మద్యం దుకాణంలో వృద్ధుడి సజీవ దహనం | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణంలో వృద్ధుడి సజీవ దహనం

Oct 30 2026 12:57 AM | Updated on Oct 30 2026 12:57 AM

● తణుకులో సంచనలం

● ప్రమాదమా.. హత్యా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు

తణుకు అర్బన్‌: మద్యం దుకాణంలో ఓ వృద్ధుడు సజీవ దహనమైన ఘటన తణుకు పట్టణంలో సంచలనం సృష్టించింది. స్థానిక అగ్నిమాపక కేంద్రం పరిధిలోని ‘అమర్‌ వైన్స్‌’ మద్యం దుకాణంలో గురువారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. మృతిచెందిన వ్యక్తిని శీలం వీరన్న (62)గా గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు పట్టణానికి చెందిన వీరన్న ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. అయితే, మద్యం దుకాణం వెనుక భాగంలో నైట్‌ పాయింట్‌ పేరిట నిర్వహిస్తున్న గదిలో ఉంటున్న జక్కంశెట్టి దానవేంద్రరావు అలియాస్‌ జాంపండుతో ఉన్న స్నేహం కారణంగా ఆయన తరచూ తణుకు వస్తుండేవారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి వరకు వీరన్న, జాంపండు ఆ గదిలో ఉన్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత జాంపండు.. వీరన్నను అక్కడే ఉంచి బయటికి వెళ్లిపో యారు. ఆ గదిలో ఉన్న మద్యం నిల్వల కారణంగా, నిద్రించే సమయంలో ఎవరూ లోపలికి రాకుండా బయటి నుంచి తాళం వేసి వెళ్లారు. తుపాను కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వీరన్న కొవ్వొత్తి వెలిగించి నిద్రపోయి ఉండవచ్చని, ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

తెల్లవారుజామున దట్టమైన పొగలు

గురువారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో మద్యం దుకాణం నుంచి విపరీతమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు సమీపంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే వీరన్న పూర్తిగా కాలిపోయి మృతిచెందారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ జేవీ రమణ, ఎస్సై సీహెచ్‌ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుమారుడు మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ప్రమాదమా? మరేదైనా కారణమా?

మద్యం దుకాణంలో అగ్నికి ఆహుతై మరణించిన ఈ ఘటన అనుమానాస్పదంగా మారింది. అసలు ఇది ప్రమాదమా? లేక మరేదైనా జరిగిందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. వేమగిరిలో ఉంటున్న వీరన్న తణుకు ఎందుకు వచ్చారు? సొంత సోదరుడు ఉన్నప్పటికీ, మద్యం దుకాణంలో ఎందుకు నిద్రించారు? అనే విషయాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. మృతుడు గతంలో తణుకులోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్‌ కాగా, ఆయన భార్య పదేళ్ల క్రితమే మరణించారు. పెద్ద కుమారుడు మల్లేశ్వరరావు దుబాయిలో స్థిరపడగా, చిన్న కుమారుడు మురళీకృష్ణ తన కుటుంబంతో కలిసి తునిలో నివసిస్తున్నారు.

కాలిపోయిన వీరన్న మృతదేహం, శీలం వీరన్న (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement