తణుకు అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) బలపర్చిన అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ఉద్యోగులంతా ఐక్యంగా పనిచేయాలని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు పిలుపునిచ్చారు. శనివారం తణుకులో తణుకు, తాడేపల్లిగూడెం డిపోల ఈయూ ఉమ్మడి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దామోదరరావు మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు, భవిష్యత్తుకు సీసీఎస్ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు. వేతన సవరణలు, డీఏ బకాయిలు, పీఎఫ్, అధిక పెన్షన్, కారుణ్య నియామకాలు, ఉద్యోగ భద్రత వంటి సమస్యల పరిష్కారం కోసం ఈయూ నిరంతరం పోరాడుతోందని గుర్తుచేశారు. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే విధానాలను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని, బస్సులను సంస్థే కొనుగోలు చేసి ఉద్యోగుల ద్వారానే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జీఎస్ నారాయణ, జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు జి. చిరంజీవి, వై.శ్రీనివాసరావు, కేజీఎస్ శేఖర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేఎస్ రాజు, అల్లం సత్యనారాయణ, సీనియర్ నాయకులు కె. విజయ్ ప్రతాప్, వివిధ డిపోల నేతలు పాల్గొన్నారు.


