బియ్యం దుకాణాలపై కేసులు | - | Sakshi
Sakshi News home page

బియ్యం దుకాణాలపై కేసులు

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

బియ్యం దుకాణాలపై కేసులు బీరు లోడు లారీ బోల్తా పిడుగుపాటుతో వ్యవసాయ కూలీ మృతి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/ఏలూరు టౌన్‌: ఎల్‌నినో నెపంతో నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై విజిలెన్స్‌, తూనికలు–కొలతల శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. రీజినల్‌ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి కె. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 5 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. నగరంలోని శ్రీ వెంకటరమణ ట్రేడర్స్‌, రమేష్‌ రైస్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, సోమశేఖర రైస్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, సౌజన్య వెంకట నాగ లక్ష్మీ దుర్గ రైస్‌ స్టోర్స్‌, తనూజ రైస్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌లలో బియ్యం, పప్పులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు వంటి నిత్యావసరాలను ఎక్కువ ధరలకు అమ్మాతే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, ఏఓ జీ. మీరయ్య, తూనికల కొలతల అధికారి జీ. వెంకట ప్రసాద్‌, సీఎస్‌ డీటీ రమేష్‌ పాల్గొన్నారు.

రూ. 20 లక్షల నష్టం

ఆగిరిపల్లి : మండలంలోని ఎస్‌ఏ పేట సమీపంలో గురువారం రాత్రి బీరు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. తూర్పుగోదావరి జిల్లా తుపాకులగూడెం కింగ్‌ఫిషర్‌ కంపెనీ నుంచి 1,900 బీరు కేసులతో కడప ఎకై ్సజ్‌ డిపోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడటంతో సీసాలన్నీ రోడ్డుపై పడి పగిలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తుండగా, డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సురేష్‌ ఘటనా స్థలానికి చేరుకుని, రోడ్డుకు అడ్డంగా పడిపోయిన లారీని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కాగా, రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన బీరు సీసాలను చుట్టుపక్కల ప్రజలు తీసుకెళ్లినట్లు సమాచారం.

పెంటపాడు: మండలంలోని బోడపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ ఆలా రాంబాబు (55) శుక్రవారం మధ్యాహ్నం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా, భారీ వర్షంతో పాటు సమీపంలో పడిన పిడుగు ధాటికి భయంతో గుండె ఆగి అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన తోటి రైతులు ఆయనను వెంటనే తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాంబాబుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా.. ఒక కుమార్తె గతంలోనే మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement