మన ప్రతిభ మెరుస్తుందా? | 72nd Miss World pageant will be held in Hyderabad, Telangana, from May 2025 | Sakshi
Sakshi News home page

మన ప్రతిభ మెరుస్తుందా?

Apr 17 2025 4:30 AM | Updated on Apr 17 2025 7:59 AM

72nd Miss World pageant will be held in Hyderabad, Telangana, from May 2025

అందాల పోటీలు మన దేశానికి చాలాసార్లు కిరీటాన్ని తొడిగాయి! కాస్మెటిక్స్‌కి మంచి మార్కెట్‌గా మార్చాయి! భారత్‌కు బ్రాండ్‌నూ సృష్టించాయి! మన అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్నీ పెంచాయి... ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో స్టార్స్‌ని చేశాయి! ఆ అవకాశాలు ఇప్పుడు తెలంగాణ వెదుక్కుంటూ వచ్చాయి... మేలో జరగనున్న 73వ మిస్‌ వరల్డ్‌ పోటీలకు హైదరాబాద్‌ను డెస్టినేషన్‌గా కోరుకుంటూ! ఆ స్టోరీ...

భాష, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక వైవిధ్యంలో తెలంగాణ.. మన దేశానికి మినియేచర్‌గా ఉంటుంది. ఆ ప్రత్యేకతే  తెలంగాణ రాష్ట్రాన్ని మిస్‌ వరల్డ్‌ పోటీలకు వేదికను చేసింది. ఇక్కడి కళలు, చేనేత, పర్యాటకప్రాభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. అందులో భాగంగానే ఈ పోటీలను తెలంగాణలోని పలుచోట్ల నిర్వహించనున్నారు.

 వీటిని కవర్‌ చేయడానికి అంతర్జాతీయంగా మూడువేల మీడియా సంస్థలు వస్తున్నాయి. అలా తనకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. పోచంపల్లి ఇక్కత్‌తో 120 దేశాల సుందరీమణులు మెరవబోతున్నారు. హిందూ, ముస్లిం సౌభ్రాతృత్వానికి చిరునామా అయిన లాడ్‌బజార్‌లో హెరిటేజ్‌ వాక్‌ చేయబోతున్నారు. చౌమొహల్లా ప్యాలెస్‌లో చవులూరించే రుచులతో విందారగించనున్నారు. వీటన్నిటితోపాటు తెలంగాణ అభివృద్ధి, తమ అబ్జర్వేషన్స్‌నూ అంతర్జాతీయ మీడియా సంస్థలు.. ఫీచర్స్‌గానో.. ఆఫ్‌ బీట్‌ స్టోరీస్‌గానో ఫోకస్‌ చేస్తాయి. 

అలా తెలంగాణ టాక్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ అవుతుందని అందాల పోటీల నిర్వాహకుల అభి్రపాయం.  తెలంగాణ కూడా ఇక్కడి పర్యాటకం మీద ప్రపంచదృష్టి పడేలా చేసి తద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తోంది. ఈ పోటీల్లో లోకల్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌లు, హెయిర్‌ స్టయిలిస్ట్‌లు, టెక్స్‌టైల్, కాస్ట్యూమ్‌ డిజైనర్స్, ఇతర కళాకారులకు అవకాశాలు లభించి, వారి ప్రతిభకు ప్రపంచ గుర్తింపు దొరకనుందా?
హైదరాబాద్‌ను సౌత్‌ ఫ్యాషన్‌ హబ్‌లా మార్చనుందా? ఇక్కడా గ్రూమింగ్‌ సెంటర్స్, ఇమేజ్‌ బిల్డింగ్‌ కన్సల్టేషన్స్, స్కిన్‌ కేర్‌ ఇండస్ట్రీస్‌ ఏర్పడనున్నాయా? ఆయా రంగాల్లోని నిపుణులు ఏమంటున్నారో చూద్దాం!

బాధ్యతనూ తీసుకోవాలి
నారాయణ పేట్‌ విమెన్‌ వీవర్స్‌ మీద నేనొక డాక్యుమెంటరీ చేశాను. లాక్‌డౌన్‌ టైమ్‌లో వాళ్లకో ఉపాధిలా ఉంటుందని తస్రిక వీవింగ్‌ టెక్నిక్‌తో అక్కడి స్త్రీలతో చీరలను నేయించాను. వాటికి నేను డిజిటల్‌ ప్రింట్స్‌ని యాడ్‌ చేసి ఆ చీరలతోనే వాళ్లకు మేకోవర్‌ చేసి నారాయణ పేట్‌ లోనే వీడియో షూట్, ఫొటో షూట్‌ చేశాను. ఆ డిజైన్స్‌ని హైదరాబాద్‌కి తీసుకొచ్చి పదిహేను రోజులు ఎగ్జిబిషన్‌లా పెట్టి.. ఆ సేల్స్‌ని పెంచాం. తర్వాత ఆ చీరలను హ్యాండ్లూమ్‌ డే రోజు వాళ్లకు గిఫ్ట్‌గా ఇచ్చాం. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి చేయూతా దొరక లేదు. అలాగే ఈ అందాల పోటీల వల్ల మన టెక్స్‌టైల్స్‌ గురించి ఒక వారం మాట్లాడుకుంటారేమో అంతే! అవకాశాలు రావాలి, పెరగాలంటే మాత్రం టెక్స్‌టైల్‌ మినిస్ట్రీ చొరవ తీసుకునిæతెలంగాణ ఫ్యాషన్‌ హబ్‌ లాంటిదొకటి ఏర్పాటు చేయాలి.  
– హేమంత్‌ సిరి, ఫ్యాషన్‌ డిజైనర్‌

మంచి అవకాశం
నేనైతే దీన్ని పాజిటివ్‌గానే చూస్తాను. ఈ మిస్‌ వరల్డ్‌ కంటెస్ట్‌ తెలంగాణలో అందాల పోటీలకు ఓ స్పేస్‌ క్రియేట్‌ చేస్తుందనుకుంటున్నాను. ఫుట్‌వేర్, కాస్ట్యూమ్‌ డిజైనర్స్, హెయిర్‌ స్టయిలిస్ట్స్, మేకప్‌ ఆర్టిస్ట్స్‌ లాంటివాళ్లెందరికో అవకాశాలు దొరుకుతాయి. అంతేకాదు ఈ పోటీల్లో వాడే ఫుట్‌వేర్, కాస్ట్యూమ్స్‌ తయారీకీ ఇది హబ్‌గా మారొచ్చు. గ్రూమింగ్‌ సెంటర్స్, ఇమేజ్‌ బిల్డింగ్‌ కన్సల్టేషన్స్, స్కిన్‌ కేర్‌ ఇండస్ట్రీస్‌కీ స్కోప్‌ ఉంటుంది. గ్రూమింగ్‌ వల్ల తర్వాత అమ్మాయిలు ఏ రంగంలోకి వెళ్లాలనుకున్నా ఆ కమ్యూనికేషన్‌ స్కిల్స్, కాన్ఫిడెన్స్‌ ఉపయోగపడతాయి. 
– కె. అభిమానిక యాదవ్, సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ కోచ్‌

ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని..
మేకప్‌ రంగంలో మంచి విమెన్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌లు ఉన్నారు. కానీ వాళ్లకు అవకాశాల్లేవు. అలాంటి వాళ్లకు ఈ ఈవెంట్స్‌ ఉపయోగపడాలి. నేను వరుసగా నాలుగేళ్లు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ ఈవెంట్‌కి వర్క్‌ చేశాను. ఆ తర్వాత నుంచి మళ్లీ అబ్బాయిలనే తీసుకుంటున్నారు. అలా కాకుండా  దీన్ని తెలంగాణ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. అర్హతలు, ప్రమాణాలు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని మేకప్‌ ఆర్టిస్ట్‌ల నుంచి కొటేషన్స్‌ను ఆహ్వానించాలి
– శోభాలత, సీనియర్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌

భద్రత.. రక్షణ కల్పించి...
ముందు మహిళలకు తగిన భద్రత, రక్షణ కల్పించి.. ఆ తర్వాత మిస్‌ వరల్డ్‌ పోటీలకు వేదికను ఇవ్వడం గురించి ఆలోచించాలి. వీటివల్ల తెలంగాణ ప్రతిష్ఠ పెరగడం మాట ఎలా ఉన్నా తెలంగాణ వనరులు విదేశీ పెట్టుబడి సంస్థలకు ధారదత్తం అవడం మాత్రం ఖాయం అని నాకనిపిస్తోంది.
– భండారు విజయ, రచయిత, మహిళా హక్కుల కార్యకర్త

బ్యూటీ పాజంట్‌ విత్‌ తెలంగాణ స్టయిల్‌
ఈ పోటీలు హైదరాబాద్‌ మొదలుకొని రామప్ప, పోచంపల్లి, చౌమొహల్లా ప్యాలెస్‌.. ఇలా పలుచోట్ల జరుగుతాయి. వీటివల్ల ప్రపంచం మన కళలు, సంస్కృతి, మన వారసత్వ సంపదను తెలుసుకుంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇక్కడి వైద్య సౌకర్యాలను గమనిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ వైవిధ్యాన్ని పరిచయం చేయబోతున్నాం. ఈ పోటీలను బ్యూటీ పాజంట్‌ విత్‌ తెలంగాణ స్టయిల్‌ అనుకోవచ్చు.  
– మామిడి హరికృష్ణ, డైరెక్టర్, భాష – సాంస్కృతిక శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement