అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

● ఏలూరు జిల్లా జైలులో పరిచయం

● కాపర్‌వైర్‌ చోరీలే లక్ష్యం

● వివరాలు వెల్లడించిన ఎస్పీ శివకిషోర్‌

ఏలూరు టౌన్‌: జైళ్లలో పరివర్తనం చెందాల్సిన నేరస్తులు ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏలూరు జైలులో పరిచయమైన దొంగలు ఒక ముఠాగా ఏర్పడి, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో వ్యవసాయ క్షేత్రాల్లోని ట్రాన్స్‌ఫార్మర్ల రాగివైరును చోరీ చేస్తూ రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. ఈ ముఠాను జంగారెడ్డిగూడెం సర్కిల్‌ పరిధిలోని లక్కవరం పోలీసులు చాకచక్యంగా అరెస్ట్‌ చేసి, రూ.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

కేసు వివరాలు

ఈ నెల 27న లక్కవరం పోలీసులు గుర్వాయిగూడెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక క్రెటా కారు, మోటార్‌సైకిల్‌లో ఉన్న ఐదుగురు నిందితులు, ఒక బాలుడిని (జువైనల్‌) అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి క్రెటా కారు, బైక్‌, 13 కేసులకు సంబంధించిన 35 ట్రాన్స్‌ఫార్మర్ల రాగివైరు (1020 కిలోలు), టూల్‌కిట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన లక్కవరం ఎస్సై ఎస్‌కే జబీర్‌, సీఐ ఎంవీ సుభాష్‌లను ఎస్పీ అభినందించారు.

నేర చరిత్ర

ద్వారకాతిరుమల మండలం తూర్ల లక్ష్మీపురం గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు కోడూరి రవితేజపై ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం పీఎస్‌లలో రౌడీ, సస్పెక్ట్‌ షీట్లు ఉండగా.. హత్య, నకిలీ నోట్లు, చీటింగ్‌ వంటి సుమారు 32 కేసులు ఉన్నాయి. చింతలపూడి ఎన్‌వీఎన్‌ కాలనీకి చెందిన చుండ్రు అనిల్‌ కుమార్‌ (కాపర్‌ వైర్‌ చోరీ కేసులు), రెడ్డిగూడెం గ్రామం రాముడుకుంటకు చెందిన అన్యం లోకేష్‌, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కోలమూరుకు చెందిన దగ్గుపల్లి జోగమారేష్‌, మువ్వా జగన్‌, ఒక బాలుడు వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

జైలు పరిచయాలే మూలం

హత్యయత్నం కేసులో జైలులో ఉన్న రౌడీషీటర్‌ రవితేజకు.. ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ కేసులో వచ్చిన అనిల్‌కుమార్‌, గంజాయి కేసులో వచ్చిన జోగమారేష్‌తో జైలులో పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురూ 2026 జూన్‌, జూలై నెలల్లో విడుదలయ్యాక మిగతా వారితో కలిసి ముఠా కట్టారు. రాత్రివేళల్లో కారు, బైక్‌లపై తిరుగుతూ వ్యవసాయ క్షేత్రాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి, రాగివైరును అమ్ముతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు విచారణలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement