దారయ్య: అన్నాలైనాయిరా అల్లుడా? మీ పాడి బర్రెకు దిష్టి పూసలతాడే దొరకలేదా.. బుట్టయగూడెంలో శనారపు సంతకు మొన్న వెళ్లలేదా!
దేవరాజు: ఏడికి వెళ్లేది మామా.. చేతిలో చిల్లిగవ్వ లేదు. మొన్న మీ మనవడికి అదేదో మాయదారి ఫ్లూ జ్వరమంటా వచ్చింది. జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తీసుకెళ్లా. పరీక్షలకని, మందులకని ఓ పాతికవేలు ఖర్చయ్యింది.
దారయ్య: అయ్యో పాపం.. ఎంత కష్టమొచ్చిందిరా అల్లుడా! నీకిద్దామంటే నాకాడా ఏమీ పైసలు లేవురా! మొన్న మీ అత్త నాగులమ్మ పాత నగలు తాకట్టు పెట్టి చేసిన మొక్కజొన్న పొలం వర్షాలు లేక ఎండిపోయింది. ఓ అరవై వేలు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయిరా!
దేవరాజు: అందరి పరిస్థితి అలానే ఉందిలే మామా! ఆ దేవునికి మన రైతులపై దయ కలగడం లేదేంటో మరి!
దారయ్య: ఆ దేవుడినెందుకురా దేవరాజూ నిందించుకోవడం. మన పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి కాని, రైతులే రాజులవుతారురా..
భీమన్న: ఏంటీ మామా అల్లుళ్లు పంచాయితీ పెట్టారు.. ఏంటి విషయం?
దేవరాజు: నీకు ఇది పంచాయితీలా కనిపిస్తుందా భీమన్నా.. మా కష్టాలు చెప్పుకుంటున్నాం.
భీమన్న: రైతుకు కష్టాలు కాక, ఎప్పుడు సుఖాలు ఉన్నాయి దేవరాజూ? మొన్న ఎన్నికల్లో చంద్రబాబు రైతుల కోసం రూ.500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టానన్నారు.. నీకు ఏమైనా ఇచ్చారా?
దారయ్య: దేవరాజూ.. రాజకీయ నాయకుల మాటలు ఎలా ఉంటాయంటే.. లేని నదిపైన వంతెన నిర్మిస్తానన్నట్లుగా ఉంటాయి. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆదుకుంటామన్నారు.. అది జరిగిందా.. చెప్పు.
దేవరాజు: ఇదిగో భీమన్నా.. ఆ సైకిల్‌పై వస్తుంది మన ఘంటయ్యే కాదా.. ఇటు పిలువు..
భీమన్న: వోయ్ ఘంటయ్యా.. ఏంటా స్పీడూ.. దేవరాజు పిలుస్తున్నాడు... సైకిల్ ఇటు తిప్పు.
ఘంటయ్య: (రచ్చబండపై కాలి పెట్టి దిగుతూ) ఏంటీ దేవరాజు.. అందరూ ఒకచోట చేరారు.. పొలానికి వెళ్లలేదా?
దేవరాజు: వర్షాలు లేవు కదా.. పొలానికి ఎందుకు వెళ్లడం! అది సరే కాని ఘంటయ్యా.. జీడిపప్పు, తునికాకు సేకరించడం మానేసి తాపీ పనికి వెళుతున్నావంటా.. అంత ఇబ్బంది ఏమొచ్చింది?
ఘంటయ్య: నా బాధలు ఏం చెప్పమంటారు బాబు! మొన్న మొక్కజొన్న వేస్తే అడవి పందులు నాశనం చేశాయి. ఎన్నికల్లో చంద్రబాబు చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తానన్నారు.. అది మా ప్రాంతంలో అమలు కావడం లేదు. అందుకే కూలీగా మారా.
పూర్ణమ్మ: (చెంగుతో ముఖంపై కారుతున్న చెమటను తుడుచుకుంటూ వచ్చి) ఇదిగో దారయ్య మామా.. నా జీవితంలో బియ్యం బస్తా రూ.2,200కి చేరిన ఘటన ఎప్పుడూ చూడలా.. సంతకు రూ.500 తీసుకెళ్తే అరసంచి కూడా సరుకులు నిండటం లేదు.. ఇలాగైతే ఎలా బతికేది మామ?
దారయ్య: (పకపక నవ్వుతూ) పూర్ణమ్మ.. మొన్న కారు డ్రైవర్ సుందరం భార్య లక్ష్మి ఆరుబయట కట్టెలతో వంట చేస్తోంది.. ఇదేంటమ్మా అంటే.. ఏం చెప్పను బాబాయ్ గారు.. గ్యాస్ రూ.1,000 పైకే చేరింది, పిల్లలతో కష్టమవుతోంది.. అందుకే ఇలా కట్టెలతో చేస్తున్నానని బోరుమంది.
పూర్ణమ్మ: ఇదే కాదు మామా.. వంట నూనె లీటరు రూ.180 పైనే చేరింది. కందిపప్పు కూడా రూ.130 పైనే కూర్చుంది. ఇలా అన్ని నిత్యావసర ధరలు పెంచేశారు.. కూలీ డబ్బులతో ఎలా బతకాలో తలుచుకుంటే నిద్ర పట్టడం లేదు.. ఈ రోజులు ఎప్పుడు మారతాయో ఏంటో..
గుబ్బాలమ్మ (దారయ్య భార్య): ఏమయ్యో.. అదేదో అర్నబ్ తుపానంటా.. మనవైపే వస్తుందంటా.. మేకలన్నీ అడవిలోనే ఉన్నాయి.. బేగా రా.. రేపు మాట్లాడొదికాని! (అని చెప్పడంతో అందరూ పరుగున ఇంటి ముఖం పట్టారు.) –కైకలూరు
కిరాణా కొట్టుకెళ్లి పప్పుల రేట్లు చూస్తే గుండెల్లో
గుబులు.. కూరగాయల మార్కెట్లో ఉల్లిపాయల
ధరలతో కన్నీళ్లు.. గ్యాస్ బండ కొనాలంటే రెండు ఐదొందల నోట్లు గల్లంతు.. ఓ బస్తా బియ్యం కొనాలంటే ఏకంగా రూ.2,200కు పైనే! ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు.. జేబులో చేయి వేస్తే చిరిగిన గుడ్డ నుంచి చిల్లర కాస్తా పారిపోయే పరిస్థితి. ఇది నేడు మధ్యతరగతి, సామాన్యులు ఎదుర్కొంటున్న దుస్థితి. ఇటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిపడ్డాయి. ప్రస్తుత ఎన్నికలపై గ్రామ పెద్దల మధ్య సాగిన సంభాషణ పరిశీలిస్తే..


