
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కర్నాటకలోని కలబుర్గి రొట్టెల గురించి ప్రస్తావించడం ఒక విశేషం అయితే, కొన్ని గంటల వ్యవధిలోనే కలబుర్గి రొట్టెల ఉత్పత్తి సహకార సంఘానికి 60కి పైగా అమెజాన్ ఆర్డర్లు రావడం మరో విశేషం. కలబుర్గి జిల్లాలోని వందలాది మహిళలకు ఈ సంఘం ఉపాధి కల్పిస్తోంది. జిల్లాలోని వివిధ గ్రామాల మహిళల నుంచి రొట్టెలను సేకరించి ఇ–కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయిస్తుంటుంది.
‘కలబుర్గి రొట్టెల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించడం వల్ల ఎంతోమంది పేద మహిళలకు మేలు జరుగుతోంది. ఒకప్పుడు మేమందరం ఇంటిపనులకే పరిమితమయ్యేవాళ్లం. రొట్టెల తయారీ ద్వారా వ్యాపారంలోకి అడుగుపెట్టాం’ అంటుంది కొట్నూరు గ్రామంలోని ‘నంది బసవేశ్వర రొట్టి కేంద్ర’కు చెందిన నింగమ్మ.
‘కలబుర్గి రొట్టెల గురించి ప్రధాని మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది. దీని వల్ల మా రొట్టెలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది’ అంటుంది చిట్టాపూర్ గ్రామానికి చెందిన శరణమ్మ. ఆమె ‘మాతా మల్లమ్మ రోటీ కేంద్ర’ నిర్వాహకురాలు.
(చదవండి: "దాల్ తల్లి": ఆ విదేశీ బామ్మ నిస్వార్థ సేవకు మాటల్లేవ్ అంతే..!)