Goat Farming: మేకలు, నాటు కోళ్ల పెంపకం.. ఏడాదికి రూ. 8–9 లక్షల నికరాదాయం! మరి ఖర్చు?

Chevella Man Goat Farming Earns Huge Profits Inspires Farmers - Sakshi

మేకల క్షేత్రమే శిక్షణా కేంద్రం 

మేకల పెంపకంలో మార్గదర్శకుడు మూల మహేందర్‌రెడ్డి

మేకలు, నాటు కోళ్ల పెంపకంలో ఏడాదికి రూ. 8–9 లక్షల నికరాదాయం

ప్రతి శనివారం ఫామ్‌ దగ్గరే రైతులకు ఉచిత శిక్షణ

రైతులు, అధికారుల క్షేత్ర పర్యటనలకు వేదికగా మారిన మహేందర్‌రెడ్డి ఫామ్‌

మేకల పెంపకంలో పదేళ్ల అనుభవంతో స్థిరమైన నికరాదాయం పొందుతూ.. జీవాల పెంపకంపై ఆసక్తి చూపే రైతులకు మార్గదర్శిగా నిలిచారు మూల మహేందర్‌రెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం సింగప్పగూడ గ్రామంలో పాక్షిక సాంద్ర పద్ధతిలో ఆయన మేకలతో పాటు నాటు కోళ్లను పెంచుతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

అంతేకాదు ఉచితంగా శిక్షణ ఇస్తూ వందలాది మంది రైతులకు తోడ్పాటునందిస్తున్నారు. జీవాల పెంపకంపై పూర్తి అవగాహన కలిగించుకొని, మక్కువతో పెంపకం చేపడితే వంద శాతం లాభాలు పొందుతారని నిక్కచ్చిగా చెబుతున్నారాయన.  

రైతు కుటుంబంలో పుట్టిన మహేందర్‌రెడ్డి బీఎస్సీ చదివి, కొంతకాలం బోర్‌వెల్‌ రంగంలో పనిచేశారు. 2005లో 14 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం ప్రారంభించారు. తదనంతర కాలంలో వ్యవసాయంతోపాటు జీవాల పెంపకం కూడా తోడైతేనే నిరంతరం రైతుకు ఆదాయం వస్తుందని గ్రహించిన ఆయన మేకల పెంపకం వైపు దృష్టి సారించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి శిక్షణ, ప్రోత్సహకాలు లేకపోవటంతో సొంతంగానే అనేక రాష్ట్రాల్లో తిరిగి పరిశోధన చేశారు. 

గోట్‌ ఫార్మింగ్‌ పరిజ్ఞానం కోసం ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో సొంత ఖర్చులతో పర్యటించారు. స్థానిక రైతులను కలిసి వారి అనుభవాలను తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో సక్సెస్‌ సాధిస్తామనే ధీమా ఎవరూ కల్పించలేకపోయారు. అయినా వెనకడుగు వేయకుండా పట్టుదలతో మేకల పెంపకం చేపట్టారు. 


∙ఎలివేటెడ్‌ షెడ్‌లో విశ్రమిస్తున్న మేకలు 

ఎకరంలో షెడ్లు, మూడెకరాల్లో మేత...
ప్రభుత్వ సబ్సిడీ పథకాలు సైతం లేక సొంతం గానే 2013లో 65 మేకలతో పాక్షిక సాంద్ర పద్ధతిలో మహేందర్‌రెడ్డి మేకల పెంపకం ప్రారంభించారు. రూ. 13 లక్షలు ఖర్చు చేసి ఎకరం విస్తీర్ణంలో షెడ్లు నిర్మించారు. మహేందర్‌రెడ్డి మూడేళ్లు కష్టపడి మేకల సంఖ్యను 250కు పెంచారు. 1 ఎకరంలో షెడ్లు, నివాస భవనం నిర్మించారు. షెడ్డులో మేకలను నేలపైన కాకుండా.. మీటరు ఎత్తున చెక్కలతో ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించి, దానిపై మేకలు విశ్రమించేలా ఏర్పాటు చేశారు.

పెంటికలు చెక్కల సందుల్లో నుంచి నేల మీద పడిపోతాయి. మేకలకు గాలి, వెలుతురు చక్కగా తగులుతుంది. షెడ్‌కు పక్కనే చుట్టూ ఇనుప కంచెతో దొడ్డిని ఏర్పాటు చేశారు. మేకలు అక్కడ ఆరుబయట ఎండలో తిరుగుతూ మేత మేస్తాయి. మరో మూడు ఎకరాలు మేకలకు కావాల్సిన పచ్చిగడ్డి సాగుకు ఉపయోగిస్తున్నారు. ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఖర్చులు పోను నెలకు రూ. 65–75 వేల నికరాదాయం, ఏడాదికి రూ. 8–9 లక్షల నికరాదాయం పొందుతూ మేకల పెంపకంలో పదేళ్లుగా ఆదర్శంగా నిలుస్తున్నారు. 


ఫామ్‌ వద్ద ఉచితం శిక్షణ తరగతులు

ప్రతి శనివారం ఉచిత శిక్షణ
మేకల పెంపకానికి ముందుకొచ్చే వారికి ఇప్పటికీ ప్రభుత్వపరంగా శిక్షణా కేంద్రాలు అందుబాటులో లేవు. ఈ లోటు భర్తీ చేయడానికి మహేందర్‌రెడ్డి సేవాభావంతో ముందుకొచ్చారు. సీనియర్‌ రైతుగా తన అనుభవాలను పంచాలనే ఆలోచనతో ప్రతి శనివారం తన ఫామ్‌ దగ్గరే ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన పద్ధతులను 3 గంటల పాటు సవివరంగా బోధిస్తున్నారు.

ఆయన పట్టుదల, నైపుణ్యం గుర్తించిన వెటర్నరీ శాఖ ఔత్సాహిక రైతులను ఆయన ఫామ్‌కు క్షేత్రపర్యటనకు తీసుకురావటం ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి రైతులు, అగ్రి, ఫుడ్‌ బిజినెస్‌ విద్యార్థులు ఆయన వద్ద అనుభవపాఠాలు నేర్చుకుంటున్నారు.  వెటరర్నీ ఉన్నతాధికారుల నుంచి ప్రసంశలు కోకొల్లలు.

వ్యవసాయ కళాశాలలో అనేక సదస్సుల్లో ఆయన సుసంపన్నమైన తన అనుభవాలను పంచుతూ ఉంటారు. 2015లో రైతునేస్తం, 2016లో సీఆర్‌ఐడీఏ, 2018లో ఐసీఏఆర్‌ ఉత్తమ ఇన్నోవేటివ్‌ ఫార్మర్‌ పురస్కారాలు లభించాయి. 

మేకల పెంపకంలో  మెలకువలు
కొత్తగా గోట్‌ ఫార్మింగ్‌ చేపట్టే రైతులకు మహేందర్‌రెడ్డి చెబుతున్న సూచనలు:
►ఒక మేక సగటున రెండేళ్లలో మూడు ఈతల్లో ఈతకు రెండు పిల్లల చొప్పున ఇస్తుంది. ఒక మేక పిల్ల అమ్మకానికి రావడానికి 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. చిన్న పిల్లల పోషణను అశ్రద్ధ చేయకుండా మరణాల రేటు తగ్గించాలి.

►కనీసం 25 కేజీల బరువు ఉన్న మేకలనే అమ్ముకోవాలి. మార్కెటింగ్‌లో జీవాలను ఫారంలోనే అమ్ముకోవటం లాభాదాయంకంగా ఉంటుంది. నాణ్యమైన మేకల పెంపకమే నోటి ప్రచారంగా పనిచేస్తుంది. 
►మేకల పెంపకాన్ని యాంత్రికంగా కాకుండా మనసుపెట్టి ఇష్టంగా చేస్తేనే వంద శాతం సక్సెస్‌ చేకూరుతుంది.

►ముందు జాగ్రత్త చర్యలను, యాజమాన్య మెలకువలు మక్కువతో పాటిస్తే.. 90 శాతం మందులు లేకుండానే మేకల సంతతిని పెంచుకుంటూ పోవచ్చు.
►మేలు రకం మేకల ఉత్పత్తితోనే లాభాలు వస్తాయి. మేకల ఉత్పత్తిలో తల్లి, తండ్రి మేకల నాణ్యత ముఖ్యం. 
►పోషక విలువలు ఉండే నాణ్యమైన మేతలను మేకలకు కడుపునిండా అందించటంతో నాణ్యమైన మేకల ఉత్పత్తి ద్వారా అధిక లాభాలు సాధ్యం. 

►సాంద్ర పద్ధతిలో మేకల పెంపకం ఎంతో మేలు. సగం  ఎండు మేత, సగం పచ్చి మేతలను అందించాలి. 
►ఇరుకుగా కాకుండా అవసరమైన విస్తీర్ణం మేరకు షెడ్ల నిర్మాణం, పరిశుభ్రత, చూడి మేకల, పిల్లల పోషణలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.  వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలివేటెడ్‌ షెడ్లు నిర్మించాలి. సీజన్‌కు తగిన రీతిలో షెడ్ల నిర్వహణ ఉండాలి. 
►మేకల పెంపకంలో రైతు సక్సెస్‌ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో యాజమాన్య లోపం రానివ్వకూడదు. జీవాలకు పోషక విలువలతో కూడిన మేతను కమం తప్పకుండా అందించాలి.

మేకల రైతుల సేవలో..
నా ఫామ్‌లో 250 మేకలున్నాయి. వీటి పెంపకానికి మొత్తం 4 ఎకరాల భూమిని ఉపయోగిస్తున్నా. ముగ్గురికి ఉపాధి కల్పిస్తూ 250 మేకలను పెంచుతున్నా. మేకల పెంపకంతోపాటు నాటు కోళ్ల పెంపకం చేపట్టా. 20 కోళ్లతో ప్రారంభించా. ఇప్పుడు 100కు చేరాయి. వీటిని 500లకు పెంచేందుకు కృషి చేస్తున్నా. మేకలు, కోళ్ల పెంపకానికి మొత్తంగా ఏడాదికి ఈ సుమారు రూ. 6 లక్షల ఖర్చు అవుతుంటే దాదాపు రూ. 14–15 లక్షల ఆదాయం వస్తున్నది.

ఖర్చులు పోను ఏడాదికి సుమారు రూ. 8–9 లక్షల నికరాదాయం సంపాదిస్తున్నా. నా అనుభవాలను అందరికీ అందించి సహాయ పడాలనే ఆలోచనతో ఏడేళ్లుగా ప్రతి శనివారం ఉచితంగా ఫామ్‌ దగ్గరే రైతులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నా. వారికి ఎప్పుడు ఏ సమాచారం కావాల్సినా ఫోన్‌లో అందిస్తూ వస్తున్నా. నాకు అవకాశం ఉన్నంత వరకు ఈ సేవ కొనసాగిస్తునే ఉంటాను.

రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తా. ఏడాదిలో 365 రోజులూ మేక మాంసానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజల అవసరాలకు ప్రతి రోజు సగటున 7–8 వేల మేకల అవసరం ఉంటుందని అంచనా. ప్రభుత్వపరంగా కూడా జీవాల పెంపకంలో శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేయాలి. మేకల పెంపకంపై అవగాహన, ఇష్టమే విజయ సోపానమవుతుంది. 

– మూల మహేందర్‌రెడ్డి (8008639618), ఆదర్శ మేకల పెంపకందారుడు, సింగప్పగూడ, చేవెళ్ల మం., రంగారెడ్డి జిల్లా  
ఎస్‌.రాకేశ్, సాక్షి, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా
సాగుబడి నిర్వహణ: పంతంగి రాంబాబు
చదవండి: Red Rice Health Benefits: బియ్యంపై పొరలో ‘ప్రోయాంతో సైనిడిన్‌’..అందుకే అలా! ఎర్ర బియ్యం వల్ల..
వేలెడంత సైజు.. వండుకుని తింటే.. ఆ టెస్టే వేరు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top