తుపాను విలయం.. రొయ్య రైతుకు నష్టం | - | Sakshi
Sakshi News home page

తుపాను విలయం.. రొయ్య రైతుకు నష్టం

Oct 30 2026 12:57 AM | Updated on Oct 30 2026 12:57 AM

తుపాను విలయం.. రొయ్య రైతుకు నష్టం

డబ్బులు చెల్లించినా భోజనం దొరకని పరిస్థితి

భీమవరం : జిల్లాలో అర్నబ్‌ తుపాను రొయ్యల రైతులను తీవ్రంగా నష్టపరిచింది. ఆక్సిజన్‌ అందక రొయ్యలు మృత్యువాత పడుతుండడంతో రైతులు హుటాహుటిన పట్టుబడులు పట్టే పనిలో నిమగ్నమయ్యారు. భీకర గాలుల కారణంగా చెట్లు, పెద్ద సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో జిల్లావ్యాప్తంగా గత మూడు రోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కరెంట్‌ లేకపోవడంతో చెరువుల్లో ఆక్సిజన్‌ అందించే ఏరియేటర్లు పనిచేయక, రొయ్యలు చనిపోతుండడం రైతులను కలవరపెడుతోంది. ఒకేసారి ఎక్కువ మంది రైతులు పట్టుబడులకు పూనుకోవడాన్ని ఆసరాగా చేసుకుని, రొయ్యల వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పట్టుబడి పట్టే కార్మికుల కొరత వేధిస్తోందని, ఐస్‌ లభ్యం కాకపోవడం వల్ల పట్టుబడికి భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ఒకవేళ పట్టుబడి పట్టకపోతే చెరువుల్లోనే రొయ్యలు చనిపోయి సర్వస్వం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తప్పని కష్టాలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రొయ్యల రైతులకు కష్టాలు ఎక్కువయ్యాయని రైతులు మండిపడుతున్నారు. ఫీడ్‌ ధరలు గణనీయంగా పెరగడం, అధికారంలోకి వచ్చిన వెంటనే సబ్సిడీ విద్యుత్‌ ఇస్తామన్న ప్రభుత్వం రెండున్నరేళ్ల తర్వాత అమలు చేయడం, తెగుళ్ల బెడద, ధరలు అనుకూలంగా లేకపోవడం వంటి వరుస ఘటనలతో తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. రొయ్యల చెరువులకు త్వరితగతిన విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

పెరిగిన పాల ప్యాకెట్లు, నిత్యావసరాల ధరలు

అర్నబ్‌ తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ లేక అనేక చోట్ల భోజన శాలలు, హోటళ్లు మూతపడ్డాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం తదితర పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోనూ బుధ, గురువారాల్లో చాలా హోటళ్లు తెరుచుకోలేదు. పిండి రుబ్బడానికి, చట్నీలు, మసాలాలు తయారు చేయడానికి అవసరమైన మిక్సీలు, గ్రైండర్లు పనిచేయకపోవడంతో టిఫిన్లు, భోజనాల తయారీని నిలిపివేశారు. కొన్ని హోటళ్లు కేవలం బిర్యానీ, నూడిల్స్‌ వంటివే విక్రయిస్తూ అధిక ధరలు వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్‌ లేక ఆక్సిజన్‌ అందక చనిపోతున్న రొయ్యలు

పెద్ద సంఖ్యలో చెరువుల్లో పట్టుబడులు

తగ్గిన ధరలు, పెరిగిన ఖర్చులతో రైతుల విలవిల

దూర ప్రాంతాల నుంచి వివిధ పనుల మీద పట్టణాలకు వచ్చేవారు తిండి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ డబ్బులు చెల్లించినా భోజనం దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు, విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పాల ప్యాకెట్లు నిల్వ ఉంచుకునే అవకాశం కరవైంది. ఉన్న కొద్దిపాటి ప్యాకెట్లను సైతం అక్రమంగా అధిక ధరకు విక్రయిస్తున్నారు. రూ. 32ల విలువైన అరలీటర్‌ పాల ప్యాకెట్‌ను రూ. 50లకు అమ్ముతున్నారని, అడిగినన్ని కూడా ఇవ్వకుండా అరకొరగానే ఇస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. మొత్తానికి, అర్నబ్‌ తుపాను ప్రభావం వల్ల ప్రజలకు మరో రెండు మూడు రోజులు తిప్పలు తప్పేలా లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement