పెనుగొండ: పెనుగొండ మండల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి పిల్లి శ్రీ వెంకట సుధాకర్ విద్యుత్ షాక్‌కు గురై త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. శుక్రవారం రాత్రి పెనుగొండ మండలంలో ప్రచారం ముగించుకొని ఇంటికి చేరుకున్న అనంతరం మైకు, ఇతర విద్యుత్ సామగ్రిని తనిఖీ చేస్తుండగా ఆయనకు షాక్ తగిలింది. స్పృహ తప్పి పడిపోయిన ఆయన్ను వెంటనే తణుకు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడడంతో వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయినప్పటికీ, ఎన్నికలు సమీపిస్తుండడంతో నీరసంగా ఉన్నప్పటికీ ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. వైద్యులు సూచించిన విధంగా తగిన మందులు ఇస్తే చాలంటూ శనివారం తిరిగి ప్రచారంలోకి దిగారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు జెడ్పీటీసీ అభ్యర్థి పిల్లి శ్రీనును పరామర్శించి, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మరో రెండు రోజులు మాత్రమే ప్రచారం ఉండడంతో, ఈ తక్కువ సమయంలోనూ ప్రచారంలో పాల్గొంటానని శ్రీను తెలిపారు. జెడ్పీటీసీ అభ్యర్థికి విద్యుత్ షాక్ తగిలిందన్న సమాచారం మండలంలో తెలియడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు.


