
క్విట్ ఇండియా
1942 ఆగస్టు 8 క్విట్ ఇండియా ఉద్యమం.. ‘డూ ఆర్ డై’ నినాదం. ‘ఇక చాలు... తోక ముడవండి’ అని బ్రిటిష్ వారిని హెచ్చరిస్తూ తిరగబడిన ప్రజాసందోహం. ఆ సమయంలో ఐదుగురు నారీమణులు శివంగులై కదిలారు. నాయిక స్థానంలో నిలిచి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ప్రాణాలు కోల్పోయారు. వారి గొంతు నుంచి ఒక మాట మాత్రం ఆగలేదు– ‘వందే మాతరం’. అరుణ అసఫ్ అలీ, సుచేత కృపలానీ, తారారాణి శ్రీవాస్తవ, కనకలత బారువా, మతింగిని హజ్ర....
ఈ త్యాగదీప్తులకు వందనం.
అప్పటికి బ్రిటిష్ వారి ధోరణి పూర్తిగా ముదిరిపోయింది. భారతదేశాన్ని రెండో ప్రపంచ యుద్ధంలోకి లాగాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. దానికితోడు ‘పాక్షిక స్వాతంత్య్రం ఇస్తాం’ అని చెప్పడం పుండు మీద కారం చల్లినట్టయ్యింది. అప్పటికే ఎల్లెడలా స్వాతంత్య్ర కాంక్ష వెల్లువెత్తుతోంది. జనంలోని వేడిని, వారి నాడిని గమనించిన గాంధీజీ ఆగస్టు 8, 1942న బొంబాయి గొవాలియా ట్యాంక్ మైదాన్ నుంచి ‘క్విట్ ఇండియా’ పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’ నినాదాన్ని అందించారు.
ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు... అందరూ ఇందులో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వంతో ముడిపడిన కార్యకలాపాలన్నీ బంద్ చేయమన్నారు. అయితే క్విట్ ఇండియా ఉద్యమంలో కనిపించిన ఒక గొప్ప పరిణామం స్త్రీలు ఇందులో పెద్ద సంఖ్యలో మమేకం కావడం. బ్రిటిష్ వాళ్లు రంగంలో దిగి పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేయడం వల్ల ‘నాయకులు లేని ఉద్యమం’గా గుర్తింపు పొందిన క్విట్ ఇండియా ఉద్యమంలో స్త్రీలు నాయక స్థానానికి ఎదిగారు. ప్రజలను నడిపించారు. త్యాగాలు చేశారు.ప్రాణాలు కోల్పోయారు. అట్టి వారిలో ఐదుమంది స్త్రీలు సదా స్మరణీయులు. వారిని తెలుసుకుందాం.
అరుణ అసఫ్ అలీ
ఈమెకు ‘గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండిపెండెన్స్’, ‘హీరోయిన్ ఆఫ్ 1942’ తదితర బిరుదులు ఉన్నాయి. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అరుణ అసఫ్ అలీ పేరు సగర్వరంగా తలుచుకుంటారు. గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చాక ఏ మైదానం నుంచైతే ఆ పిలుపునిచ్చారో అదే మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి అరుణ ఆసఫ్ అలీ బయలుదేరారు. అప్పటికే బొంబాయిలో ఆందోళనలు, దుందుడుకు చర్యలు, దహనాలు, వాటిని అణచడానికి పోలీసుల కాల్పులు జరుగుతున్నాయి. అయినా సరేప్రాణాలకు తెగించి అరుణ ఆసఫ్ అలీ జాతీయపతాకాన్ని ఎగుర వేశారు. ఆ తర్వాత గొవాలియా ట్యాంక్ మైదాన్ ‘ఆగస్ట్ క్రాంతి మైదాన్’గా పిలువబడింది.
సుచేత కృపలానీ
బెనారస్ హిందూ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా ఉన్న సుచేత ఆచార్య కృపలానీని వివాహం చేసుకుని సుచేత కృపలానీ అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తగా చురుగ్గా పని చేయడంప్రారంభించిన సుచేత ‘ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్’ స్థాపించారు. క్విట్ ఇండియా పిలుపు అందిన వెంటనే సుచేత భారీ ప్రదర్శనలకు పిలుపునిచ్చి ముందు వరుసలో నడిచారు. అజ్ఞాతంలో ఉంటూ కార్యకర్తలను నడిపించారు. చివరకు బ్రిటిష్ పోలీసులు ఆమె జాడ తెలుసుకుని అరెస్ట్ చేశారు. రాజ్యాంగ రచనలో సభ్యురాలిగా ఉన్న సుచేత ఉత్తరప్రదేశ్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలోనే తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.
తారారాణి శ్రీవాస్తవ్
క్విట్ ఇండియా ఉద్యమ సమయానికి తారారాణి శ్రీవాస్తవ్ వయసు 13 సంవత్సరాలు. అప్పటికే పులేందు బాబుతో వివాహం అయ్యింది. క్విట్ ఇండియా ఉద్యమ పిలుపు అందుకుని ఆమె తన ఊరు సివాన్ (బిహార్) పోలీస్ స్టేషన్ మీద జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు బయలుదేరింది. ఊరేగింపు మీద పోలీసులు కాల్పులు జరపగా పులేందు బాబు కుప్పకూలాడు. అయినా తారారాణి ఆగలేదు. ముందుకే సాగి పోలీస్ స్టేషన్ మీద జాతీయ పతాకం ఎగురువేసింది. వెనుకకు వచ్చి తిరిగి చూసే భర్త మరణించి ఉన్నాడు. ఆ వియోగాన్ని భరిస్తూనే చెక్కుచెదరని స్ఫూర్తితో ఆమె ఆ తర్వాతి కాలంలో దేశం కోసం పోరాడింది.
కనకలత బారువా
అస్సామ్ చెందిన 17 ఏళ్ల యువతి కనకలత బారువా త్యాగం ఎంతో గొప్పది. దేశం కోసం అప్పటికే ఆమె ‘మృత్యువాహిని’ అనే దళం నడిపేది. క్విట్ ఇండియా పిలుపు విని తన దళంతో ఆమె గోహ్‌పూర్ పోలీస్ స్టేషన్ పై జాతీయ పతాకం ఎగురవేసేందుకు బయలుదేరింది. లాఠీలకు, హెచ్చరికలకు ఆగలేదు. చివరకు కాల్పులు జరిపితే బుల్లెట్‌కు ఎదురొడ్డిప్రాణాన్ని త్యాగం చేసింది. కనకలత లాంటి ఎందరో ధీరలు ‘డూ ఆర్ డై’ నినాదాన్ని నిజ అర్థంలో స్వీకరించే దేశానికి ఉత్తేజం ఇచ్చారు.
మతంగిని హజ్రా
ఈమెను అందరూ ‘గాంధీ అవ్వ’ అని పిలిచేవారు. స్వాతంత్య్ర పోరాటంలో 73 ఏళ్ల వయసులో పాల్గొనడమే అందుకు కారణం. గాంధీ ఆదర్శాలకు నిలబడటం వల్ల కూడా. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బెంగాల్‌లోని ‘తమ్‌లుక్’లో పోలీస్ స్టేషన్ వైపు ఆరువేల మంది జనం కదిలారు. వారిలో ముందున్న వ్యక్తి మతంగిని హజ్రా. ఆమె చేతిలో జాతీయ పతాకం ఉంది. పోలీసులు విచక్షణారహితంగా బాదుతున్నా ఆమె ‘వందేమాతరం’ నినాదం ఆపలేదు. చేతిలోని పతాకాన్ని జార విడువలేదు. ఆ దెబ్బలతోనే ఆమె మరణించింది. దేశం కోసం ఆమె చేసిన త్యాగం మరపురానిది.