Sakshi News home page

ఎగ్జామ్‌ అంటే భయం వద్దు! పండగలా చేసుకోండి!

Published Fri, Aug 4 2023 9:50 AM

Adharva And Pranai From MP Started Padhel Youtube Channel - Sakshi

పరీక్షలు వస్తున్నాయంటే పట్టాలపై పరుగులు తీయాల్సిన రైళ్లు మన గుండెల్లో పరుగెత్తిన రోజులు ఇప్పటికీ గుర్తుంటాయి. తరాలు మారినా పరీక్షల సమయంలో ఒత్తిడి, భయం మారలేదు. పరీక్షల మాట ఎలా ఉన్నా పండగ అంటే బోలెడు సంతోషం వస్తుంది. అందుకే ‘పరీక్షలను పండగ చేసుకోండి. సంతోషం మీ దగ్గర ఉంటే సక్సెస్‌ మీ దగ్గర ఉన్నట్లే’ అంటున్నారు మధ్యప్రదేశ్‌కు చెందిన అధర్వ, ప్రణయ్‌ అనే ఇద్దరు మిత్రులు... 

ఎంతోమంది విద్యార్థుల్లాగే అధర్వ, ప్రణయ్‌లకు పరీక్షలకు రెండు,మూడు రోజుల ముందు హడావిడిగా పుస్తకాలు పట్టుకోవడం అలవాటు. లాస్ట్‌–మినిట్‌ రివిజన్‌ వల్ల గందరగోళానికి గురైన రోజులు ఎన్నో ఉన్నాయి. 

కట్‌ చేస్తే.... 
ఇంజనీరింగ్‌ చదవడం కోసం ప్రణయ్‌ ముంబై, అధర్వ చెన్నై వెళ్లారు. ఎవరి దారులు వారివి అయిపోయాయి. చాలారోజుల తరువాత కలుసుకున్నప్పుడు వారి మధ్య ‘ఎగ్జామ్స్‌ సమయంలో స్టూడెంట్స్‌’ అనే బరువైన ప్రస్తావన వచ్చింది. పరీక్షల సమయంలో విద్యార్థులకు ధైర్యం ఇవ్వడానికి, ఉత్సాహం అందించడానికి తమ వంతుగా ఏదైనా చేయాలని ఆలోచించారు. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ‘పఢ్‌లే’ (చదువు కో) అనే యూట్యూబ్‌ చానల్, వెబ్‌సైట్‌. స్టూడెంట్స్‌కు ఉచితంగా అందుబాటులో ఉండే తమ చానల్, వెబ్‌సైట్‌లు ఎడ్యుకేషనల్‌ మెటీరియల్‌కు స్టోర్‌హౌజ్‌గా ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

పరీక్షల సమయంలో విద్యార్థులకు ఉపయోగపడే నోట్స్, లెక్చర్స్, స్టడీ టిప్స్‌...ఇలా ఎన్నో అంశాలకు ఈ ‘పఢ్‌లే’ వేదికగా మారింది. ప్రకటనలు, డొనేషన్‌లు తమకు ప్రధాన ఆదాయ వనరు. ‘ఎన్నో రంగాలలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చినా విద్యావ్యవస్థలో మాత్రం రావడం లేదు. బోధన అనేది యాంత్రికం అయితే విద్యార్థులకు అయోమయమే మిగులుతుంది. అది వారి భవిష్యత్‌పై ప్రభావం చూపుతుంది. పరీక్షలు అంటే స్టూడెంట్స్‌ భయపడే రోజులు కాదు, సంతోషంతో గంతులు వేసే రోజులు రావాలి’ అంటాడు అధర్వ. ఎంత జటిలమైన విషయాన్ని అయినా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ఎన్నో దారులు ఉన్నాయి. కొందరు ఆ దారుల గురించి కనీసం ఆలోచించరు. కొందరు ఆ దారుల గురించి వెదుకుతారు. ఈ కోవకు చెందిన వారే అధర్వ, ప్రణయ్‌లు.

‘కాన్సెప్ట్‌లను అర్థం చేయించాలంటే విద్యార్థులకు కంఫర్ట్‌గా ఉన్న భాషలో చెప్పాలి. ఇంటర్నెట్‌లో ప్రతి సబ్జెక్ట్‌ మీద ఎంతో కంటెంట్‌ అందుబాటులో ఉంది. అయితే స్టూడెంట్స్‌ చేతితో రాసుకున్న నోట్స్‌కే ప్రాధాన్యత ఇస్తారు’ అంటాడు ప్రణయ్‌. 8,9,10 తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్‌ విద్యార్థుల కోసం ఇద్దరు మిత్రులు కాన్సెప్ట్‌లకు సంబంధించిన నోట్స్‌ రాసుకున్నారు. వాటిని స్కానింగ్‌ చేసి తమ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీంతో పాటు ఫన్నీ వీడియోలతో, మీమ్స్‌తో జటిలమైన కాన్సెప్ట్‌లను అర్థం చేయించడం మొదలుపెట్టారు. ఈ ఫార్మట్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది,

‘పదవ తరగతి చదివే మా అబ్బాయి ఆదిత్య చదువులో వెనకబడ్డాడు. నేను అతడికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆఫీస్‌ పనుల వల్ల అది ఎప్పుడూ సాధ్యం కాలేదు. ఆదిత్య తరచుగా ప ఢ్‌లే చానల్‌ చూసేవాడు. అక్కడ ఎన్నో నేర్చుకున్నాడు. ఇప్పుడు బాగా చదువుతున్నాడు’ అంటున్నాడు ఇండోర్‌కు చెందిన కుమార్‌ అనే పేరెంట్‌.‘ఇక చదవడం నా వల్ల కాదు’ అనుకున్న సమయంలో మీ యూట్యూబ్‌ చానల్‌ చూశాను. నేను జటిలం అనుకున్న ఏన్నో విషయాలు చాలా సులభంగా అర్థమయ్యాయి. ఇప్పుడు నాకు ఎంతో ధైర్యంగా ఉంది’ అని ఈ ఇద్దరు మిత్రులను కలిసి చెప్పిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. ‘పఢ్‌లే’గా మొదలైన తమ యూట్యూబ్‌ చానల్‌ ఇప్పుడు ‘జస్ట్‌ పఢ్‌లే’గా మారింది. 1.5 మిలియన్‌ల సబ్‌స్క్రైబర్స్‌తో దూసుకువెళుతోంది.

(చదవండి: ఎవ్వరైనా అంతరిక్షంలో చనిపోతే శరీరం ఏమవుతుంది? ఏం చేస్తారు)
  

Advertisement

What’s your opinion

Advertisement