Red Rice Health Benefits: బియ్యంపై పొరలో ‘ప్రోయాంతో సైనిడిన్‌’..అందుకే అలా! ఎర్ర బియ్యం వల్ల..

Sagubadi: Bapatla BPT 2858 Red Rice Nutrient Rich Variety Details - Sakshi

Sagubadi- Red Rice Health Benefits: అధిక పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించే సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో పండించిన దేశవాళీ వరి రకాల బియ్యానికి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. సంప్రదాయ బ్రీడింగ్‌ పద్ధతుల్లోనే దేశవాళీ వంగడాల్లో పౌష్టికాంశాలతో కూడిన బీపీటీ సన్న వరి రకాల రూపకల్పనపై బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు 2012 నుంచే దృష్టి కేంద్రీకరించారు. ‘బీపీటీ బ్లాక్‌ రైస్‌’ వంగడాలను గత ఏడాదే అధికారికంగా విడుదల చేసి, రైతులకు విత్తనాలను విస్తారంగా అందిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ‘బీపీటీ రెడ్‌ రైస్‌ 2858’ వంగడాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పంటకాలం 135 రోజులు. తుపాన్లకు పడి పోదు. దోమ, అగ్గితెగులు, ఆకు ముడత, ఆకు ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. కంకి ముద్దగా వస్తుంది. ఒక కంకిలో 500 నుంచి 600 వరకు గింజలు ఉంటాయి. బీపీటీ 5204 కన్నా సన్న రకం. బీపీటీ 2858 రెడ్‌ రకం వెయ్యి గింజల బరువు 12 గ్రాములు. నాణ్యతా ఎక్కువే.

దేశవాళీ రెడ్‌ రైస్‌ దిగుబడి 10 బస్తాలకు మించదు. బీపీటీ రెడ్‌ రైస్‌ ఎకరాకు 30 బస్తాలకు తగ్గదని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఈ రకం రెడ్‌ రైస్‌ ధాన్యంపై పొట్టు మామూలుగానే ఉంటుంది. కానీ, బియ్యం నల్లగా ఉంటాయి. బియ్యంపై పొరలో ‘ప్రోయాంతో సైనిడిన్‌’ అనే పదార్ధం ఉండడం వల్ల వాటికి ఎర్ర రంగు వచ్చింది. అందుకని, ముడి బియ్యాన్నే తినాలి.

పోషకాలు పుష్కలం
►ఇందులో ఐరన్, జింకు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే రెండు రెట్లు అధికం.
►యాంటీ ఆక్సిడెంట్లు మూడు నుంచి నాలుగు రెట్లు అధికం.
►అధికంగా 10.5 శాతం మాంసకృత్తులు ఉన్నాయి.
►టోటల్‌ ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్‌ సాధారణ రకాలతో పోలిస్తే రెండు రెట్లు అధికం.
►శరీరంలో ఉత్పత్తయ్యే ఫ్రీరాడికల్స్‌ను ఇవి సమతుల్యం చేసి రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తాయి.
►రెడ్‌ రైస్‌లో బీపీటీ 2858తో పాటు బీపీటీ 3143, 3182, 3140, 3111, 3507 రకాలను సైతం రూపొందిస్తుండటం విశేషం.  

ఎర్ర బియ్యం ఎంతో ఆరోగ్యం
బీపీటీ 2858 రెడ్‌రైస్‌ విత్తన మినీకిట్లను ఈ ఏడాది జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వ్యవసాయశాఖ జేడీఏలు, డాట్‌ సెంటర్లలో పంపిణీ చేస్తారు. మూడు సంవత్సరాల మినీకిట్‌ దశను వచ్చే ఏడాది పూర్తిచేసి, ఆ తరువాత అధికారికంగా విడుదల చేస్తాం.

బీపీటీ 2858 రెడ్‌రైస్‌ దీర్ఘకాలిక రోగాలను ఎదుర్కొనే పుష్టిని కలిగిస్తుంది. మనుషుల ఆరోగ్య రక్షణకు అత్యంత అనుకూలమైన రకం.
– బి.కృష్ణవేణి, సీనియర్‌ శాస్త్రవేత్త – అధిపతి, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, బాపట్ల
– బిజివేముల రమణారెడ్డి, సాక్షి ప్రతినిధి, బాపట్ల

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top