అమ్మో.. మళ్లీ పులి | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. మళ్లీ పులి

Nov 14 2026 12:47 AM | Updated on Nov 14 2026 12:47 AM

అమ్మో.. మళ్లీ పులి

● పశ్చిమ మన్యంలో కలకలం ● పశువులపై దాడి.. అధికారుల అప్రమత్తం

బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం మరోమారు కలవరపరుస్తోంది. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం బీట్‌లోని జిళ్లెళ్లగూడెంలో శుక్రవారం వేకువజామున కె.వెంకటేష్‌ అనే రైతుకు చెందిన ఆవుపై దాడి చేసి పులి చంపిందనే సమాచారం తీవ్ర ఆందోళన కలిగించింది. రెండు రోజుల క్రితం వేలేరుపాడు మండలంలో కొంతూరు, నాగవరంలో సంచరించి అక్కడ ఒక ఆవు, రెండు లేగ దూడలపై దాడి చేసిన పెద్ద పులి, అక్కడ నుంచి తెలంగాణ ప్రాంతంలోనికి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారం అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నట్టు పులికి అమర్చిన రేడియో టాలీ ట్రాకర్‌ సిగ్నల్‌ ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే తెల్లవారే సరికి జిల్లాలోని జీలుగుమిల్లి మండలంలో ప్రవేశించి, ఆవుపై దాడి చేసి అదే ప్రాంతంలో మాటేసినట్టు తెలిసింది. రాత్రి సమయంలో పులి కదలికలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున అటవీ శాఖ అధికారులు గట్టి నిఘా ఏర్పాటుచేశారు. పులి అదే ప్రాంతంలో ఉంటుందా? లేక బుట్టాయగూడెం మండలం వైపు వస్తుందా అని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రజలకు తప్పని భయాందోళనలు

పులి సంచారం, పశువులపై దాడులతో పశ్చిమ ఏజెన్సీ ప్రజలు భయపడుతున్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక పక్క రబీకి సంబంధించిన వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పొగాకు నాట్లు వేయడంతో పత్తి, మిరప, ఇతర అపరాల పంటల పనుల్లో రైతులు, కూలీలు బిజీగా ఉన్నారు. మరో పక్క గ్రామాల్లో పరిషత్‌ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల ఊరేగింపులు, పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పులి సంచారం ఒక్కసారిగా కలకలం రేపింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పులి పశువులపై తప్ప మనుషులపై దాడి చేసిన ఘటనలు లేకపోయినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో బయటకు తిరగవద్దని, పశువులు, మేకల కాపరులు అటవీ ప్రాంతానికి వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే పులి కదలికలపై రేడియో ట్రాకర్‌ ద్వారా నిరంతరం నిఘా ఉంచామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement