హోమ్ ఇన్సూరెన్స్ మొత్తం కవరేజీలో లాకర్‌కు సంబంధించి 20% మించదు.
వీటిని ఉంచడం చట్టవిరుద్ధమే..
→ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ నిషేధం. చెడిపోయే పదార్థాలు కూడా ఏవీ ఉంచకూడదు. హానికారకమైనవీ పెట్టకూడదు.
→ కరెన్సీ నోట్లను సైతం లాకర్లలో ఉంచకూడదు. ఒకవేళ ఉంచినట్టయితే వాటికి నష్టం వాటిల్లితే బ్యాంకులపై బాధ్యత ఉండదు.
→ బ్యాంక్‌లో శబ్ద కాలుష్యానికి దారితీసేవి, బ్యాంక్ లాకర్ల భద్రతకు ముప్పు కలిగించే వాటిని ఉంచడం నిబంధనలకు విరుద్ధం.
భద్రత విషయంలో పూచీ ఉందా?
లాకర్ల భద్రత విషయంలో బ్యాంక్‌లు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ అక్కడక్కడ లోపాలకు అవకాశం లేదని భావించకూడదు. లాకర్లను రీన్‌ఫోర్స్‌డ్ స్టీల్‌తో చేయించడమే కాకుండా, భద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో, యాక్సెస్ పరిమితంగా ఉండే చర్యలు తీసుకుంటాయి. వీటిని సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక అలారమ్ వ్యవస్థలతో పర్యవేక్షిస్తుంటాయి. బ్యాంక్ ఉద్యోగి, కస్టమర్ ఇద్దరి వద్ద ఉండే తాళం చెవులతో (డ్యుయల్ కీ) తెరవాల్సి ఉంటుంది.
ఇది కూడా భద్రతా సదుపాయమే. తేమ, చెదలను తట్టుకునే విధంగా అధిక నాణ్యత కలిగిన లాకర్లను కొన్ని బ్యాంక్‌లు వినియోగిస్తున్నాయి. బ్యాంక్‌లు చెదల నివారణకు చర్యలు కూడా తీసుకుంటుంటాయి’’ అని దాస్ వివరించారు. బ్యాంక్ వైపు నుంచి భద్రతా పరంగా లోపాలను గుర్తించినట్టయితే వాటిని అధికారుల దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకెళ్లడం మంచిదే. ఈ నిర్లక్ష్యం కారణంగా భవిష్యత్తులో తమ లాకర్లలోని వాటికి నష్టం వాటిల్లితే ఆధారంగా పనికొస్తుంది.
కొత్త ఒప్పందంపై సంతకం చేశారా?
కొన్నేళ్ల క్రితం లాకర్ తీసుకుని, 2021 ఆగస్ట్ తర్వాత బ్యాంక్‌తో కొత్త అగ్రిమెంట్‌పై సంతకం చేయని వారు.. వెంటనే ఆ పనిచేయాలి. సవరించిన లాకర్ ఒప్పందాలపై కస్టమర్ల అంగీకారం తీసుకోవాలంటూ ఆర్‌బీఐ నాడు ఆదేశించింది. ఇందుకు గడువును తొలుత 2023 జనవరి 1కి పొడిగించింది. తర్వాత అదే ఏడాది డిసెంబర్ 31 వరకు, తర్వాత 2024 మార్చి 31 వరకు పొడిగించడం గమనార్హం. కానీ, 2025 చివరి వరకు గడువు ఇవ్వాలని బ్యాంక్‌లు కోరుతున్నాయి. లాకర్ ఖాతాదారుల్లో 20 శాతం వరకు ఇంకా ఒప్పందాలపై సంతకాలు చేయకపోవడమే ఇందుకు కారణం.
సవరించిన కొత్త లాకర్ ఒప్పందాలపై సంతకాలు చేయకపోతే అప్పటి వరకు లాకర్ వినియోగించుకునేందుకు బ్యాంక్‌లు అనుమతించకపోవచ్చని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి పేర్కొన్నారు. తుది నోటీసు జారీ చేసి, అప్పటికీ కస్టమర్ల నుంచి స్పందన లేకపోతే లాకర్లను సీల్ చేయొచ్చని ప్లాన్‌అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ సీఎఫ్‌పీ విశాల్ ధావన్ తెలిపారు. కొత్త లాకర్ నిబంధనల ప్రకారం బ్యాంక్‌లు.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని కస్టమర్లను కోరొచ్చు. గతంలో ఈ డిపాజిట్ ఎంత మొత్తం అన్న పరిమితి లేదు. ఇప్పడు లాకర్ మూడేళ్ల అద్దె, కస్టమర్ డిఫాల్ట్ అయితే లాకర్ తెరిచేందుకు అయ్యే చార్జీలకు సరిపడానే డిపాజిట్ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త అగ్రిమెంట్‌కు అయ్యే చార్జీలను బ్యాంకులే భరిస్తాయి.
నామినేషన్ తప్పనిసరి..
లాకర్ తెరిచే సమయంలో సర్వైవర్‌షిప్ క్లాజును నమోదు చేయాలి. లేదా నామినేషన్‌ను అయినా తప్పకుండా నమోదు చేయాలి. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో నామినీని లాకర్ తెరిచేందుకు బ్యాంక్ అనుమతిస్తుంది. ఉమ్మడిగా మరొకరితో కలసి లాకర్ తెరిచినట్టయితే.. ఇద్దరి సంతకాల ఆమోదంతో నిర్వహించే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు తమ వారసులను నామినీలుగా నమోదు చేయాలి.
సర్వైవర్‌షిప్ క్లాజ్ ఎంపిక చేసుకుంటే. ఎనీవన్ లేదా సరై్వవర్ (ఎవరైనా లేక జీవించి ఉన్న వారు) ఆప్షన్ అనుకూలంగా ఉంటుంది. ఇవేమీ లేకుండా లాకర్ తీసుకుంటే.. దురదృష్టవశ్తాతూ మరణించిన సందర్భంలో లాకర్‌లో ఉన్న వాటిని పొందడానికి వారసులు ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. మరణ ధ్రువీకరణ సర్టి ఫికెట్, సక్సెషన్ సర్టిఫికెట్ లేదా లెటర్ ఆఫ్ అడ్మిని్రస్టేషన్‌ను సమర్పించాల్సి వస్తుంది. సాక్షులు, వారసుల సమక్షంలో లాకర్‌లో ఉన్న వాటిని బ్యాంక్ సిబ్బంది నమోదు చేయాల్సి వస్తుంది. కేవైసీ వివరాలతో క్లెయిమ్ సమర్పించాలి. ఈ ప్రక్రియలన్నీ ముగిసి లాకర్‌లో వాటిని పొందేందుకు చాలా సమయం పడుతుంది.
ముందు జాగ్రత్తలు..
→ డాక్యుమెంట్లను నీటికి తడవని, అగ్ని ప్రమాదంలో కాలిపోని విధంగా ప్యాక్ చేసి ఉంచుకోవాలి సురక్షితం.
→ నోట్లను లాకర్‌లో ఉంచకపోవడం మంచిది. దీనికి బదులు ఎఫ్‌డీ చేసుకోవడం వల్ల రక్షణతోపాటు రాబడి కూడా వస్తుంది.
→ లాకర్‌లో ఉంచిన ప్రతీ వస్తువు వివరాలను డైరీలో రాసుకోవాలి. ప్రతీ వస్తువును ఫొటో తీసి పెట్టుకోవాలి.
→ అవసరం లేకపోయినా సరే లాకర్‌లో ఉంచిన వాటిని నిర్ణీత కాలానికి ఒకసారి పరిశీలించుకోవాలి. కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా లాకర్‌ను తెరిచి చూడాలి.
→ లాకర్‌లో ఉంచే అన్నింటికీ కవరేజీ వర్తించే పాలసీ తీసుకోవాలి.
– సాక్షి, బిజినెస్ డెస్క్