ఓటు వజ్రాయుధం.. అమ్ముకోవద్దు | - | Sakshi
Sakshi News home page

ఓటు వజ్రాయుధం.. అమ్ముకోవద్దు

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

స్థానిక ఎన్నికల ప్రచార హోరు గ్రామాల్లో ఊపందుకుంది. సమయం లేదు మిత్రమా అంటూ పోటీపడి మైకులతో చేస్తున్న ప్రచారాలు చెవుడు తెప్పించేలా తయారయ్యాయి. భార్యల తరఫున భర్తలు, భర్తల తరఫున భార్యలు, పిల్లలు సైతం తెగ ప్రచారం చేస్తున్నారు. పల్లెల్లో వెంకన్న సుప్రభాతం మోగకముందే అభ్యర్థుల ప్రచారాల హోరు మొదలవుతోంది. ఈ నేపథ్యంలో నలుగురు మహిళల ముచ్చటించుకుంటున్న సంభాషణ ఇది.

సుందరి: ఏమే రామలక్ష్మీ! స్టార్‌ మాలో నిన్న కార్తీకదీపం సీరియల్‌లో మిస్‌ హైదరాబాదుగా వెలిగిన జ్యోత్స్న.. రోడ్డుపై టిఫిన్‌ బండి వద్ద గిన్నెలు తోముకోవడం ఏమిటో! సూరజ్‌ కారు కింద పడిన పారిజాతం పరిస్థితి ఎలా ఉందో!

రామలక్ష్మీ: అక్కా సుందరీ! ఇంకా సీరియల్‌ ఎందుకు? మన ఊరిలో ఎన్నికల సిత్రాలు సీరియల్‌ను మించిపోతున్నాయి. ఓటు కోసం వచ్చే నాయకుల నటన ముందు మన సీరియల్‌ నటులు ఏమాత్రం సరిపోరు!

గీతా: ఏంటీ అక్కాచెల్లెళ్లు తెగ గుసగుసలాడేసుకుంటున్నారు? కాస్త మాక్కూడా చెప్పండి, నాకు తోచిన మాట సాయం చేస్తాను.

సుందరి: అదేం లేదు గీతా.. ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నాం. అవునుకానీ, మీ ఇంటికేంటి? ఎప్పుడూ రాని మీ మావయ్య సుబ్బారావు పది మందిని తీసుకుని హడావిడి చేశాడు. ఏదైనా విశేషమా చెప్పు?

గీతా: ఓ అదా! ఎంపీటీసీ ఎన్నికల్లో మా మామయ్య కొడుకు రామకృష్ణ పోటీ చేస్తున్నాడు. ఐదేళ్లుగా మా ముఖం చూడని మావయ్యకు ఇప్పుడు చుట్టాలు గుర్తొచ్చారు. మా ఇంట్లో ఒక పది ఓట్లు ఉన్నాయిగా.. దీనికోసం ఎప్పుడూ చూపని ప్రేమను ఒలకబోస్తున్నాడు. ఎన్నికలంటే అంతే మరి!

సుల్తానా బేగం: (చేటలో బియ్యాన్ని ఎగరవేస్తూ) ఏంటి గీతా బేటీ.. ఏదో సీరియస్‌గా మాట్లాడుతున్నారు? ఇరుగుపొరుగు వాళ్లమయ్యాక ప్రేమలు, మాటలు పంచుకోవాలి కదా! అల్లా దయ వల్ల అందరికీ మంచే జరగాలి. అవును, అటుగా వస్తోంది మన మరియమ్మ కాదా? దిగాలుగా ఉంది, ఇటు పిలువు.

గీతా: (పరుగున వెళ్లి) ఇదిగో మరియమ్మ.. మీ ఫ్రెండ్‌ సుల్తానా పిలుస్తోంది, రా!

సుల్తానా బేగం: మరియమ్మ ఏంటి? ముఖం అలా పెట్టావు? చేతిలో చిన్న సంచి ఉంది, ఏం ఉంది అందులో?

మరియమ్మ: ఏం చెప్పను సుల్తానా నా ఇబ్బందులు! మాది పెద్ద కుటుంబం నీకు తెలుసు కదా. కూలి పనులకు వెళితే కానీ ఆ రోజు కుండ వెలగని పరిస్థితి మాది. ఇప్పుడు బియ్యం బస్తా ఏకంగా రెండు వేలు దాటింది. నూనె ప్యాకెట్‌ రూ. 165, చివరికి పంచదార కూడా రూ. 65, ఉల్లిపాయలు కేజీ రూ. 80 పలుకుతున్నాయి. నేను రూ. 2000 తీసుకెళితే ఇదిగో చూడు ఎన్ని సరుకులు వచ్చాయో!

సుందరి: (పక్కింటి ఆవిడ) మరియమ్మ! నిత్యావసర ధరల వల్ల కేవలం మీ కుటుంబమే కాదు, రాష్ట్రంలో ప్రతి మధ్యతరగతి ప్రజలూ ఇబ్బంది పడుతున్నారు. అంతెందుకు, నేను రోజువారీ లీటరు పాలను తగ్గించి పావు లీటరుతో సరిపెడుతున్నాను. ఇంతటి నిత్యావసరాల పెరుగుదల ఎప్పుడూ చూడలేదు!

దుర్గ: (దండెంపై బట్టలు ఆరవేస్తూ) ఒక్క నిత్యావసర ధరల పెరుగుదలేనా? మన ఊరి రోడ్లు చూశావా ఎలా ఉన్నాయో! మొన్న అర్నబ్‌ తుపానుకు అవి మరింతగా పాడయ్యాయి. మా పెద్దోడు బండి మీద పచ్చగడ్డి తెస్తుంటే అమాంతం గుంతలో పడిపోయాడు. ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది.

మరియమ్మ: దుర్గమ్మా! బాగా చెప్పావు. ఇదిగో, ఓట్ల కోసం వస్తారుగా, అప్పుడు రోడ్లు బాగు చేయాలని నిలదీద్దాం. ఏమైనా సరే, ఓటుకు డబ్బులు తీసుకోకూడదు. అప్పుడే నాయకులను సమస్యలపై గట్టిగా నిలదీయగలం.

హేమ: (గీతా కూతురు) అమ్మా! అర్నబ్‌ తుపాను మాదిరిగానే ఇంకో తుపాను వస్తోందంట. మేడపై బట్టలు ఆరేశాం, చినుకులు పడుతున్నాయి, బేగా రా అనగానే అందరూ రేపు మాట్లాడుకుందాం అంటూ ఇళ్లలోకి పరుగులు పెట్టారు. – కై కలూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement