వైభవంగా శ్రీవారి చక్రస్నానం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీవారి చక్రస్నానం

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

ఘనంగా వేదసభ

ద్వారకాతిరుమల: వేద మంత్రోచ్ఛరణలు.. పవిత్ర అభిషేకాలు.. భక్తులపై చల్లిన శ్రీచక్ర స్నాన తీర్థం.. ఇలా ద్వారకాతిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆశ్వీయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగళవారం శ్రీచక్ర స్నాన వేడుకను అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉదయం ఉభయదేవేరులతో కూడిన స్వామివారు తిరువీధి వాహనంపై క్షేత్ర పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ యాగశాలలో శ్రీవారు, అమ్మవార్లు, శ్రీచక్ర పెరుమాళ్ల ఉత్సవమూర్తులను ఒకే వేదికపై వేంచేపు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, పంచపల్లవులు, శ్రీచందనం, పసుపు, మంత్రపూత అభిషేక తీర్థంతో శ్రీచక్ర స్వామికి విశేష అభిషేకం జరిపారు. ఆ తర్వాత శ్రీచక్ర పెరుమాళ్లతోపాటు ఉభయ నాంచారులు, శ్రీవారికి తిరుమంజనాలు నిర్వహించి హారతులిచ్చారు. అభిషేక జలాన్ని భక్తుల శిరస్సులపై చల్లి తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం ఆలయంలో నిత్యహోమాలు, బలిహరణలు, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల నడుమ ధ్వజావరోహణ వేడుకను శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయ ముఖమండపంలో స్వామివారి నవనీత కృష్ణ అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా, రాత్రి స్వామివారికి అశ్వవాహనంపై జరగాల్సిన తిరువీధి సేవను వర్షం కారణంగా రద్దు చేశారు. బుధవారం రాత్రి నిర్వహించే శ్రీపుష్పయాగోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని, గురువారం నుంచి ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను పునరుద్ధరించనున్నట్లు దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో నేడు

● ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం.

● రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం–పవళింపు సేవ.

● ప్రత్యేక అలంకారం: శయన మహావిష్ణువు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ మరుసటి రోజు మంగళవారం సాయంత్రం నిత్యకల్యాణ మండపంలో వేదసభను ఘనంగా నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యం అని అర్చకులు, పండితులు ఈ వేదికగా ఉద్బోధించారు. ఆచారంలో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై మేళతాళాల నడుమ మండపానికి చేర్చి, రజిత సింహాసనంపై విశేష పుష్పాలతో అలంకరించారు. ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు దంపతులు సమర్పించిన ఫల, పుష్పాలను స్వామివారి ముందుంచగా, పండితులు వేద మంత్రోచ్ఛరణలతో స్వామివారి గుణగణాలను కీర్తించారు. అనంతరం హారతులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, వేద పండితులను ఈఓ ఘనంగా సత్కరించారు.

నేత్రపర్వంగా తొళక్క వాహనంపై తిరువీధి సేవ

నేటితో క్షేత్రంలో ముగియనున్న దివ్య బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి ఆలయంలో ఆర్జిత సేవల పునరుద్ధరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement