ఉంగుటూరు : మండలంలోని చేబ్రోలు–దూబచర్ల రహదారిలోని గొల్లగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపినాథపట్నం కాలనీకి చెందిన ఆకుల ఏడుకొండలు (50) అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం గొల్లగూడెంలో కిరాణా సరుకులు కొనుగోలు చేసుకుని సైకిల్‌పై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, అతివేగంగా వచ్చిన లారీ హారన్ కొట్టకుండా నిర్లక్ష్యంగా వచ్చి ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుకొండలు తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు 108 అంబులెన్సులో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భీమడోలు: స్థానిక వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్ (బైపీసీ) ప్రథమ సంవత్సరం విద్యార్థిని హాస్టల్ నుంచి అదృశ్యమైంది. కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందిన ఈ విద్యార్థిని కళాశాల హాస్టల్‌లోనే ఉంటూ చదువుకుంటోంది. గురువారం సాయంత్రం హాస్టల్ సిబ్బందికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో హాస్టల్ వార్డెన్ బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమె తల్లి నల్లమోతు మరియమ్మ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
అశ్వారావుపేటరూరల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష, మరో ఇద్దరికి జరిమానా విధించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎస్సై సాయికిశోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం రామన్నపాలేనికి చెందిన కన్నమాల సాయిబాబా, గోపాలపురానికి చెందిన కుర్సం వెంకటేష్ మద్యం తాగి బైక్ నడుపుతూ కొద్ది రోజుల క్రితం అశ్వారావుపేటలో పట్టుబడ్డారు. వీరిని శుక్రవారం దమ్మపేట కోర్టులో హాజరుపర్చగా రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి డాక్టర్ బి.భవాని తీర్పు చెప్పారు. అలాగే మద్యం తాగి వాహనం నడిపిన మరో ఇద్దరికి రూ.2 వేలు జరిమానా విధించారు.
కర్వాచౌత్ పూజలు
కొయ్యలగూడెం: గ్రామ దేవత శ్రీ చింతాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం మార్వాడి మహిళలు కర్వా చౌత్ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భర్తల ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం భార్యలు కార్వాచౌత్ పూజలు చేయడం ఉత్తరాది రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. శివపార్వతులకు, వారి కుమారులైన గణపతి కార్తికేయులకు, పూజల నిర్వహిస్తామని సాయంత్రం చంద్ర దర్శనం, అనంతరం ఉపవాసం ముగిస్తామన్నారు.


