భీమడోలు: వరుస తుపాన్లు తమకు ఆర్థికంగా కృంగదీశాయని, అప్పుల పాలై రోడ్డున పడ్డామని పంట నష్టాల అంచనా కేంద్ర బృందం వద్ద రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. మురసు తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న సూరప్పగూడెంలో శుక్రవారం కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందం పర్యటించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డెప్యూటీ కార్యదర్శి అలోక్ జవహర్ ఆధ్వర్యంలో కేంద్ర బృందం సభ్యులు హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్‌వీఎస్‌పీ శర్మ, సెంటర్ వాటర్ కమీషన్ ఎస్‌ఈ కొల్లు రేఖారాణి, విజయవాడ జాతీయ రహదారుల శాఖ రీజనల్ కార్యనిర్వాహక ఇంజనీర్ శశాంక్ శేఖర్‌రాజ్ పంట పొలాలను సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పంట పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని, పరిహారం అందించాలని రైతులు అభ్యర్థించారు. ఎకరాకు రూ.40 వేలకు పైగా పెట్టుబడులు అయ్యాయని, తమకు ఆదుకోకుంటే రోడ్డున పడతామని బోరుమన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ్ మండలంలో మురసు తుపాన్ వల్ల పంట, ఇతర నష్టాల వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, ఉద్యాన డీడీ సాజానాయక్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, వివిధ శాఖల జేడీలు కేఎం అంబేడ్కర్, జెడ్.రమేష్, గుణకనకారావు, విజయరత్నం, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, తహసీల్దార్ బి.రమాదేవి, ఏడీఏ పి.ఉషారాజకుమారి, ఏఓ ఎస్‌పీవీ ఉషారాణి ఉన్నారు.


