సమస్యలు పరిష్కరిస్తాం
● తాగునీటి కోసం కటకట
● డ్రెయినేజీ వ్యవస్థ లేదు
● పట్టించుకోని పాలకులు
కై కలూరు: అయ్యా.. మాకు కుళాయిల్లో నీరు వచ్చి నాలుగు రోజులయ్యింది.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాకు ఇళ్లు ఇచ్చారు. మా కాలనీలో ఎలా బతుకుతున్నామని అడిగిన పాలకులే ఇప్పుడు కనిపించడం లేదు. సమస్యలపై ప్రశ్నిస్తే కక్షసాధింపునకు పాల్పడతారని భయపడి కుమిలిపోతున్నాం.. అని పేరు చెప్పడానికి ఇష్టపడని కాలనీలో ఓ మహిళ ఆవేదిన ఇది..
‘ఏం చెప్పమంటారండీ.. వర్షం వచ్చిదంటే మా రహదారులు బురదకయ్యిలుగా మారుతున్నాయి. లైట్లు వెలగవు. డ్రెయినేజీ సిస్థం లేకపోవడంతో మురుగునీటి వాసన. కుళాయిల్లో నీరు రాకపోవడంతో ట్యాంకర్ల కోసం అడుగుతుంటే రహదారులు చూసి ఎవరూ ముందుకు రావడం లేదు’ ఇది కాలనీలో ఓ వ్యక్తి తీవ్ర ఆవేదన. ఇలా కాలనీలో ఎవరిని పలకరించిన బోరున గోడు చెప్పుకుంటున్నారు.
నియోజకవర్గం నాలుగు మండలాల్లో కై కలూరులో జగనన్న గ్రీన్ విలేజ్‌ను వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలోనే మోడల్ కాలనీగా తీర్చిదిద్దారు. ఇక్కడ 94.52 ఎకరాల్లో 3,072 ప్లాట్లును కై కలూరు పట్టణం, మండవల్లి మండలంలో పలు గ్రామాల లబ్ధిదారులకు కేటాయించారు. వీరిలో 2,761 మందికి పట్టాలను పంపిణీ చేశారు. మొత్తం మీద 1,424 మంది గృహాలను పూర్తి చేసుకుని నివాసాలు ఉంటున్నారు. మరో 1650 మంది లబ్ధిదారులు గృహాలు వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే నిబంధనల పేరుతో జగనన్న గ్రీన్ విలేజ్ బోర్డులను తొలగించారు.
గుక్కెడు నీటి కోసం నరకయాతన..
గ్రీన్ విలేజ్ కాలనీకి కై కలూరు భవానమ్మ తాగునీటి చెరువు నుంచి కుళాయిలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక్కడ కేవలం ముప్పాతిక పైపులైను మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పైపు నుంచి 8 నుంచి 10 కుటుంబాలు విడిగా పైపులు ఏర్పాటు చేసుకున్నారు. కాలనీలో దాదాపు 300 పైనే కుళాయిలు ఉన్నాయి. పైపులకు నీరు సరిగా రాకపోవడం, అందరూ ఒకేసారి మోటర్లు వేయడం వంటి సమస్యలతో తాగునీరు అందడం లేదు. మోటర్లుకు విద్యుత్ బిల్లులు ఎక్కువవుతున్నాయని, నీరు మాత్రం రావడం లేదని మహిళలు వాపోతున్నారు.
బురదకయ్యిలుగా రోడ్లు..
గ్రీన్ విలేజ్‌లో రోడ్లు చిన్నపాటి వర్షానికే బురదకయ్యిలుగా మారుతున్నాయి. ఇంటి నిర్మాణాలు చేయని స్థలాల్లో నీరు నిల్వ, జమ్ము చెట్లు పెరగడంతో రాత్రి సమయంలో దోమల ఉదృతి పెరుగుతోంది. ఇటీవల ప్రధాన రెండు సీసీ రహదారులు నిర్మించినా నిధులు కొరత వల్ల రోడ్డు అంచుల వద్ద కంకరు వేయలేదు. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రీన్ విలేజ్‌ను కేవలం రాజకీయకోణంలో కాకుండా ప్రజల ఇబ్బందులు దృష్ట్యా మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
గ్రీన్ విలేజ్‌లో నీటి కొరత వాస్తవమే. ఇటివల పైపులైన్ వాల్స్‌కు సంబంధించి రిపేరు వచ్చింది. విజయవాడ నుంచి సామాగ్రిని తీసుకువచ్చాం. వాటిని పంచాయతీ సిబ్బంది అమర్చారు. ఇప్పటికే నీటిని సరఫరా చేస్తున్నాము. కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. త్వరలో పరిష్కరిస్తాం.
– వీ.ఫణిరాజకుమారి, పంచాయతీ ఈఓ, కై కలూరు


