చలికి జనం గజగజ | - | Sakshi
Sakshi News home page

చలికి జనం గజగజ

Nov 17 2026 12:44 AM | Updated on Nov 17 2026 12:44 AM

జాగ్రత్తలే శ్రీరామరక్ష

● రోజురోజుకి తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

● పిల్లలు, వృద్ధుల్లో పెరుగుతున్న శ్వాస సంబంధిత సమస్యలు

● స్వెట్టర్లు, ఉన్ని దుస్తులకు పెరిగిన డిమాండ్‌

జనజీవనంపై ప్రభావం

తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రారంభమయ్యే రోజువారీ పనులకు చలి ఆటంకంగా మారింది. విద్యార్థులు, పాల వ్యాపారులు, ఆకుకూరల విక్రేతలు, హోటళ్ల నిర్వాహకులతో పాటు మార్నింగ్‌ వాకింగ్‌, రన్నింగ్‌ చేసే యువత చలికి వణుకుతూనే బయటకు రావాల్సి వస్తోంది.

పొంచి ఉన్న ఆరోగ్య సమస్యలు

ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ చిన్నారులు, వృద్ధులు త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో పాటు శ్వాసకోశ సమస్యలు వేధిస్తున్నాయి. చలి తీవ్రతకు రక్తనాళాలు సంకోచించడం వల్ల రక్తప్రసరణ మందగించి గుండైపె అదనపు భారం పడే ప్రమాదం ఉంది. గుండె జబ్బులు, మధుమేహం, ఆస్తమా బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల్లో జలుబు, దగ్గుతో పాటు కొన్నిసార్లు వాంతులు కూడా అయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఉన్ని దుస్తులకు పెరిగిన గిరాకీ

చలి తీవ్రతతో ఉన్ని దుస్తుల వ్యాపారం ఊపందుకుంది. స్వెట్టర్లు, జర్కిన్లు, మంకీ క్యాప్‌లు, మాస్క్‌లు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ద్వారకాతిరుమల సొసైటీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో రహదారి పక్కన రాజస్థాన్‌కు చెందిన వ్యాపారులు తాత్కాలిక దుకాణాన్ని ఏర్పాటు చేసి శీతాకాలపు దుస్తులను విక్రయిస్తున్నారు. ఇక్కడ స్వెట్టర్లు రూ. 300 నుంచి రూ. 1,500 పైబడి ధరల్లో లభిస్తున్నాయి.

మంచు మొదలైతే పంటలకు నష్టమే!

ప్రస్తుత చల్లని వాతావరణం ఆకుకూరలు, కాలీఫ్లవర్‌ వంటి కొన్ని ఉద్యాన పంటలకు మేలు చేస్తోందని రైతులు చెబుతున్నారు. అయితే, పొగమంచు కురవడం మొదలైతే పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

శీతాకలంలో కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తాగుతూ, వ్యాధి నిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారం తీసుకోవాలి. చలిగాలుల్లో తప్పనిసరి బయటకు వెళ్లాల్సి వస్తే స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు వంటి రక్షణ దుస్తులు ధరించాలి. అలర్జీ, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

– డాక్టర్‌ ఎ.ప్రవీణ్‌ కుమార్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి

చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జనం గజగజ వణుకుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరగడం సాధారణ జనజీవనంపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా తెల్లవారుజామున పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది జలుబు, దగ్గు బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. – ద్వారకాతిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement