అమృత్‌ పత్తి.. ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి! ఎలా సాగు చేయాలంటే? | Adilabad Farmer Cultivate Amrut Cotton Get 20 Quintal Per Acre | Sakshi
Sakshi News home page

అమృత్‌ పత్తి అదుర్స్‌! ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి.. ఎలా సాగు చేయాలంటే?

Jan 24 2023 2:20 PM | Updated on Jan 24 2023 2:30 PM

Adilabad Farmer Cultivate Amrut Cotton Get 20 Quintal Per Acre - Sakshi

పత్తి దిగుబడుల పరంగా ఎకరానికి 20 క్వింటాళ్లు సాధించిన ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం కొల్హారికి చెందిన యువ రైతు ఫడ్‌ విజయ్‌ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెట్టింపు దిగుబడి సాధించిన విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకొని పరిసర గ్రామాల రైతులు ఆసక్తిగా పొలాన్ని చూసి వెళ్తున్నారు.

సాధారణ సాగులో కొంత మందికి 6 నుంచి 8 క్వింటాళ్లు, మరికొంత మందికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే, ఈ రైతు ఏకంగా రెట్టింపు కంటే అధిక దిగుబడి సాధించడమే రైతులను ఆకర్షిస్తోంది. 

ఫడ్‌ విజయ్‌కు మహరాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా అంబోడ గ్రామంలో చుట్టాలు ఉన్నారు. ఒకసారి ఆ గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ అమృత్‌ ప్యాటర్న్‌లో సాగు చేయడాన్ని గమనించాడు. దిగుబడి అధికంగా వస్తుందని ఆ రైతులు చెప్పడంతో ఆ వైపు మొగ్గు చూపాడు. 

అమృత్‌ పద్ధతి అంటే..?
యవత్‌మాల్‌ జిల్లా మహాగావ్‌ తాలూకా అంభోద గ్రామానికి చెందిన రైతు శాస్త్రవేత్త అమృత్‌రావు దేశ్‌ముఖ్‌ తన క్షేత్రంలో అనేక ఏళ్లపాటు ప్రయోగాలు చేసి ఈ సాగు పద్ధతిని రూపొందించారు. అందువల్లనే అమృత్‌ ప్యాటర్న్‌ అని పేరు వచ్చింది. ఏకంగా 50 క్వింటాళ్ల వరకు ఎకరంలో పత్తి దిగుబడి సాధించిన ఘనత ఆయనిది.

ఆదిలాబాద్‌ జిల్లాలో సాధారణంగా పత్తి సాగులో రైతులు మొక్కల మధ్య కొంచెం అటూ ఇటుగా ఒక అడుగు,  వరుసల మధ్య 3 నుంచి 4 అడుగులు లేదా 4 నుంచి 5 అడుగుల దూరం పాటిస్తారు. అమృత్‌ ప్యాటర్న్‌లో మొక్కల మధ్య దూరం కచ్చితంగా ఒక అడుగు ఉండే చూస్తారు.

ఒక వరుస మధ్య 4 అడుగులు, ఆ పక్కన వరుస మధ్య దూరం 6 అడుగుల దూరం పాటిస్తారు. అంటే.. మొదటి రెండు వరుసల మధ్య దూరం నాలుగు అడుగులు.. రెండు, మూడు వరుసల మధ్య ఆరు అడుగుల దూరం అనుసరిస్తారు. ఇదే తీరులో చేనంతా  పాటిస్తారు. ఇదే విధానాన్ని విజయ్‌ అవలంభించారు. 

నెల తర్వాతే ఎరువులు..
పత్తి సాగులో మొదటి నెల రోజుల పాటు ఎలాంటి ఎరువులు, పురుగుమందులు వాడలేదు. ఇలా చేయటం వల్ల మొక్కకు కొమ్మలు ఎక్కువగా వస్తాయి. విత్తిన నెల తర్వాత ఎకరాకు ఒక బ్యాగు 10:26:26 వేశారు. ఆ తర్వాత నెలలోనూ అదే మోతాదులో అదే ఎరువుతో పాటు అతి తక్కువ ధరకు లభ్యమయ్యే పురుగుల మందు వాడినట్టు వివరించారు.

