ఆక్వా రంగానికి అర్నాబ్‌ ముప్పు | - | Sakshi
Sakshi News home page

ఆక్వా రంగానికి అర్నాబ్‌ ముప్పు

Oct 27 2026 1:02 AM | Updated on Oct 27 2026 1:02 AM

ఆక్వా రంగానికి అర్నాబ్‌ ముప్పు ● ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు ● ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు

వలస కూలీలు అప్రమత్తం

చేపల, రొయ్యల చెరువులపై పనులు చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వేలాది కుటుంబాలు ఆక్వా ప్రాంతాలకు వలసలు వచ్చారు. అనేక మండలాల్లో ఊరి చివరి చెరువు గట్లుపై వీరు నివసిస్తున్నారు. ఆయా చెరువుల యజమానులు వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించండి. తుపాను కారణంగా ఆక్వా రైతులు అప్రమత్తంగా వ్యవహరించండి.

– ఎం.రవికుమార్‌, మత్స్యశాఖ సహాయ సంచాలకులు కై కలూరు

కై కలూరు: అధిక మేతల ధరలతో ఇప్పటికే అతలాకుతలమైన ఆక్వారంగానికి అర్నాబ్‌ తుపాను రూపంలో మరో పెద్ద ముప్పు పొంచి ఉంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మా పరిస్థితి తయారైందని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో చేపల సాగు, 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు... వెరసి 2.90 లక్షల ఎకరాల్లో ఈ సాగు జరుగుతోంది. ప్రధానంగా కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఆక్వా సాగు విస్తీర్ణం సింహభాగం ఆక్రమించి ఉంది. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఆరంభంలో తుపాన్లు లేకపోవడంతో దీమాగా ఉన్న ఆక్వారైతన్నకు, ఇప్పుడు అర్నాబ్‌ తుపాను ముప్పు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

తీవ్రంగా తుపాను ప్రభావం!

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్‌ ప్రకారం.. అర్నాబ్‌ తుపాను ఈ నెల 28న బాపట్ల – విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గంటకు 115 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రధానంగా తీరానికి సమీపంలోని ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బలమైన గాలులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి, చెరువుల్లో ఆక్సిజన్‌ అందక రొయ్యలు మృత్యువాతపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తుపాను సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను కై కలూరు మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎం.రవికుమార్‌ సోమవారం వివరించారు.

విద్యుత్‌ పరికరాల రక్షణ

● చెరువుల వద్ద ఉండే ప్యానెల్‌ బోర్డులు, స్టార్టర్లు, విద్యుత్‌ మీటర్లపై వర్షపు నీరు పడకుండా ప్లాస్టిక్‌ షీట్లు, కవర్లతో గట్టిగా కప్పి ఉంచాలి.

● తుపాను తీవ్రత, ఈదురుగాలులతో భారీ వర్షం పడుతున్నప్పుడు చెరువుల వద్దకు వెళ్లకుండా, ముందే మెయిన్‌ స్విచ్‌లు ఆఫ్‌ చేసుకోవడం సురక్షితం.

● విద్యుత్‌ షాక్‌లు రాకుండా ఉండేందుకు అన్ని మోటార్లు, ప్యానెల్‌ బోర్డులకు సరైన ఎర్త్‌ కనెక్షన్‌ ఉందో లేదో ముందే సరిచూసుకోవాలి.

● తక్కువ ఎత్తులో ఉండి, నీటి ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న పంపింగ్‌ మోటార్లను ముందే విప్పి ఎత్తైన ప్రాంతాల్లోని సురక్షిత భవనాలకు మార్చాలి.

● చెరువులలో ఉండే ఏరియేటర్లకు వెళ్లే విద్యుత్‌ వైర్లు, కేబుల్స్‌ నీటిలో మునిగిపోకుండా, గాలికి కొట్టుకుపోకుండా గట్టిగా కట్టి ఉంచాలి. ఇన్సులేషన్‌ దెబ్బతిన్న వైర్లను వెంటనే మార్చాలి.

● తుపాను సమయంలో విద్యుత్‌ సరఫరా గంటలు లేదా రోజుల తరబడి నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత రాకుండా ప్రత్యామ్నాయంగా డీజిల్‌ జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలి.

● చెరువుల చుట్టూ ఉన్న విద్యుత్‌ స్తంభాలు, వైర్లు గాలికి తెగిపడితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు. వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం అందించాలి.

చెరువు గట్లు, నీటి నిర్వహణ

● భారీ వర్షాలకు గట్లు తెగిపోకుండా, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ముందే మట్టి బస్తాలు వేసి పటిష్టం చేసుకోవాలి.

● చెరువుల్లో నీటి మట్టం పెరిగి రొయ్యలు, చేపలు బయటకు కొట్టుకుపోకుండా ఉండేందుకు... అదనపు నీరు బయటకు వెళ్లే మార్గాలకు బలమైన వలలు (నెట్లు) ఏర్పాటు చేసుకోవాలి.

ఆక్సిజన్‌, పీహెచ్‌ నిర్వహణ

● తుపాను కారణంగా కురిసే భారీ వర్షాల వల్ల చెరువు నీటిలో పీహెచ్‌, లవణీయత (సెలెనిటీ) అకస్మాత్తుగా పడిపోతాయి. దీనిని నియంత్రించడానికి సరిపడా అగ్రికల్చరల్‌ లైమ్‌ (సున్నం), డోలమైట్‌, పొటాషియం నిల్వలను ముందే సిద్ధం చేసుకోవాలి.

● విద్యుత్‌ నిలిచిపోయి ఏరియేటర్లు ఆగిపోతే, అత్యవసరంగా ఉపయోగించడానికి ఆక్సిజన్‌ పౌడర్‌ లేదా ట్యాబ్లెట్లను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement