ఆశావహులకు అడియాసలే.. | - | Sakshi
Sakshi News home page

ఆశావహులకు అడియాసలే..

Nov 17 2026 12:44 AM | Updated on Nov 17 2026 12:44 AM

భీమవరం: భీమవరం మున్సిపాలిటీకి 12 ఏళ్ల అనంతరం జరుగుతున్న ఎన్నికలపై జిల్లా ప్రజలంతా దృష్టి పెట్టారు. వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థుల ఎంపికలో ముందునుంచీ దూకుడుగా వ్యవహరిస్తూ 52 స్థానాల్లో పోటీకి అభ్యర్థులను సిద్ధం చేసింది. అయితే అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలో సీట్ల సర్దుబాటు చిచ్చు రాజేసింది. చివరకు బీజేపీ ఒంటరిగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని సాక్షాత్తు ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రకటించడంతో కూటమిలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. ఇదిలా ఉండగా మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని జనసేనకు కేటాయించడంతో అభ్యర్థి ఎంపిక జటిలంగా మారింది. ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేయని కొత్త ముఖాలు తమకే చైర్‌పర్సన్‌ పీఠమంటూ రోడ్డెక్కడంతో ఎంతోకాలంగా పార్టీ కోసం కష్టపడిన నాయకులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

ఆస్తులమ్మి ప్రయత్నించినా..

చైర్‌పర్సన్‌ పదవి కావాలంటూ పార్టీ పెద్దల వద్దకు వెళితే ఎన్నికల్లో రూ.30 కోట్ల వరకు ఖర్చవుతుందని, ముందుగా రూ.15 కోట్లు తెచ్చిపెడితేనే అవకాశమిస్తామని చెప్పడంతో ఓ ఆశావహ అభ్యర్థి పది ఎకరాల పొలం అమ్మి మరీ డబ్బులు తెచ్చి పార్టీ ముఖ్యనాయకుల ముంగిట పెట్టారు. దీంతో వారికే టికెట్‌ దక్కుతుందంటూ నమ్మబలికారు. ఫలితంగా సదరు అభ్యర్థి పట్టణంలోని వరద ముంపు బాధితులకు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే మరో అభ్యర్థి మున్సిపల్‌ ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే తమకే సీటు దక్కుతుందంటూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పేదలకు భోజనాలు, దుస్తులతో పాటు కొన్ని వర్గాలకు పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేశారు. ఇలా చైర్మన్‌ పీఠాన్ని ఆశించినా చివరకు జనసేన అభ్యర్థిగా డాక్టర్‌ చుండూరి మల్లీశ్వరి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో సీటు ఆశించిన ఇతర నాయకులు, ‘పార్టీ పెద్దలు మమ్మల్ని మోసం చేశారంటూ’ లబోదిబోమంటున్నారు.

కౌన్సిలర్‌ సీట్ల పేరుతో వసూళ్లు

మరోవైపు కూటమిలోని టీడీపీ, జనసేనకు చెందిన కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు కౌన్సిలర్‌ సీటు ఇప్పిస్తామంటూ కొందరి వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేయగా, కూటమి సర్దుబాట్లలో వారికి సీట్లు దక్కలేదు. ముఖ్యంగా టీడీపీకి చెందిన నలుగురు నాయకులు డబ్బులు దండుకునే వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. అలాగే కొంతమంది జనసేన నాయకులు కూడా మీకే కౌన్సిలర్‌ అవకాశమంటూ అందినకాడికి దండుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరకు సీటు దక్కకపోవడంతో ‘మా డబ్బుల మాటేమిటంటూ’ బాధితులు నిలదీస్తున్నట్లు సమాచారం. ఈ వసూళ్ల ప్రభావం ప్రస్తుతం ప్రత్యక్ష పోటీలో ఉన్న అభ్యర్థులపై పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలతో భీ మవరం మున్సిపల్‌ ఎన్నికలను జిల్లావ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా మార్చాయి.

ఉన్నది కాస్తా ఊడింది !

ఆస్తులమ్మినా దక్కని అవకాశం

కూటమి పెద్దలు మోసం చేశారంటూ ఆందోళన

కౌన్సిలర్‌ సీటు ఇప్పిస్తామంటూ సొమ్ముల వసూళ్లు

లబోదిబోమంటున్న ఆశావహులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement