ప్రజలపై కక్ష సాధింపులు సహించం | - | Sakshi
Sakshi News home page

ప్రజలపై కక్ష సాధింపులు సహించం

Oct 30 2026 12:57 AM | Updated on Oct 30 2026 12:57 AM

నూజివీడు: మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తే పింఛన్లు తొలగిస్తామని, చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చివేస్తామని, ఉద్యోగాలు ఊడగొడతామని బెదిరిస్తున్నారని... ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు హెచ్చరించారు. గురువారం నూజివీడులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూజివీడు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతాప్‌ అప్పారావు ఆరోపించారు. మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా బెదిరింపులకు పాల్పడుతుండగా... పెనమలూరుకు చెందిన ఆయన అనుచరులు ఫోన్‌ చేసి, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులను బెదిరిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటువంటి చర్యలపై జిల్లా కలెక్టర్‌, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

బెదిరింపులకు పాల్పడితే తెలియజేయండి

పెనమలూరుకు చెందిన మంత్రి అనుచరుల బెదిరింపులకు నూజివీడు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును అడ్డుకునే ప్రయత్నాలను సహించబోమని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను బెదిరించడం మానేసి, అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం బస్తా ధర రూ.2 వేలకు, నూనె ప్యాకెట్‌ ధర రూ.200కు చేరితే సామాన్యులు ఎలా జీవించాలని ప్రశ్నించారు. ఓట్ల కోసం సామాన్యులపై ఒత్తిడి తీసుకురావడం కాకుండా, ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని మంత్రి పార్థసారథికి హితవు పలికారు. నూజివీడు పట్టణ ప్రజలు ఎలాంటి బెదిరింపులకూ భయపడకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతాప్‌ అప్పారావు విజ్ఞప్తి చేశారు.

మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement