కుక్కునూరు : వేలేరు ఎంపీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలన్న కూటమి నాయకుల ప్రయత్నాలకు గండికొడుతూ, ఓ సామాన్య ట్రాలీ ఆటో డ్రైవర్ వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికల బరిలో నిలవడం మండల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాజకీయ అండదండలు, ఆర్థిక బలం లేకపోయినా వెనుకడుగు వేయకుండా నామినేషన్ దాఖలు చేసిన పంజాల శ్రీనివాస్ గౌడ్ ధైర్యం స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన కొందరు నాయకులు ఇప్పుడు కూటమి వైపు మొగ్గుచూపుతూ వారికి తలొగ్గిన నేపథ్యంలో కిరాయి నిమిత్తం కరీంనగర్ వెళ్లిన శ్రీనివాస్ గౌడ్ ఈ విషయం తెలుసుకొని హుటాహుటిన అక్కడినుంచి వచ్చారు. కార్యకర్తలే అసలైన బలమని నమ్మే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటలను నిజం చేసేలా గురువారం ఆయన ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. వేలేరు పంచాయతీలో ఆర్థిక, రాజకీయ పలుకుబడితో ఆధిపత్యం చెలాయిస్తున్న నాయకులను ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఏకగ్రీవాల కంటే ప్రజాస్వామ్యబద్ధమైన పోటీ ముఖ్యమని భావించి, ఓడినా పర్వాలేదు కానీ ఎన్నికల బరిలో నిలవాలన్న సంకల్పంతో నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన వైఖరి స్పష్టం చేస్తోంది. శ్రీనివాస్ గౌడ్ ధైర్యసాహసాలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.


