క్షేత్రంలో ప్రత్యేక ఆహ్వానితుడి వైఖరి వివాదాస్పదం! | - | Sakshi
Sakshi News home page

క్షేత్రంలో ప్రత్యేక ఆహ్వానితుడి వైఖరి వివాదాస్పదం!

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

ద్వారకాతిరుమల: దేవస్థానం ట్రస్ట్‌బోర్డులో పదవి అంటే భక్తులకు సేవ చేసే ఓ బాధ్యత. కానీ ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం ట్రస్ట్‌బోర్డులోని ఓ ప్రత్యేక ఆహ్వానితుడి వ్యవహారశైలి ఇందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టాల్సిన ఆయన.. వ్యక్తిగత అవసరాల కోసం సిబ్బందిని హింసిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగిన సౌకర్యాలు సకాలంలో కల్పించకపోతే అధికారులకు ఫిర్యాదులు చేయడం, నచ్చని ఉద్యోగుల విధుల మార్పునకు ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలు దేవస్థానంలో చర్చనీయాంశమయ్యాయి.

సిక్స్‌ లడ్డూ బాక్స్‌.. తప్పనిసరా?

ఆయన క్షేత్రానికి వచ్చిన ప్రతిసారీ సిక్స్‌ లడ్డూ (ఆరు లడ్డూల) బాక్స్‌ ఇవ్వాల్సిందేనని సిబ్బంది చెబుతున్నారు. తన వెంట ఎంతమంది వచ్చినా దర్శనాలకు ఆటంకం ఉండకూడదని, వారందరికీ కండువాలు వేయిస్తూ ప్రత్యేక మర్యాదలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సుప్రభాత సేవకు సైతం టికెట్లు లేకుండా తనవెంట వచ్చేవారిని ఉచితంగా తీసుకెళ్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఆరు లడ్డూల బాక్స్‌ విషయంలో మాత్రం తగ్గట్లేదని సిబ్బంది ఆయనకు శ్రీసిక్స్‌ లడ్డూ బాక్స్‌శ్రీ అని పేరు పెట్టుకున్నారు.

బస్సు దిగింది మొదలు.. తిరిగెళ్లే వరకు

ఆయన క్షేత్రానికి చేరుకోగానే ఓ ఉద్యోగి బైక్‌పై కొండపైకి తీసుకెళ్లాలి. ఉచిత వసతి గదిలో ఏర్పాట్లు చేయడంతోపాటు, కోరిన సమయానికి టిఫిన్లు, కాఫీలు, భోజనాలు అందించాలి. వివిధ ఉపాలయాలు, దత్తత ఆలయాలకు సైతం అదే ఉద్యోగి తన బైక్‌పై తిప్పాలి. ఇందుకు అయ్యే ఖర్చులను కూడా తామే సొంతంగా భరించాల్సి వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లలో కాస్త ఆలస్యమైతే చాలు ఆయన ఆగ్రహానికి గురికావాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇన్ని సేవలు చేసినా ఏదో ఒక వంకతో అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారని, తనకు నచ్చని ఉద్యోగులను మరో విభాగానికి మార్చడం లేదా విధుల నుంచి తాత్కాలికంగా తప్పించే వరకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన వచ్చిన ప్రతిసారీ తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

సౌకర్యాలన్నీ ఉచితమేనా?

ట్రస్ట్‌బోర్డు సమావేశాలకు హాజరయ్యే సమయంలో సభ్యులందరికీ నిబంధనల ప్రకారం వసతి, ప్రసాదాలు, దర్శన సౌకర్యాలు కల్పిస్తారు. అయితే సదరు ప్రత్యేక ఆహ్వానితుడు నెలలో సగానికి పైగా రోజులు క్షేత్రంలోనే ఉంటూ సకల సౌకర్యాలు పొందుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఆయనతో పాటు ఆయన వెంట వచ్చేవారికి టిఫిన్లు, కాఫీలు, భోజనాలు అన్నీ అందిస్తూ రాచమర్యాదలు చేయాల్సి వస్తోందని, ఆలయ ఛైర్మన్‌ కూడా ఇన్ని సౌకర్యాలు పొందడం లేదని అంటున్నారు. తిరుగు ప్రయాణంలో తన వెంట వచ్చిన వారికి సైతం ఉచితంగా ప్రసాదాల సెట్లు తీసుకెళ్తున్నారన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

వ్యక్తిగత పనులకే ప్రాధాన్యం

ట్రస్ట్‌బోర్డు సభ్యులు ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సమస్యలపై దృష్టి పెట్టాలి. కానీ సదరు ప్రత్యేక ఆహ్వానితుడు ఎప్పుడూ తనకు సహాయకుడి ఏర్పాటు, దర్శనాలు, వ్యక్తిగత అవసరాలకే ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు ప్రత్యేక ఆహ్వానితుడికి, సేవాదళ సభ్యులకు మధ్య వ్యత్యాసంపై అంతా చర్చించుకుంటున్నారు.

రాజకీయ నేపథ్యంతోనే మౌనమా?

ఆయన నియామకం కూటమి ప్రభుత్వ పెద్దల ద్వారా జరగడంతో అధికారులు సైతం ఆయన వ్యవహారశైలిపై బహిరంగంగా స్పందించలేక పోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో గాని, ప్రస్తుత ట్రస్టుబోర్డులో గానీ ఏ సభ్యుడి నుంచి ఎదురవని సమస్యలు ఈ ప్రత్యేక ఆహ్వానితుడి ద్వారా ఎదురవుతున్నాయని సిబ్బంది చర్చించుకుంటున్నారు. దేవుడి సన్నిధిలో పదవులు వ్యక్తిగత సౌకర్యాల కోసం కాదని, భక్తులకు సేవలందించేందుకేనని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికై నా ఆయనతీరు మారేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్ట్‌బోర్డులో ఓ ప్రత్యేక ఆహ్వానితుడి వ్యవహారశైలిపై ఆరోపణలు

నెలలో సగానికి పైగా రోజులు క్షేత్రంలోనే మకాం

వసతి ఉచితమే.. టిఫిన్‌ ఇతర ఖర్చులు మాత్రం సిబ్బందివే

సేవలు పొందాక సిబ్బందిపైనే ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement