ఆకివీడు: స్థానిక నగర పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరిగింది. చైర్‌పర్సన్ ఎండీ నీలోఫర్, నూతన కౌన్సిలర్లతో కమిషనర్ జి. కృష్ణమోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ప్రొటోకాల్ పాటించకపోవడంపై వైఎస్సార్‌సీపీ కౌన్సిలరుఅభ్యంతరం తెలిపారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేవలం 23 మంది కౌన్సిలర్ల ఫొటోలు మాత్రమే ఉన్నాయని, తమ పార్టీకి చెందిన ఐదుగురి ఫొటోలు ఎందుకు వేయలేదని కమిషనర్‌ను నిలదీశారు. దీనిపై ఆయన సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కొంచాడ బాబ్జీ, ఎండీ ఆలీ, దొడ్డి జగదీష్, షేక్ ఫర్వీన్ బీబీ, మద్దా ఫ్రాన్సీనా ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ పక్షపాత ధోరణితో అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ, దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రమేష్ కౌన్సిలర్లతో కలిసి కమిషనర్‌తో చర్చించారు. వైస్ చైర్మన్‌గా జనసేన కౌన్సిలర్ తోట వాసు, విప్‌గా కిమిడి అరుణకుమారి, ఫ్లోర్ లీడర్‌గా వేగేశ్న రామరాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపసభాపతి కె. రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి కౌన్సిలర్లందరూ సహకరించాలని కోరారు.


