బాలుడి హత్యపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

బాలుడి హత్యపై కేసు నమోదు

Nov 24 2026 12:54 AM | Updated on Nov 24 2026 12:54 AM

పెదపాడు: బాలుడి మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు శివారులోని ఇందిరా కాలనీకి చెందిన కూన నాగకుమారి, రమేష్‌ దంపతులకు ప్రణీత్‌ సాయి అనే కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తలు విడివిడిగా ఉంటుండటంతో నాగకుమారి అదే ప్రాంతంలో కేర్‌టేకర్‌గా పనిచేస్తూ జీవిస్తోంది. ఈ నెల 22న ఉదయం కుమారుడికి ఇడ్లీ పెట్టి ఆమె పనికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి కుమారుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారిని ఆరా తీయగా, పాలు పోసే బొర్రా సాయి అనే వ్యక్తి బాలుడిని మోటార్‌ సైకిల్‌పై ఎక్కించుకుని వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయంపై నాగకుమారి ఫోన్‌ చేయగా, బొర్రా సాయి జరిగిన ఘటనను వివరించాడు.

సుబ్రహ్మణ్యం కర్రతో దాడి చేయడంతో..

ఉదయం పాలు పోసి తిరిగి వస్తుండగా ఊరి బయట ఉన్న మద్యం దుకాణం వద్ద కొత్తూరు గ్రామానికి చెందిన కొలుసు సుబ్రహ్మణ్యంతో తనకు మాటామాటా పెరిగిందని, ఆ గొడవలో సుబ్రహ్మణ్యం తన ముక్కుపై గుద్దాడని బొర్రా సాయి తెలిపాడు. అక్కడే ఉన్న శేషగిరి, పిలగల సత్యనారాయణలు వారిని విడిపించి పంపించారు. అనంతరం బొర్రా సాయి బాలుడు ప్రణీత్‌ సాయిని బైక్‌పై ఎక్కించుకుని బీరయ్య దేవుని గుడి వద్దకు రాగా, సుబ్రహ్మణ్యం వారిని అడ్డుకుని కర్రతో దాడి చేశాడు. సాయి తన ఎడమ చేయి అడ్డుపెట్టడంతో చేతి వేలికి గాయమైంది. సుబ్రహ్మణ్యం మరోసారి కర్రతో కొట్టగా బొర్రా సాయి తప్పించుకున్నాడు. దాంతో ఆ దెబ్బ బైక్‌ వెనుక కూర్చున్న బాలుడు ప్రణీత్‌ సాయి కుడి నుదురు కణతపై బలంగా తగిలి తీవ్ర గాయమైంది. వెంటనే బాలుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం నిమిత్తం ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లి నాగకుమారి ఫిర్యాదు మేరకు సుబ్రహ్మణ్యంపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement