ఉంగుటూరు: ఉంగుటూరు మండల పరిధిలోని ఉంగుటూరు–1, గోపీనాథపట్నం ఎంపీటీసీ స్థానాల నామినేషన్ల పరిశీలనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంపై వివాదం చెలరేగింది. పాలకపక్ష నాయకుల ఒత్తిళ్లతోనే అధికారులను అందుబాటులో లేకుండా చేసి, తమ అభ్యర్థిత్వాలను కావాలనే తిరస్కరించేలా చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆదివారం ఏలూరు ఆర్డీవో కోర్టులో అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఉంగుటూరు–1 స్థానం నుంచి పోటీ చేసిన రామేన వెంకట సాయిలక్ష్మి, గోపీనాథపట్నం స్థానం నుంచి పోటీ చేసిన పుచ్చకాయల శాంభవి ఆర్డీవోకు నేరుగా తమ వినతిపత్రాలను సమర్పించారు. సోమవారం ఆర్డీవో కోర్టులో ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. అభ్యర్థులు తమ తరఫున వాదనలు వినిపించనుండగా, రిటర్నింగ్ అధికారి కూడా హాజరై నామినేషన్ల తిరస్కరణపై వివరణ ఇవ్వనున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం ఆర్డీవో తుది నిర్ణయం వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో పాటు ఆర్డీవో కోర్టుకు వెళ్లిన వారిలో మాజీ ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, సొసైటీ మాజీ అధ్యక్షుడు ఎలిశెట్టి పాపారావు (బాబ్జి), వైఎస్సార్‌సీపీ నాయకులు పుప్పాల గోపి, మరడ మంగారావు ఉన్నారు.
ఆర్డీవో కోర్టులో అప్పీల్ చేసిన
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు


