ద్వారకాతిరుమల: స్థానిక ఎన్నికల ప్రభావం చినవెంకన్న క్షేత్రంపై కనిపిస్తోంది. సాధారణంగా ప్రతి శనివారం వేలాది మంది భక్తులతో సందడిగా ఉండే ద్వారకాతిరుమల శ్రీవారి దివ్యక్షేత్రానికి ఈ వారం భక్తుల రాక తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు కొంత వెలవెలబోయాయి. మరోవైపు, ప్రతి వారం 100కు పైగా జంటలతో నిర్వహించే స్వామివారి నిత్య కల్యాణంలో ఈసారి కేవలం 65 జంటలే పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఆదివారం కూడా రద్దీ తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం): జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి ఆలయ గార్డెన్ మార్గమధ్యంలో భూవరాహ స్వామి దర్శనం అనంతరం భక్తులు కంకణధారణతో గిరి ప్రదక్షిణ చేపట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప, గోవింద, భవానీ మాలధారులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఉచిత దర్శనం, ప్రసాద వితరణ, అన్నప్రసాద ఏర్పాట్లను ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్తలు, ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించారు. పూజా టికెట్లు, ప్రసాదాలు, విరాళాల ద్వారా మొత్తం రూ.1,69,900 ఆదాయం సమకూరినట్లు ఈవో రాంబాబు వెల్లడించారు.
కరెంట్ షాక్‌తో యువకుడి మృతి
పాలకొల్లు సెంట్రల్: తుపాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో కరెంట్ షాక్ తగిలి పలివెల కిషోర్‌కుమార్ (38) అనే యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం స్థానిక 10వ వార్డు ఎంబెరుమన్నార్ పేటలో విద్యుత్ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేస్తుండగా, కిషోర్ వారికి సహాయపడేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ పోల్‌ను ఎత్తుతుండగా, పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు పోల్‌కు తగిలాయి. దీంతో కిషోర్‌కు తీవ్ర విద్యుత్ షాక్ తగలగా, పోల్‌పై ఉన్న మరో వ్యక్తి కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే కిషోర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కిషోర్‌కు ఇటీవలె వివాహం కాగా, ఆయన భార్య ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న కిషోర్.. వ్యక్తిగత పని మీద పాలకొల్లు వచ్చినట్లు తెలిపారు.
బుట్టాయగూడెం: మండలంలోని పైదావారిగూడెం గ్రామానికి చెందిన పైదా నాగార్జున (36) శనివారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జున తన పొలం నుంచి పాత ఇనుప పైపును భుజంపై వేసుకొని వస్తున్న సమయంలో, పొలంలో వేలాడుతున్న విద్యుత్ తీగలకు ఇనుప రాడ్డు తగిలింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై చెన్నారావు ఘటనా స్థలానికి చేరుకుని, కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆర్టీసీ డిపో, బస్టాండ్ తనిఖీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు ఆర్టీసీ డిపో గ్యారేజ్, కొత్త బస్టాండును జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం శనివారం తనిఖీ చేశారు. గ్యారేజ్‌లో టైర్ సెక్షన్‌ను పరిశీలించి, మైలేజీ పెంచాలని, ఇంధనాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. వివిధ బస్సులను పరిశీలించి, లోపాలను వెంటనే సరిదిద్దాలని సూచించారు. కొత్త బస్టాండ్‌లో నిలిచిన వర్షపు నీటిని తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని హెచ్చరించారు. బస్టాండ్‌లోని దుకాణాలను తనిఖీ చేసి, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్మితే టెండర్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. డిపో మేనేజర్ బి. వాణి పాల్గొన్నారు.