మూడో నెల తర్వాత 5 కేజీల సల్ఫర్, ఆ తర్వాత 25 కేజీల మెగ్నీషియం నెలకు అందిస్తే సరిపోతుందని విజయ్‌ తెలిపారు. తద్వారా ప్రతి మొక్కకు వచ్చే కొమ్మలైనా ప్రధాన కొమ్మ, పిల్ల కొమ్మలు చాలా తక్కువ దూరంలో వస్తాయని తెలిపారు. పూత, కాత ఎక్కువగా రావడంతో పాటు రాలిపోకుండా ఉంటాయని విజయ్‌ వివరించారు. 

సాళ్ల మధ్య ఎక్కువ దూరం పెట్టడం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి అధిక దిగుబడి వస్తోంది. చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని అనుభవపూర్వకంగా విజయ్‌ చెబుతున్నారు. ఎకరానికి రూ. 20 వేలు ఖర్చయ్యింది. 20 క్వింటాళ్ల పత్తి తీసిన తర్వాత మళ్లీ నీటి తడి ఇచ్చారు. ఫలితంగా మున్ముందు కూడా మరికొంత పత్తి దిగుబడి రావచ్చని విజయ్‌ ఆశిస్తున్నారు. 

తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి
అమృత్‌ పద్ధతిని అవలంభించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధ్యమవుతుంది. ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడే అవసరం పడదు. కలుపు తీయడంతో పాటు ఎరువులు, మందుల ఖర్చుల్లో చాలా ఆదా అవుతుంది. అధిక సాంద్రతతో పూత, కాత రావడం జరుగుతుంది.
– సాయిప్రణీత్‌(96768 83233), వ్యవసాయ విస్తరణాధికారి, కొల్హారి గ్రామం

సాగు పద్ధతి మార్చుకొని అధిక దిగుబడి సాధించా...
రెండేళ్ల కింద పత్తి సాగులో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మహరాష్ట్రలో కొంతమంది రైతులు అవలంభిస్తున్న అమృత్‌ ప్యాటర్న్‌లో గతేడాది పత్తి సాగు చేశాను. కొన్ని కాయలు కూడా కుళ్లిపోయాయి. అప్పుడు 9 నుంచి 11 క్వింటాళ్ల మధ్య దిగుబడి వచ్చింది.

అమృత్‌ విధానాన్ని పూర్తిస్థాయిలో పాటించకపోవడంతో దిగుబడి అంతకు పరిమితమైంది. రెండో ఏడాది.. గడిచిన వానా కాలంలో ఈ విధానంలో అమృత్‌ ప్యాటర్న్‌లో అన్ని పద్ధతులను పూర్తిస్థాయిలో అవలంభించాను. ఎకరానికి 20 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. 
– ఫడ్‌ విజయ్‌ (77024 42958), ఇన్నోవేటివ్‌ పత్తి రైతు, కొల్హారి గ్రామం, గుడిహత్నూర్‌ మండలం, ఆదిలాబాద్‌ జిల్లా 
– గొడిసెల కృష్ణకాంత్‌ గౌడ్, స్టాఫ్‌ రిపోర్టర్, సాక్షి, ఆదిలాబాద్‌.

చదవండి: Goat Farming: మేకలు, నాటు కోళ్ల పెంపకం.. ఏడాదికి రూ. 8–9 లక్షల నికరాదాయం! మరి ఖర్చు?
Red Rice Health Benefits: బియ్యంపై పొరలో ‘ప్రోయాంతో సైనిడిన్‌’..అందుకే అలా! ఎర్ర బియ్యం వల్ల..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement