ఉంగుటూరు: ఉంగుటూరు రెవెన్యూ అటవీ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన సంధ్యారాణి (41) మృతదేహానికి శనివారం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తిచేశారు. చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ ఆధ్వర్యంలో శవపంచనామా నిర్వహించిన అనంతరం, భౌతికకాయాన్ని బంధువులకు అప్పగించారు. ఆ తర్వాత రౌతులపర్రు గ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మృతురాలి బంధువులు, పరిచయస్తులను విచారించి సమాచారం సేకరిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో గండికోట అజయ్ అనే వ్యక్తిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉన్న పరిచయాలు లేదా వివాహేతర సంబంధం నేపథ్యంలోనే పథకం ప్రకారం ప్రణాళిక రచించి ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఏం జరిగింది?
నాచుగుంట పంచాయతీ పరిధిలోని ఉంగుటూరు రెవెన్యూ ఫారెస్ట్ బి బ్లాక్‌లో డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ వెనుక భాగంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున సగం కాలిన మహిళ మృతదేహాన్ని స్థానిక రైతులు గుర్తించి చేబ్రోలు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో భాగంగా ఆ మహిళ ఉంగుటూరు మండలం రావులపర్రుకు చెందిన సంజయ సంధ్యగా గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్య జరిగిందా లేదా పథకం ప్రకారం వేరే ప్రాంతం నుంచి ఆమెను ఇక్కడికి రప్పించి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


