వేలెడంత సైజు.. వండుకుని తింటే.. ఆ టెస్టే వేరు!

Amblypharyngodon Mola: Small Fishes, Mettallu, Pitha Parigelu, Kodipelu - Sakshi

2 అంగుళాల చిరు చేపల్లో పెద్ద చేపల్లో కన్నా విటమిన్‌ ‘ఎ’ 20 రెట్లు ఎక్కువ!

సహజ నీటి వనరుల్లో పెరిగే 2 అంగుళాల మెత్తళ్లు (ఆంగ్లంలో ‘మోల’ (Amblypharyngodon mola) వంటి చిరు చేపలను తినే అలవాటు ఆసియా దేశాల్లో చిరకాలంగా ఉంది. ఎండబెట్టిన మెత్తళ్లను నిల్వ చేసుకొని ఏడాదంతా తింటూ ఉంటారు. ఈ చిరు చేపల్లో అద్భుతమైన సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉండటంతో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో వీటి పాత్ర విశిష్టమైనది. అయితే, వీటి సైజు వేలెడంతే ఉండటం వల్ల కృత్రిమ విత్తనోత్పత్తి ఇన్నాళ్లూ అసాధ్యంగా మిగిలిపోయింది. అయితే, ఈ పెనుసవాలును శాస్త్రవేత్తలు ఇటీవలే ఛేదించారు. చేపల విత్తనోత్పత్తి రంగంలో ఇది పెద్ద ముందడుగని చెప్పచ్చు. 

జర్మనీకి చెందిన స్వచ్ఛంద సంస్థ జి.ఐ.జడ్‌. ఆర్థిక తోడ్పాటుతో ‘వరల్డ్‌ఫిష్‌’ సంస్థ శాస్త్రవేత్తలు మన దేశంలో మెత్తళ్ల విత్తనోత్పత్తికి సులభమైన సాంకేతిక పద్ధతులను రూపొందించడంలో కొద్ది నెలల క్రితం ఘనవిజయం సాధించారు. దీంతో మెత్తళ్లు, తదితర చిరు చేపలను మంచినీటి చెరువుల్లో సాగు చేసుకునే అవకాశం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది.


నేచురల్‌ సూపర్‌ ఫుడ్స్‌ 

భారత్‌ సహా దక్షిణాసియా దేశాల్లో ప్రజల్లో సూక్ష్మపోషకాల లోపాన్ని ఆహారం ద్వారా సహజమైన రీతిలో అధిగమించేందుకు ఇదొక సువర్ణ అవకాశంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు, ఎషెన్షియల్‌ ఫాటీ ఆసిడ్స్‌ కలిగి ఉండే మెత్తళ్లు నేచురల్‌ సూపర్‌ ఫుడ్స్‌ అని వరల్డ్‌ఫిష్‌ అభివర్ణించింది. పౌష్టికాహార లోపంతో మన దేశంలో 36% మంది పిల్లలు వయసుకు తగినంతగా ఎదగటం లేదు. 32% మంది తక్కువ బరువు ఉన్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మెత్తళ్లు భేషుగ్గా ఉపయోగపడుతాయని ‘వరల్డ్‌ఫిష్‌’ చెబుతోంది. 

విటమిన్‌ ఎ లోపం వల్ల వచ్చే కంటి జబ్బులు, చర్మ వ్యాధులు మెత్తళ్లు తింటే తగ్గిపోతాయి. ఈ చిరు చేపల్లో ఐరన్, జింక్, కాల్షియం, ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్స్‌ ఉన్నాయి. పిల్లలు, గర్భిణీ స్త్రీలను పీడించే సూక్ష్మపోషక లోపాలు మెత్తళ్లను తింటే తగ్గిపోతాయి. 


70 లక్షల సీడ్‌ ఉత్పత్తి

అధిక పోషకాలున్న మెత్తళ్లు వంటి చిరు చేపల సాగు ప్రోత్సాహానికి ఒడిషా, అస్సాం రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్‌లో వరల్డ్‌ఫిష్‌ సంస్థ గత దశాబ్దకాలంగా కృషి చేస్తోంది. ఒడిషాలోని జగత్సింగ్‌పూర్‌ జిల్లాలో గల బిశ్వాల్‌ ఆక్వాటెక్‌ హేచరీతో కలిసి వరల్డ్‌ఫిష్‌ చేసిన పరిశోధనలు ఫలించాయి. ఇండ్యూస్‌డ్‌ బ్రీడింగ్‌ టెక్నిక్‌ ద్వారా మెత్తళ్ల సీడ్‌ ఉత్పత్తిలో అవరోధాలను 2022 జూన్‌లో అధిగమించటం విశేషం.

70 లక్షల మెత్తళ్లు సీడ్‌ను ఉత్పత్తి చేయగలిగారు. ప్రత్యేకంగా నిర్మించిన చిన్న చెరువుల్లో ఆక్సిజన్‌తో కూడిన నీటిని ఎయిరేషన్‌ టవర్‌ ద్వారా అందిస్తూ ప్రయోగాలు చేశారు. ఆ నీటిలో గుడ్ల నుంచి వెలువడిన చిరుపిల్లలు చక్కగా బతికాయి. గుడ్డు నుంచి బయటికి వచ్చిన 3–4 రోజుల్లోనే అతిచిన్న పిల్లలు అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. వీటిని కొద్ది రోజులు నర్సరీ చెరువుల్లో పెంచి తర్వాత సాధారణ చేపల చెరువుల్లోకి మార్చాల్సి ఉంటుంది. తొలి విడత మెత్తళ్లు పిల్లలను ఒడిషా రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలకు అందించారు. 

మెత్తళ్ల చేప పిల్లలను తెలుగు రాష్ట్రాల్లోనూ చేపల రైతులకు, మహిళా బృందాలకు అందుబాటులోకి తేవాలి. నగరాల్లో/గ్రామాల్లో ఇంటిపంటలు /మిద్దె తోటల సాగుదారులకు కూడా మెత్తళ్లు చేప పిల్లలను అందించాలి. ప్రజలకు పౌష్టికాహార భద్రతను చేకూర్చడంలో చిరు చేపలు ఎంతగానో దోహదపడతాయి. 
 
మెత్తళ్ల చేప పిల్లలను ఒక్కసారి వేస్తే చాలు! 
‘మోల’ చేపలు చూపుడు వేలంత పొడవుండే అద్భుత పోషకాల గనులు.. వీటిని మనం మెత్తళ్లు /పిత్త పరిగెలు /కొడిపెలు /ఈర్నాలు అని పిలుచుకుంటున్నాం . 

► గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని, రక్తహీనతను, రేచీకటిని పారదోలే వజ్రాయుధాలు అ చిరుచేపలు. 

► మంచినీటి ఆక్వా చెరువుల్లో బొచ్చె, రాగండి, మోసు, శీలావతి వంటి పెద్ద చేపలతో కలిపి లేదా విడిగానూ ఈ చిరుచేపలను సునాయాసంగా సాగు చేయొచ్చు. 

► గ్రామ చెరువులు, కుంటల్లో, పెరటి తోటల్లోని తొట్లలో, మిద్దెల పైన ఫైబర్‌ టబ్‌లలోనూ ఎంచక్కా చిరు చేపలను పెంచుకోవచ్చు. 

► వానాకాలంలో వాగులు, వంకల్లో కనిపించే సహజ దేశవాళీ చేపలివి.

​​​​​​​► మెత్తళ్లు చేప తన సంతతిని తనంతట తానే(సెల్ఫ్‌ బ్రీడర్‌) వృద్ధి చేసుకుంటుంది.. ఈ చేప పిల్లలను ఒక్కసారి చెరువులో/తొట్లలో వేసుకుంటే చాలు.. నిరంతరం సంతతి పెరుగుతూనే ఉంటుంది. 

​​​​​​​► ప్రతి 10–15 రోజులకోసారి వేలెడంత సైజుకు పెరిగిన చేపలను పెరిగినట్లు పట్టుబడి చేసి వండుకు తినొచ్చు. 

​​​​​​​► వాణిజ్య స్థాయిలో పెంపకం చేపట్టి స్థానిక మార్కెట్లలో అమ్ముకొని ఆదాయం కూడా పొందవచ్చు.

​​​​​​​► మగ చేపలు 5.0–5.5 సెం.మీ. (2 అంగుళాలు) పొడవు, ఆడ చేపలు 6.0–6.5 సెం.మీ. పొడవు పెరిగేటప్పటికి పరిపక్వత చెందుతాయి. ఆ దశలో పట్టుబడి చేసి వండుకొని తినొచ్చు. ఎండబెట్టుకొని దాచుకోవచ్చు. ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్యలో ఈ చేపల్లో సంతానోత్పత్తి జరుగుతుందని కేంద్రీయ మత్స్య విద్యా సంస్థ (సి.ఐ.ఎఫ్‌.ఇ.)  ఎమిరిటస్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ అప్పిడి కృష్ణారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. నిజానికి, మెత్తళ్ల విత్తనోత్పత్తి ఆవశ్యకత గురించి ఆయన రాసిన వ్యాసాన్ని ‘సాక్షి సాగుబడి’ ఐదేళ్ల క్రితమే ప్రచురించింది. (క్లిక్ చేయండి: నల్ల తామరను జయించిన దుర్గాడ)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top