పరామర్శించిన పార్టీ నేతలు
ఏలూరు టౌన్: రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న టీడీపీ శ్రేణుల దౌర్జన్యాలు ఇప్పుడు ఏలూరు నగరానికీ పాకాయి. టూటౌన్ పరిధిలోని పత్తేబాదలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ నాయకుడి అనుచరులు దారుణంగా దాడి చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే తమ పార్టీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఏలూరు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు యక్కల నాని టూటౌన్ ప్రాంతంలోని 37, 38, 43 డివిజన్లకు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా 37, 38 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులకు ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నాయకులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ తిరిగిన నాయకుడు తీరా కార్పొరేటర్ సీటులో పోటీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. అతని కుటుంబ సభ్యులు టీడీపీ నుంచి కార్పొరేటర్‌గా పోటీలో ఉండగా, ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ఎదురుగాలి వీస్తుండటంతో ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నాయకులను భయబ్రాంతులకు గురిచేసేందుకు దాడులకు తెగబడ్డారని అంటున్నారు.
టీడీపీ కార్యకర్తల దాడులు
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాలు శుక్రవారంతో ముగియడంతో పత్తేబాద శివాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకుడు యక్కల నాని కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నాయకుడి అనుచరులు, కార్యకర్తలు యక్కల నానిపై దాడికి పాల్పడ్డారు. రోడ్డుపై కొట్టుకుంటూ టీడీపీ నాయకుడి ఇంటి సమీపానికి తీసుకెళ్లి అతని సమక్షంలోనే మరోసారి తీవ్రస్థాయిలో దాడికి పాల్పడ్డారు. ఇదే తరహాలో 38వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ద్రాక్షారపు రీనావతి భర్త అనిల్‌కుమార్‌పైనా టీడీపీకి చెందిన రౌడీలు దాడులు చేశారు. రక్తం వచ్చేలా కొట్టి బెదిరింపులకు గురిచేశారని బాధితులు చెబుతున్నారు. ఏలూరు జీజీహెచ్‌లో ఇద్దరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఏలూరు జీజీహెచ్‌లో యక్కల నానిని దాడిపై ఆరా తీస్తున్న పార్టీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్, మేయర్ అభ్యర్థి జీఎంఆర్, జిల్లా అధికారప్రతినిధి జాన్, చిరంజీవి
టీడీపీ కార్యకర్తల దాడిలో గాయాలైన కార్పొరేటర్ అభ్యర్థి భర్త అనిల్‌కుమార్‌ను పరామర్శిస్తున్న పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి, పార్టీ నేతలు
ఏలూరులో ప్రశాంతతను భగ్నం చేస్తున్న టీడీపీ
వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు
యక్కల నాని, అనిల్‌కుమార్‌పై దాడి చేసిన వైనం
ఏలూరు జీజీహెచ్‌లో వైద్య చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు యక్కల నాని, అనిల్‌కుమార్‌ను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, మేయర్ అభ్యర్థి గంటా మోహనరావు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, బీసీసెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, నగర బీసీసెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, ముస్లిం మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల బాజీ తదితరులు పరామర్శించారు. టీడీపీ దాడులతో గాయాలపాలైన పార్టీ నాయకులను కలిసి అండగా నిలబడ్డారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే ఏలూరు నగరంలోనూ టీడీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం, విష సంస్కృతిని తీసుకురావటం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరిగేలా చేసి ..ప్రజా మద్దతుతో ఎన్నికల్లో గెలవాలనీ, ఇలాంటి దాడులు చేయటం సిగ్గుచేటన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఏలూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపు ఖాయమనీ ధీమా వ్యక్తం చేశారు.


