ఏలూరు (ఆర్ఆర్పేట) : కార్తీక మాసం సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం తెలిపారు. శనివారం స్థానిక జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ప్రత్యేక బస్సు సర్వీసులకు సంబంధించిన వాల్పోస్టర్లు, కరపత్రాలు, స్టిక్కర్లను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్తీక మాసంలో శబరిమలై వెళ్లే అయ్యప్ప మాలధారుల సౌలభ్యం కోసం ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేరళ, తమిళనాడులోని వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించేలా ఈ టూర్లను రూపొందించామన్నారు. ప్రయాణ కాలం ఆధారంగా చార్జీలను నిర్ణయించామని, 4 రోజుల ప్రయాణానికి రూ.5,200, 6 రోజులకు రూ.6,000, 10 రోజులకు రూ.9,000గా ధరలు ఖరారు చేసినట్లు వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలోని ప్రఖ్యాత పంచారామ క్షేత్రాలను ఒకేసారి దర్శించుకునేలా పంచారామ క్షేత్ర దర్శిని పేరుతో ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు. అల్ట్రా డీలక్స్ బస్సుకు రూ.1,100, సూపర్ లగ్జరీ బస్సుకు రూ.1,200గా టికెట్ ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పంచారామ క్షేత్ర దర్శిని సర్వీసులు కార్తీక మాసంలోని ప్రతి ఆదివారం (నవంబర్ 15, 22, 29, డిసెంబర్ 6 తేదీల్లో) రాత్రి 8 గంటలకు బయలుదేరి, తిరిగి సోమవారం సాయంత్రానికి ఏలూరు చేరుకుంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ బి. వాణి, ఆర్టీసీ కార్గో ఏటీఎం జీఎల్పీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


