
40 రోజులు.. 1,338 కిలోమీటర్లు జయంతీలాల్ హర్‌జీవన్‌దాస్ పటేల్ పాదయాత్ర
అయోధ్య: శ్రీరాముడిపై అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు గుజరాత్‌లోని మెహసనా నుంచి కాలినడకన బయలుదేరి 1,338 కిలోమీటర్ల దూరంలోని యూపీలోని అయోధ్య క్షేత్రానికి 40 రోజుల్లో గురువారం చేరుకున్నారు. అయోధ్యకు (Ayodhya) నడిచి వెళ్లాలనే మూడు దశాబ్దాలనాటి సంకల్పాన్ని సాకారం చేసుకున్నారు.
మెహసనా జిల్లా మోదీపూర్ గ్రామానికి చెందిన జయంతీలాల్ హర్‌జీవన్‌దాస్ పటేల్ (Jayantilal Harjivandas Patel) 1990లో బీజేపీ అగ్ర నేత ఎల్‌కే అడ్వాణీ చేపట్టిన సోమ్‌నాథ్–అయోధ్య రథయాత్రను స్ఫూర్తిగా తీసుకున్నారు. అప్పట్లో గుజరాత్‌లోని జరిగిన ఆ యాత్రలో జయంతీలాల్ పటేల్ పాల్గొన్నారు కూడా. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కూడా జరగడంతో తన కల నెరవేర్చుకునే సమయం వచ్చిందని భావించారాయన. ఆ మేరకు తన యాత్రను ఆగస్ట్ 30వ తేదీన స్వగ్రామం నుంచి ప్రారంభించారు.
రోజుకు 33–35 మేర నడుస్తూ, రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకున్నారు. మార్గమధ్యంలోని ఆలయాలు, పబ్లిక్ పార్కులు, అతిథి గృహాల్లో విరామమిచ్చేవారు. కుటుంబసభ్యులు ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆయన క్షేమ సమాచారం తెలుసుకోవడంతోపాటు, ఆ మార్గంలో తర్వాతి స్టాప్ ఏమిటో తెలియజేస్తుండే వారు. అయోధ్యకు చేరుకున్న జయంతీలాల్ కరసేవక్‌పురంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌ను కలుసుకున్నారని ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!