ఏలూరు టౌన్ : అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఏసీబీ పనిచేస్తోందని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు తెలిపారు. ఏలూరులోని ఏసీబీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 26 నుంచి ఈ వారోత్సవాలు చేపట్టినట్లు చెప్పారు. లంచాలకు అలవాటుపడితే ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు జైలు శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. గడిచిన 10 నెలల్లో ఉమ్మడి జిల్లాలో 8 ఏసీబీ దాడులు నిర్వహించి అవినీతి అధికారులను పట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సేవలు అందించడానికి డబ్బులు డిమాండ్ చేస్తే ప్రజలు 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏసీబీ సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): అర్నబ్ తుపాను కారణంగా దెబ్బతిన్న ఉద్యాన పంటల పునరుద్ధరణకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టింది. పంటల నష్ట తీవ్రతను తగ్గించి, సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు, రైతులకు తక్షణ సాంకేతిక సలహాలు అందించడానికి వర్సిటీ ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు ఆదేశాల మేరకు సీనియర్ శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందాలను నియమించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల అరటి, కొబ్బరి, ఆయిల్ పామ్, జీడిమామిడి, పసుపు, బొప్పాయి, మిరప, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. వీటిని కాపాడుకోవడానికి ఆయా జిల్లాల్లో శాస్త్రవేత్తల బృందాలు విస్తృతంగా పర్యటిస్తున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వెంకట్రామన్నగూడెం పరిశోధన స్థాన శాస్త్రవేత్తలు (రెండు బృందాలు), ఏలూరు జిల్లాలో వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం బృందం పర్యటించనుంది. రైతులు ఎవరూ అధైర్యపడకుండా, శాస్త్రవేత్తలు సూచించే తగిన యాజమాన్య పద్ధతులను పాటించి పంటలను కాపాడుకోవాలని ఉపకులపతి విజ్ఞప్తి చేశారు.
ఉంగుటూరు: మండలంలోని గొల్లగూడెం, నల్లమాడు, గోపాలపురం ఆయకట్టు ప్రాంతాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా 30 ఎకరాల్లో అరటి, 17 ఎకరాల్లో బొప్పాయి, 29 ఎకరాల్లో కూరగాయలు, 5 ఎకరాల్లో పూలు, 14 ఎకరాల్లో ఆయిల్ పామ్ దెబ్బతిన్నట్లు గుర్తించామని ఉద్యానవన మండల అధికారి అమర్‌నాథ్ తెలిపారు. 75 శాతం పక్వానికి వచ్చిన అరటి తోటలకు లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున 13–0–45 మందును కలిపి పిచికారీ చేయాలని ఆయన సూచించారు. అలా పిచికారీ చేసిన అరటి గెలలను ఆకులతో కప్పి, 15 రోజుల తర్వాత మార్కెట్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే బొప్పాయిలో పండు ఈగ తెగులు వచ్చే అవకాశం ఉన్నందున, ఎకరానికి 4 చొప్పున ఈగ ట్రాపులు ఏర్పాటు చేసుకోవాలని ఉద్యానవన అధికారి అమర్‌నాథ్ సూచించారు.


