పరమేశ్వరా.. పాహిమాం | - | Sakshi
Sakshi News home page

పరమేశ్వరా.. పాహిమాం

Nov 24 2026 12:54 AM | Updated on Nov 24 2026 12:54 AM

పాలకొల్లు క్షీరారామంలో కార్తీక శోభ

● సోమారామంలో ప్రత్యేక అభిషేకాలు

● క్షీరారామానికి పోటెత్తిన భక్తులు

భీమవరం (ప్రకాశం చౌక్‌): కార్తీక సోమవారం పురస్కరించుకుని భీమవరం పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం శివనామ స్మరణతో మార్మోగింది. స్వామివారికి తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించి, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారి దర్శనానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా, పంచారామ యాత్రికులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తిశ్రద్ధలతో కార్తీక నోములు నోచుకున్నారు. భక్తులకు దేవస్థానం, దాతల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద వితరణ చేపట్టారు.

భీమేశ్వర స్వామి ఆలయంలో...

పట్టణంలోని మరో ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలోనూ తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించగా, భక్తులు స్వయంగా క్షీరాభిషేకాలు, పంచామృతాభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈవో తోట శ్రీనివాస్‌, ఇతర అధికారులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పాలకొల్లు సెంట్రల్‌: ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం కార్తీక రెండవ సోమవారం భక్తులతో కిటకిటలాడింది. సాధారణంగా ప్రతి సోమవారం వేకువజాము నుంచే విపరీతమైన రద్దీ ఉండే ఈ ఆలయంలో, ఈసారి ఉదయం వేళ దర్శనాలు సాఫీగా సాగాయి. ఉదయం 9 గంటల నుంచి భక్తుల తాకిడి క్రమంగా పెరిగి, మధ్యాహ్నం 11 గంటల సమయానికి పంచారామ యాత్రికుల రాకతో ఆలయ ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది. తెల్లవారుజామునే మహిళలు కాలువలో పవిత్ర స్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వదిలారు. అనంతరం కెనాల్‌ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వర స్వామి, దాసోహాంజనేయ స్వామి వార్లను దర్శించుకుని క్షీరారామలింగేశ్వరుని సన్నిధికి చేరుకున్నారు. అభిషేకాల మండపం, ఆలయ వెనుక భాగం మహాన్యాస పూజల్లో పాల్గొన్న భక్తులతో నిండిపోయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రాపాక శ్రీనివాసరావు, చైర్మన్‌ మీసాల రామచంద్రరావు, పట్టణ ఎస్సై జి. పృథ్వీ ఆధ్వర్యంలో పోలీసు, ఆలయ సిబ్బంది, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు విస్తృత సేవలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement