
నేడు సమాజంలో ప్రతి ఒక్కరూ సంక్షోభ సమయాలు ఎదుర్కొంటున్నారు. సంక్షోభ సమయంలో ‘నీ కోసం నేనున్నానని’ ఎవరో ఒకరు నిలవకపోతే బయటపడటం కష్టమవుతోంది. ‘రీమాతో విడాకుల తర్వాత తాగుడు అలవాటు లేని నేను తాగుబోతుగా మారాను. సంవత్సరం పాటు లెక్కకు మించి తాగుతూ స్పృహ తప్పేవాణ్ణి. కాని అమ్మ నన్ను కాపాడింది’ అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు అమిర్ ఖాన్. అతడు తీసిన ‘సితారే జమీన్ పర్’ విజయవంతం కావడంతో తన జీవితంలో సవాళ్లను ఎలా అధిగమించాడో పంచుకున్నాడు.
మనిషి ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు, సమస్యతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ‘ఇక చాలు... బయటపడు... నిన్ను నువ్వు నిలబెట్టుకో’ అని ధైర్యం చెప్పాలి. అలా ధైర్యం చెప్పే మనిషి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. లేదంటే సంక్షోభంలో ఉన్న మనిషి తీసుకునే నిర్ణయాలు అసాధారణం అవుతాయి. నేడు పేపర్ తెరిస్తే హత్యలు, ఆత్మహత్యలు కనపడుతున్నాయి. సాటి మనిషి నుంచి సరైన సహాయం లేకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు. స్వీయ విధ్వంసం లేకుండా జీవితాన్ని నిలబెట్టుకోవడం నేడు పెద్ద సవాలుగా ఉంది.
ఇలాంటి స్థితి సెలబ్రిటీలకు కూడా ఉంటుంది. కాని వారు ఎలా బయటపడ్డారో తెలిస్తే సాధారణ వ్యక్తులకు స్ఫూర్తి అందవచ్చు. తాజాగా ‘సితారే జమీన్ పర్’ సినిమాతో విజయం అందుకున్న అమిర్ ఖాన్ ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన జీవిత విశేషాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. వాటిలో ఒకటి తన మొదటి విడాకుల సమయంలో ఎదురైన కుంగుబాటు. ‘మా అమ్మ హెచ్చరికతో నేను కోలుకున్నాను’ అంటున్నాడు.
తాగుబోతుగా మారాను
అమిర్ ఖాన్ కెరీర్‌లో ఎదగక ముందే రీనా దత్తాను 1986లో రహస్య పెళ్లి చేసుకున్నాడు. ఇది ‘సఖి’ సినిమాలో జరిగినట్టుగానే జరిగింది. అయితే ఆ తర్వాత ఇరు కుటుంబాలూ మెల్లగా వారిని యాక్సెప్ట్ చేశాయి. అయితే 2000 సంవత్సరం నాటికి వీరి అనుబంధంలో పగుళ్లు వచ్చాయి. అదే సంవత్సరం రీనా పిల్లల్ని తీసుకుని సమీపంలోని ఫ్లాట్‌లోకి మారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో అమిర్ ఇలా చెప్పాడు. ‘రీనా వెళ్లిన రోజు రాత్రి నేను ఇంట్లో ఒక్కణ్ణే ఉన్నాను. పనివాళ్లు లేరు. మా డ్రైవర్‌ని ఆమెకు, పిల్లలకు తోడు ఇచ్చి పంపాను.
నాకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పటికి నేను ఆల్కహాల్ ముట్టలేదు– ఒకటి రెండుసార్లు సినిమా షూటింగ్ లో భాగంగా తప్ప. అయితే స్నేహితుల కోసం మా ఇంట్లో ఆల్కహాల్ ఉండేది. ఆ రోజు రాత్రి బాటిల్ తాగి స్పృహ తప్పి పడిపోయాను. అప్పటి నుంచి రోజూ తాగుతూనే ఉండేవాణ్ణి. నాకు నిద్ర వచ్చేది కాదు. తాగి తాగి స్పృహ తప్పేవాణ్ణి అంతే. ప్రతి శనివారం పిల్లలు వచ్చేవారు. రెండు వారాలకు ఒకసారి రెండు రోజులు నాతో ఉండేవారు.
ఆ రోజుల కోసం ఎదురుచూసే వాణ్ణి. అప్పుడు మాత్రం తాగేవాణ్ణి కాదు. ఆ సమయంలో నేను సినిమాలు చేయలేదు. ఇంట్లో నుంచి బయటకు రాలేదు. సినిమా పరిశ్రమలో కేవలం ఇద్దరు ముగ్గురే నా పరిస్థితి విని చూడటానికి వచ్చారు. వారిలో జూహీ చావ్లా, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ ఉన్నారు. ఇక ఇలాగే ఉండిపోతానేమో అనుకున్నాను’ అన్నాడతను.
తల్లి చెప్పిన మాట
అమిర్ తండ్రి తాహిర్ హుసేన్ ఒకప్పటి ప్రసిద్ధ నిర్మాత. తల్లి జీనత్ గృహిణి. తండ్రి 2010లో మరణించాడు. తల్లి ముంబైలోని మరో ఇంట్లో కుమార్తెలతో ఉంటోంది. అమిర్ జీవితంలో ఏం జరుగుతున్నదో ఆమెకు తెలుసు. కాని ఆమిర్‌ను ఎలా దారికి తేవాలో తెలియదు. ఆ సమయంలో ఏం జరిగిందో అమిర్ ఇలా తెలియచేశాడు. ‘నేను డిప్రెషన్‌లో వ్యాయామం వదిలేశాను. ఏం తింటున్నానో ఏం తినడం లేదో తెలియదు.
అప్పటికి ఏడాదిన్నర అయ్యింది నేను షూటింగ్ చేసి. ఒకరోజు ఉదయాన్నే మా అమ్మ ఫోన్ చేసింది. పేపర్‌లో నీ ఫొటో రాణి ముఖర్జీతో వచ్చింది చూడు అంది. నా ఫొటో రాణిముఖర్జీతో ఎందుకు వచ్చింది అని పేపర్ చూశాను. ఆ రోజుల్లో చాలా లావుగా ఉండే ఒక యాక్టర్‌తో రాణి ముఖర్జీ ఫొటో ఉంది. నేను తిరిగి అమ్మకు కాల్ చేశాను– నీ ఫొటో కూడా అలా చూస్తానేమోనని బెంగగా ఉందిరా అంది.
వెంటనే నాకు షాక్ తగిలింది. సాధారణంగా అమ్మలు తమ పిల్లల్ని ఎంత లావుగా ఉన్నా చిక్కిపోయాడనే అంటూ ఉంటారు. ఇక్కడ మా అమ్మ మాత్రం నేను లావుగా అయిపోతున్నానని బాధ పడుతోంది. అమ్మ ఇలా బాధపడటం నా అరాచకానికి అంతిమస్థాయి అనిపించింది. అంతే. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను... మళ్లీ పూర్వపు మనిషి కావాలని. అలా మా అమ్మ నన్ను నిలబెట్టింది’ అన్నాడు. అమిర్, రీనా 2002లో విడాకులు తీసుకున్నారు.
(చదవండి: ప్రధాని మెచ్చిన రొట్టె! ఆ ఒక్క మాటతో..)