వార్డుల విభజన అవకతవకలపై నిరసన | - | Sakshi
Sakshi News home page

వార్డుల విభజన అవకతవకలపై నిరసన

Oct 27 2026 1:02 AM | Updated on Oct 27 2026 1:02 AM

చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక అధికారులు అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నగర పంచాయతీ కమిషనర్‌ ఏ.రాంబాబుకు వినతిపత్రం సమర్పించారు.

గందరగోళంగా ఓటర్ల జాబితా

ఈ సందర్భంగా జిల్లా మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, మున్సిపల్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆతుకూరి సుబ్బారావు విలేకరులతో మాట్లాడారు. నగర పంచాయతీలో గతంలో 20 వార్డులు ఉండగా, డీలిమిటేషన్‌ ప్రక్రియలో భాగంగా వాటిని 23 వార్డులకు పెంచుతున్నట్లు అధికారులు గతంలో తెలిపారని గుర్తుచేశారు. సర్వే నంబర్ల ప్రాతిపదికన చేపట్టిన విభజనపై తాము అభ్యంతరాలు వ్యక్తం చేసిన అనంతరం, ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వార్డుల సరిహద్దులను స్క్రీన్‌పై ప్రదర్శించి నిర్ధారించారని తెలిపారు. అయితే, తాజాగా విడుదల చేసిన వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అధికారుల మాటలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు ఎక్కడా పొంతన లేదని నేతలు మండిపడ్డారు. ఈ నెల 24న పూర్తిస్థాయి జాబితాలు ఇస్తామని చెప్పి, పట్టణంలోని ఓటర్లను ఇష్టానుసారంగా వేర్వేరు వార్డుల్లోకి మార్చి గందరగోళం సృష్టించారని విమర్శించారు. దీనిపై అధికారులను నిలదీస్తే ‘ఓటర్ల జాబితాలో ఇక ఎలాంటి మార్పులూ సాధ్యం కావు’ అంటూ ఏకపక్షంగా, బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై ఇప్పటికే ఏలూరు జిల్లా ఎన్నికల అబ్జర్వర్‌ మిరియాల శేషగిరిబాబుకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశామని, ఆయన ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బొడ్డు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అవసరమైతే న్యాయపోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇప్పటికై నా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, లోపాలను సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నిమ్మగడ్డ దుర్గారావు, వెంప కృష్ణ, కన్నాబాబు, కె.మోహన్‌, బి.చెంచంరాజు, డొకల రాము, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం

సమగ్ర విచారణ చేయాలని కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ నేతల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement