వైఎస్సార్‌సీపీ చింతలపూడి కన్వీనర్ విజయరాజు
చింతలపూడి: అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తి అవగాహన పెంచుకుని మాట్లాడాలని వైఎస్సార్‌సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ కూటమి నాయకుల తీరుపై పలు విమర్శలు చేశారు. యూసీజీ ప్రాజెక్టు వల్ల ఎలాంటి నష్టం జరగదని, గ్రామాలు, ఇళ్లు ఖాళీ చేయాల్సిన అవసరం ఉండదని ఇటీవల నామవరం ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులు చెబుతూ స్థానిక ప్రజలను, రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాము బొగ్గు తవ్వకాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూనే, కోల్ గ్యాసిఫికేషన్ విధానం వల్ల నీరు, గాలి తీవ్రంగా కలుషితమవుతాయని, తద్వారా పంట భూములను కోల్పోవాల్సి వస్తుందని రైతులు భయాందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఎలాగైనా రైతులను ఒప్పించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు తెలుగుదేశం నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. యూసీజీ వల్ల ఎలాంటి నష్టం లేకపోతే ప్రపంచంలోని పలు దేశాలు ఈ ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేశాయని ప్రశ్నించారు. అధికార బలంతో రైతులను మభ్యపెట్టి భూములు సేకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు, రైతులు గమనించాలని సూచించారు. నీరు, గాలి కలుషితమైతే మనుషులతో పాటు ఏ జీవరాశి కూడా మనుగడ సాగించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పర్యావరణానికి వినాశనం కలిగించే ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వకూడదని, నష్టం లేదని భావిస్తే ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలబడితే తమపై విష ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించడం దురదష్టకరమన్నారు. రాజకీయాలకు అతీతంగా యూసీజీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ప్రభావిత గ్రామాల ప్రజలు, రైతులు టీడీపీ నాయకుల ప్రచారాన్ని నమ్మవద్దని, స్థానిక ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వం నడుచుకోవాలని కోరారు. నాయకులు శెట్టిపల్లి మోహన్ బాబు, ఎర్రంశెట్టి రామకష్ణారావు, సయ్యద్ బాజీ, తదితరులు పాల్గొన్నారు.


