జంగారెడ్డిగూడెం(బుట్టాయగూడెం) : జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల భద్రతా ఏర్పాట్లను ఆదివారం ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను, మార్కెట్ యార్డ్, నోవా కాలేజీల వద్ద స్ట్రాంగ్ రూమ్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేంజ్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి సమర్థవంతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని స్పష్టం చే శారు. నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయిందని, కౌంటింగ్, పోలింగ్ సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా
జిల్లాలో సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి ఎలాంటి ఘర్షణలు, ఉద్రిక్తతలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ శివకిషోర్ తెలిపారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద బారికేడింగ్, సీసీ కెమెరాల నిఘా, తుది కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. తనిఖీల అనంతరం జంగారెడ్డిగూడెం డివిజనల్ పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో ఐజీ, ఎస్పీలు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల బందోబస్తు ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ డి.వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ ఎంవీ సుభాష్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏలూరు ఐజీ అశోక్‌కుమార్


