ఏలూరు (టూటౌన్): జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియ గురువారం రెండో రోజూ కొనసాగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో 27 జెడ్పీటీసీ స్థానాలకు గాను 78 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు 8 నామినేషన్లు దాఖలు కాగా.. మొత్తంగా 86 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. జిల్లాలోని నూజివీడు, టి.నర్సాపురం, లింగపాలెం మండలాల నుంచి ఏ ఒక్కరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, నిడమర్రు, పెదవేగి మండలాల నుంచి ఒక్కో నామినేషన్ దాఖలు కాగా.. అత్యధికంగా ముదినేపల్లి నుంచి ఏడుగురు, ఏలూరు, కై కలూరు, కామవరపుకోట, కొయ్యలగూడెం, మండవల్లి నుంచి ఆరుగురు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే జిల్లాలోని 454 ఎంపీటీసీ స్థానాలకు మొదటిరోజు 222 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం కూడా భారీ నామినేషన్లు దాఖలు అయ్యాయి.
పశ్చిమలో..
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని 20 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఎన్నికల నామినేషన్లు రెండో రోజు జోరందుకున్నాయి. స్థానిక జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద అభ్యర్థులతో సందడి నెలకొంది. గురువారం 66 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తొలిరోజు 10 నామినేషన్లతో కలిపి మొత్తంగా 76 నామినేషన్లు దాఖలయ్యాయి.
మండలాల వారీగా..
జెడ్పీటీసీ స్థానాలకు మండలాల వారీగా ఆచంట 5, ఆకివీడు 4, అత్తిలి 4, భీమవరం 1, యలమంచిలి 2, గణపవరం 3, ఇరగవరం 2, కాళ్ల 5, మొగల్తూరు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే నరసాపురం 3, పాలకొల్లు 4, పాలకోడేరు 2, పెంటపాడు 5, పెనుగొండ 4, పెనుమంట్ర 3, పోడూరు 5, తాడేపల్లిగూడెం 8, తణుకు 4, ఉండి 4, వీరవాసరం 4 నామినేషన్లు దాఖలయ్యాయి.
371 ఎంపీటీసీ స్థానాలకు..
జిల్లాలోని 371 ఎంపీటీసీ స్థానాలకు గురువారం 850 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా రెండు రోజుల్లో 1,042 నామినేషన్లు దాఖలైనట్టు జిల్లా ముఖ్య ఎన్నికల అధికారి తెలిపారు. వీటిలో వైఎస్సార్‌సీపీ నుంచి 431, టీడీపీ నుంచి 365, జనసేన నుంచి 180, బీజేపీ నుంచి 22, సీపీఎం నుంచి 6, బీఎస్పీ నుంచి 6, కాంగ్రెస్ నుంచి 3, స్వతంత్ర అభ్యర్థులు 25 మంది నామినేషన్లు వేశారు.
జీలుగుమిల్లి జెడ్పీటీసీ అభ్యర్థిని కోరస సూరమ్మను నామినేషన్ వేసేందుకు తీసుకువస్తున్న ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, తెల్లం రాజ్యలక్ష్మి
ఏలూరులో జెడ్పీ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు


